ఈ సోదంతా మాకెందుకు అనేవారు!

అమ్మాయిలకు గాడ్జెట్లు... సాంకేతికత గురించిన ఆసక్తి తక్కువ అనే అపవాదు ఉంది..  అది నిజం కాదని నిరూపిస్తూ కొత్తకొత్త పరికరాలని సరళమైన భాషలో పరిచయం చేస్తూ శెభాష్‌ అనిపించుకుంటోంది హైదరాబాద్‌ అమ్మాయి పలివెల నాగసత్య అనూష.

Updated : 05 Oct 2023 07:04 IST

అమ్మాయిలకు గాడ్జెట్లు... సాంకేతికత గురించిన ఆసక్తి తక్కువ అనే అపవాదు ఉంది..  అది నిజం కాదని నిరూపిస్తూ కొత్తకొత్త పరికరాలని సరళమైన భాషలో పరిచయం చేస్తూ శెభాష్‌ అనిపించుకుంటోంది హైదరాబాద్‌ అమ్మాయి పలివెల నాగసత్య అనూష. సింపుల్‌ఘర్‌ తెలుగుతో పదిలక్షలమంది అభిమానులని సంపాదించుకున్న ఈ అమ్మాయి వసుంధరతో మాట్లాడింది...

మనలో చేయాలన్న ఉత్సాహం ఉండాలే కానీ.. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. కొవిడ్‌ నాకలాంటి అవకాశాన్నిచ్చింది. అదెలా అంటే.. నేను పుట్టిపెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో. నాన్న వీరాచార్యులు బీయస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసేవారు. అమ్మ రాధామణి. ఇద్దరు అన్నయ్యలు. నాన్న మాతో ఫ్రెండ్లీగా ఉంటూనే ఎన్నో విషయాల్లో ప్రోత్సహించేవారు. తాడేపల్లిగూడెంలో బీటెక్‌ చేశా. అభిలాష్‌తో పెళ్లయ్యాక హైదరాబాద్‌ వచ్చా. ఆయన డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగి. నేనూ ఏడాది పాటు డిజిటల్‌ మార్కెటింగ్‌ చేశా. కొవిడ్‌ సమయంలో వస్తువులన్నీ ఆన్‌లైన్‌లోనే కొనేవాళ్లం. అవి ఇంటికి వచ్చేసరికి పాడవ్వడమో లేక నాణ్యతలేకపోవడమో జరిగేది. చుట్టుపక్కల ఇళ్లలోనూ ఇలా జరగటం గమనించా. నాకు తెలిసిన చాలామంది ‘ఏది కొంటే మంచిదంటావ్‌’ అని అడిగేవారు. నేనూ నాణ్యమైన పరికరాల గురించిన సమాచారం ఎవరైనా ఇస్తారేమో అని యూట్యూబ్‌లో వెతికా. ఎక్కడా దొరకలేదు. అప్పుడే అనుకున్నా.. ఆన్‌లైన్‌లోని వస్తువులని పరీక్షించి నిజాయితీగా రివ్యూ ఇవ్వాలని. 2021లో స్నేహితుడి సాయంతో కొన్ని వీడియోలు చేశా. వాటికి అంత ఆదరణ రాలేదు. ఇలా కాదని.. పూర్తిగా ఇంటి అవసరాల కోసం వాడే.. ఐరన్‌ బాక్స్‌లు, మిక్సీలు, ప్లగ్గులు, ఫ్యాన్లు వంటివి కొనుగోలు చేసి షార్ట్‌ వీడియోలు చేశా. ఆన్‌లైన్‌లో మంచి రేటింగ్‌ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలంటే డబ్బులు ఉండాలిగా. ఆ విషయంలో మావారు సాయం చేశారు. ప్రతి వస్తువును మొదట మేం వాడిన తర్వాతే దానిపై వీడియోలను తీసేదాన్ని. కాస్త పట్టుచిక్కాక.. ‘సింపుల్‌ఘర్‌ తెలుగు’ ఛానెల్‌ని ప్రారంభించా. ‘మొదట్లో ఈ సోదంతా మాకెందుకు?’ ‘తెలిసిన విషయాలే చెబుతున్నావ్‌.. కొత్తగా చెప్పు’ అంటూ విమర్శించేవారు. అవన్నీ తట్టుకుని నిలబడినా ఏడాదివరకూ పదివేల మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఉండేవాళ్లు. తర్వాతర్వాత కొత్త పరికరాలు పరిచయం చేసేసరికి.. చాలామంది ‘మీ కారణంగా నాణ్యమైన వస్తువు కొన్నాం ధన్యవాదాలు’ అంటూ కామెంట్లు పెట్టేవాళ్లు. ఆర్డరు కోసం లింక్‌ అడిగేవాళ్లు. అలా నా వీడియోలు ఎక్కువ మంది చూసేవారు.

అందుకే ఆపలేదు....

మొదట్లో ఒక వీడియో చేయడానికి వారం పట్టేది. భయం, బెరుకు ఉండేవి. మావారి ప్రోత్సాహంతో ఆ భయాల్ని అధిగమించాను. ఇక పెద్ద వీడియోలు చేసేటప్పుడు ఎవరూ చూసేవారు కాదు. దాంతో ఆపేయటం మంచిది అనుకున్నా. నా స్నేహితులు కూడా ‘బీటెక్‌ చదివావు.. మంచి ఉద్యోగం చేసుకోక ఎందుకీ వీడియోలు’ అన్నారు. ప్రేక్షకుల స్పందన చూశాక ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్లే ‘ఒక సెల్ఫీ ప్లీజ్‌’ అంటున్నారు. అయితే ఇదంతా నా ఒక్క దాని వల్ల సాధ్యం కాలేదు. మేం ఐదుగురం కలిసి పని చేస్తున్నాం. 2022లో సిల్వర్‌ బటన్‌ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత ఒక్కో వీడియో వైరల్‌ అవుతూ వచ్చింది. ఇప్పడు వారానికి ఆరేడు వీడియోలను చేస్తున్నా. ఇప్పటివరకు దాదాపుగా 270 వీడియోలు చేశా. ప్రస్తుతం... 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెలకు రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకూ ఆదాయం వస్తోంది. స్నేహితుల సాయంతో హిందీ, మలయాళం, ఇంగ్లిష్‌ భాషల్లోనూ ఈ ఛానెళ్లని ప్రారంభించా. నాణ్యమైన వస్తువులను పరిచయం చేయాలన్నదే నా కోరిక.

- అదపాక సాయి, ఈజేఎస్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్