చెన్నైలో తెలుగు ప్రతిభ!

మన గోదావరి జిల్లాల తెలుగమ్మాయి. చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ టాపర్‌ అవ్వడమే కాదు.. పదమూడు బంగారు పతకాలు సొంతం చేసుకుని శభాష్‌ అనిపించుకుంది.

Published : 08 Oct 2023 02:03 IST

మన గోదావరి జిల్లాల తెలుగమ్మాయి. చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ టాపర్‌ అవ్వడమే కాదు.. పదమూడు బంగారు పతకాలు సొంతం చేసుకుని శభాష్‌ అనిపించుకుంది. 26 ఏళ్ల మొగలపు సాయి సంహిత విజయగాథ ఇది..

న తల్లిదండ్రులిద్దరికీ డాక్టర్‌ అవ్వాలని కల ఉండేది. కానీ నెరవేరలేదు. వాళ్ల నోటి నుంచి ఈ మాటల్ని ఎన్నో సార్లు విన్నది సంహిత. వాళ్లకి సాధ్యం కాని కలని తను సాధించి చూపించాలనుకుంది. ఆ లక్ష్యం కోసం కసిగా చదివింది. ఎంబీబీఎస్‌లో 13 విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించి అన్నామలై విశ్వవిద్యాలయం టాపర్‌గా నిలిచింది. గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి చేతుల మీదుగా స్వర్ణ పతకం, పట్టా అందుకుంది. బుధవారం జరిగిన స్నాతకోత్సవానికి ముందు గంటపాటు గవర్నర్‌ తనతో ముచ్చటించడం సంతోషంగా ఉందని చెబుతోంది సంహిత. ‘నాన్న సుధాకర్‌. ఆయన స్వగ్రామం కడియంలోని మురమండ. వ్యాపారరీత్యా 27ఏళ్ల కిందటే మా కుటుంబం చెన్నై వచ్చి స్థిరపడింది. అమ్మ సుజాత. ఇద్దరికీ వైద్య విద్య అంటే ప్రాణం. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదవలేకపోయారు. ఈ విషయాన్నే ఇంట్లో తరచూ అనేవారు. ఆ మాటలే నన్ను ఎంబీబీఎస్‌ వైపు నడిపించాయి. నా లక్ష్యం ముందే నిర్ణయించుకున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రణాళికబద్ధంగా చదవడం అలవాటు చేసుకున్నా. మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో ప్లస్‌ 2 వరకు చదివాను. కడలూరులోని రాజా ముత్తయ్య వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ (2016-2022) పూర్తి చేశా. గత ఏడాది నీట్‌ పీజీలో జాతీయ స్థాయిలో 477, రాష్ట్రస్థాయిలో 62వ ర్యాంకు సాధించా. చెన్నైలోని మద్రాస్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో చేరాను. ఎంబీబీఎస్‌ చదివేటప్పుడు ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలనీ, తెల్లవారుజామున కనీసం గంటయినా చదవాలని ప్రణాళిక రూపొందించుకుని దాన్నే ఆచరణలో పెట్టా. ఆ పక్కా ప్రణాళికే నన్ను ఎంబీబీఎస్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిపింది. ఇందుకు మా అమ్మ నాకు బాగా సాయం చేసింది. తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి అక్కడే ప్రాక్టీసు చేయాలన్నది నా కల. చెన్నైలో పెరిగినా చిన్నతనంలో వేసవి సెలవులకు మా ఊరు వెళ్లినప్పుడు అక్కడ అమ్మమ్మ, నాన్నమ్మల వద్ద తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నా.  వైద్యవృత్తి అంటేనే సేవ చేయడం, అంకితభావంతో వైద్యురాలిగా సేవలు అందిస్తా’నని చెబుతోంది సంహిత.

 కటికల సతీష్‌బాబు, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్