అమెరికా వీధుల్లో ఇడ్లీ.. దోశ!

ఎన్నో కలలను వెంటబెట్టుకొని దేశ సరిహద్దుల్ని దాటే వారే ఎక్కువ. ఎంత దూరం వెళ్లినా.. ఎన్ని సాధించినా ఇంటి రుచుల కోసం తహతహలాడుతూనే ఉంటారు.

Updated : 10 Oct 2023 09:37 IST

ఎన్నో కలలను వెంటబెట్టుకొని దేశ సరిహద్దుల్ని దాటే వారే ఎక్కువ. ఎంత దూరం వెళ్లినా.. ఎన్ని సాధించినా ఇంటి రుచుల కోసం తహతహలాడుతూనే ఉంటారు. అలాంటివారే శ్వేత దంపతులు కూడా! అందుకు వారు చేసిన పని అమెరికా వీధుల్లో నెయ్యి గుభాళింపులను నింపేస్తోంది.

‘మంచి మసాలా దోశ.. ఎక్కడైనా దొరికితే బాగుండని అమెరికాలో ఎంత తిరిగుంటామో! ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. కేవలం ఈ ఒక్క కారణంతోనే ఎప్పుడెప్పుడు భారత్‌ వెళతామా అని ఎన్నిసార్లు ఎదురు చూసుంటామో’ అంటారు శ్వేత. వీళ్లది బెంగళూరు. భర్త వెంకట్‌ రాజు న్యాయవాది. తనేమో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 2016లో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. ఓసారి సేవా కార్యక్రమంలో భాగంగా వాళ్ల పాప నిమ్మరసం స్టాల్‌ పెట్టింది. అమ్మగా వచ్చిన డబ్బులు విరాళంగా ఇచ్చింది. అది చూసిన శ్వేత దంపతులకు ‘భారతీయ రుచులను మనమే ఎందుకు అందించకూడద’న్న ఆలోచన వచ్చిందట. అలా 2021లో బీసీపీ (బ్రూక్లిన్‌ కర్రీ ప్రాజెక్ట్‌) ప్రారంభమైంది.

ప్రతి శనివారం బ్రూక్లిన్‌ వీధిలో వీళ్ల ఫుడ్‌ స్టాల్‌ తెరుచుకుంటుంది. ఇడ్లీ, భిన్న రకాల దోశ, కిచిడీ, ఊతప్పం.. వంటి అల్పాహారాలన్నీ అందుబాటులో ఉంటాయి. దీనికోసం సేంద్రియ పద్ధతిలో పండించిన పప్పులు, నూనెలు, మసాలాలు, నెయ్యి వంటివి భారత్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారట. ఉదయం పదిన్నరకు మొదలుపెట్టి, సరకు పూర్తయ్యేంత వరకూ స్టాల్‌ తెరచి ఉంచుతారు. ‘చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్టాల్‌ ఎప్పుడు తెరుస్తారా అని ఎంతోమంది ఎదురు చూస్తోంటే చాలా ఆనందంగా ఉంటుంది. మరిన్ని భారతీయ రుచులను అందించాలని నెలకోసారి ఏదైనా థీమ్‌తో ఫుడ్‌ ఫెస్టివల్‌నీ నిర్వహిస్తుంటాం. వీగన్‌, చిరుధాన్యాల ప్రత్యేకం, స్వీట్లు, బిర్యానీ.. ఇలా నెల నెలా ఒక్కోటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. పండగల వేళ ప్రత్యేక వంటలనీ అందిస్తాం. ఏదైనా ఖర్చు పది డాలర్లలోపే ఉంటుం’దనే వీళ్ల వంటలకు మనవాళ్లే కాదు.. స్థానికుల నుంచీ మంచి స్పందన వస్తోంది.

శనివారం తెరిచే స్టాల్‌కి గురువారం నుంచీ తయారీ ప్రారంభిస్తారట. ‘తొలిరోజుల్లో భారతీయ వంటలంటే ‘టిక్కా మసాలా’ అనేవారు. కానీ అంతకు మించిన రుచులు ఉన్నాయని చూపించాలనుకున్నాం. అందరూ మెచ్చుకుంటోంటే ఆనందంగా ఉంటుంది. ఇప్పటివరకూ పదివేలమందికి మా వంటకాల రుచి చూపించాం. ఇది మాకు వ్యాపారం కాదు.. సంతోషకరమైన వ్యాపకం. అందుకే ప్రతి శనివారం కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చినవాళ్లు ‘అమ్మ చేతి వంట గుర్తొచ్చింది’ అన్న కితాబిచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది’ అంటారీ దంపతులు. దక్షిణ భారత సంప్రదాయం, రుచులను మనవాళ్లతోపాటు ఇక్కడి వాళ్లకీ పరిచయం చేయాలన్న లక్ష్యమనే వీళ్లు త్వరలో ఓ రెస్టారెంట్‌నీ ప్రారంభించనున్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్