ఆర్కిటెక్ట్‌.. ఎలా అయ్యావన్నారు!

నాట్యమంటే ప్రాణమిచ్చే అమ్మాయికి అడుగేసినా ప్రమాదమేనని తెలిస్తే? ప్రతి గీత, కోణం పట్టి పట్టి చూడాల్సిన ఆర్కిటెక్ట్‌కి మసక చూపే దిక్కయితే ఎలాగుంటుంది? నా పరిస్థితి అదే! చిన్నప్పట్నుంచీ శాస్త్రీయ సంగీతమన్నా, నాట్యమన్నా ప్రాణం నాకు. దేశవ్యాప్తంగా 500 ప్రదర్శనలిచ్చా. ఆ సమయంలోనే పురాతన కట్టడాలు నన్ను ఆకర్షించాయి.

Updated : 09 Oct 2023 07:11 IST

కళాకారిణిగా ఎదగాలని.. ఆర్కిటెక్ట్‌గా కలలు పండించుకోవాలని ముంబయిలో అడుగుపెట్టిందా అమ్మాయి. కొన్నిరోజులకే అరుదైన వ్యాధికి గురై పట్టుమని పదినిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి. అలాగని తన కలలని వదులుకోలేదు. పట్టుదలతో అభిరుచులని ముందుకు తీసుకెళ్లి తనలాంటి వారికి అండగా ఉంటోంది.. కావ్యపూర్ణిమ బలిజేపల్లి..


జీవితాన్ని మార్చేసే సవాళ్లు, అనిశ్చితి ఎవరికైనా ఎదురవొచ్చు. వాటికి భయపడుతూ కూర్చోక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నేను చేస్తోందదే.. కాకపోతే నాలాంటి వారికి సాయపడాలన్న ఆలోచననూ జత చేశా!

నాట్యమంటే ప్రాణమిచ్చే అమ్మాయికి అడుగేసినా ప్రమాదమేనని తెలిస్తే? ప్రతి గీత, కోణం పట్టి పట్టి చూడాల్సిన ఆర్కిటెక్ట్‌కి మసక చూపే దిక్కయితే ఎలాగుంటుంది? నా పరిస్థితి అదే! చిన్నప్పట్నుంచీ శాస్త్రీయ సంగీతమన్నా, నాట్యమన్నా ప్రాణం నాకు. దేశవ్యాప్తంగా 500 ప్రదర్శనలిచ్చా. ఆ సమయంలోనే పురాతన కట్టడాలు నన్ను ఆకర్షించాయి. మాది శ్రీకాకుళం. అమ్మ లక్ష్మి, నాన్న వెంకట రమణశాస్త్రి. ఇంటరయ్యాక ముంబయిలో ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌)లో చేరా. నచ్చిన విద్య.. ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుండేది. చివరి ఏడాదిలో ‘శాస్త్రీయ నృత్యాలయ’మనే అంశంపై థీసిస్‌ ప్రారంభించా. సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలను రూపొందించడం దీని ఉద్దేశం. విజయవంతం అయితే ‘అమరావతి’కీ ఉపయోగ పడుతుందనుకున్నా. అప్పుడే నెలసరిలో విపరీతమైన రక్తస్రావంతో నీరసించిపోయా. ఆసుపత్రికెళ్తే పీసీఓఎస్‌ ఉందన్నారు. దానికి చికిత్స తీసుకుంటున్నప్పుడు ఇడియోపాతిక్‌ ఇంట్రక్రేనియల్‌ హైపర్‌టెన్షన్‌ తోడైంది. ఈ నాడీవ్యవస్థ సంబంధిత వ్యాధి కారణంగా ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయింది. ఇక కుడిదేమో చిన్న రంధ్రంలోంచి చూస్తే ఎలాగుంటుందో అలా కనిపిస్తుందంతే! శస్త్రచికిత్స చేసినా ఫలితం లేదు.

దెబ్బ మీద దెబ్బ!

వరుస అనారోగ్యాలు, సర్జరీలు.. ఇవన్నీ సరిపోనట్టు ఆస్టియోపోరోసిస్‌ తోడైంది. పదినిమిషాలు కూర్చోలేను. నడక కాస్త తడబడినా ఎముకలు విరిగిపోతాయి. సర్జరీ తప్పనిసరి. చదువు ఆగిపోయింది. భవిష్యత్తేంటో తెలియలేదు. మనసు మరల్చుకోవడానికని పెయింటింగ్‌పై దృష్టిపెట్టా. ఆలోచనలన్నీ చదువుకేసే మళ్లేవి. అదే చెబితే ప్రైవేటుగా డిగ్రీ చేయమన్నారంతా. నాకేమో ఆర్కిటెక్చర్‌ పూర్తిచేయాలని. అందరూ కష్టమన్నా కాలేజీలో సంప్రదించా. ఆరునెలలు ప్రయత్నించి, అనుమతి తెచ్చుకున్నా. అలా 2020లో నా ప్రయాణం తిరిగి మొదలైంది. ఇంతలో కొవిడ్‌.. చేత్తోనే కాన్సెప్టులను అతికష్టమ్మీద గీసేదాన్ని. ఫోన్లోనే ప్రొఫెసర్ల సూచనలు తీసుకునేదాన్ని. అన్నయ్య నాకోసం ఉద్యోగం మానేశాడు. ఎలాగైతేనేం థీసిస్‌ పూర్తిచేసి, గ్రాడ్యుయేట్‌నయ్యా. నా ఆనందానికి అవధుల్లేవు.

వారికి సాయపడాలని..

పట్టా అయితే పొందా కానీ తర్వాతేంటన్న ప్రశ్న ఎదురైంది. అవకాశాల కోసమెళ్తే ‘దృష్టిలోపంతో ఆర్కిటెక్ట్‌ ఎలాగయ్యా’వనేవారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా రవాణాపరమైన ఇబ్బందులు. అందుకే నాలాంటి వాళ్ల కోసం ఎక్కడికెళ్లినా సాయపడే మార్గాలపై పరిశోధన ప్రారంభించా. ఆ ఆలోచనతోనే 2021లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఫర్‌ డిసేబుల్డ్‌ పీపుల్‌ (ఎన్‌సీపీఈడీపీ).. జావేద్‌ అబీదీ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేశా. దేశవ్యాప్తంగా 25 మంది ఎంపికైతే ఏపీ నుంచి నేనొక్కదాన్నే. దీనిలో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘యాక్సెసబుల్‌ ఇండియా క్యాంపెయిన్‌’ కోసం వైజాగ్‌ రుషికొండ తీరంలో పరిశోధనలు జరిపా. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు సాయపడేలా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చా. వాటి ఆధారంగా అక్కడ కొన్ని సదుపాయాలూ తీసుకొచ్చారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు పనిచేస్తున్నా. బస్‌షెల్టర్‌ నుంచి విహార ప్రదేశాల వరకూ నిర్మాణమేదైనా అందరికీ అందుబాటులో ఉండేలా డిజైనింగ్‌ ఉండాలనే అంశంపై ఐఐటీ, సింబయాసిస్‌ సహా వివిధ సంస్థల ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు గెస్ట్‌ లెక్చర్లు ఇస్తున్నా. ఈ ఏప్రిల్‌లో భువనేశ్వర్‌లో జరిగిన జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ సమ్మిట్‌, దిల్లీ యునెస్కో ఇండియా, జాతీయ, అంతర్జాతీయ ఫోరముల్లో సంబంధిత సూచనలతో ప్రజెంటేషన్లూ ఇచ్చా. నేను సహరచయితగా ఉన్న ‘క్లైమేట్‌ రెసిలియంట్‌ అండ్‌ యాక్సెసబుల్‌ ఆర్కిటెక్చర్‌’ కథనాన్ని హార్వర్డ్‌ లా స్కూల్‌ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. నాలాంటి సమస్య ఉన్నవారికి, వైద్యులకు వారధిగా ఉండేలా సోషల్‌మీడియాలో ‘ఐఐహెచ్‌ వారియర్స్‌ ఇండియా’ గ్రూపు నిర్వహిస్తున్నా.

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్