ఫుట్‌బాల్‌ కుట్టి.. కాలేజీకెళ్లా!

పల్లెటూరి అమ్మాయి. అమ్మ అండతో అతి కష్టమ్మీద చదువును కొనసాగించగలుగుతోంది. అలాంటి తను ఎన్నో పల్లెల్లో మార్పునకు కారణమవ్వడమే కాదు.. ఐక్యరాజ్యసమితి గుర్తింపునీ సాధించింది. హీనా సైఫీ.. ఆమె మనోగతమిది.

Updated : 11 Oct 2023 13:26 IST

పల్లెటూరి అమ్మాయి. అమ్మ అండతో అతి కష్టమ్మీద చదువును కొనసాగించగలుగుతోంది. అలాంటి తను ఎన్నో పల్లెల్లో మార్పునకు కారణమవ్వడమే కాదు.. ఐక్యరాజ్యసమితి గుర్తింపునీ సాధించింది. హీనా సైఫీ.. ఆమె మనోగతమిది.

ఊళ్లో ఎనిమిదో తరగతి వరకే ఉంది. అమ్మాయిలను అక్కడివరకూ చదివించడమే గొప్ప. ఇక పైచదువులకు ఎలా పంపిస్తారు? నాకేమో చదువు కొనసాగించాలని. నాన్నకు చెబితే ససేమిరా అన్నారు. చుట్టుపక్కలవాళ్లూ అందుకు వంత పాడారు. కానీ అమ్మ నాకు అండగా నిలిచింది. మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిసోలా అనే గ్రామం. నాన్నను ఒప్పించడానికి అమ్మ చాలా ప్రయత్నించింది. కానీ ఆయన వినిపించుకోలేదు. దీంతో ఆయన అనుమతి లేకపోయినా నన్ను ఖటౌలీలోని బంధువులింటికి పంపింది. అక్కడే ఉంటూ పదో తరగతి పాసయ్యా. కాలేజీకెళ్లడానికే డబ్బుల్లేవు. ఫుట్‌బాల్‌ ఫ్యాక్టరీకెళ్లి బాల్స్‌ కుట్టేదాన్ని. ఏడాది కూలీని దాచి, కాలేజీలో చేరా.

అవగాహనతో..

కాలేజీ జీవితం నా ఆలోచననే మార్చింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం వంటివాటి గురించి ఇక్కడే తెలుసుకున్నా. జీవన విధానాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే చాలు.. పర్యావరణాన్ని సంరక్షించుకోవచ్చు. అందరూ పాటిస్తే ఎన్నో ప్రమాదాలనూ నివారించొచ్చు. కానీ ఆ అవగాహన తెచ్చేదెవరు? నేనే మొదలుపెట్టాలి, మా గ్రామంలోనే ప్రారంభించాలనుకున్నా. అక్కడ చదువుకున్న వారే తక్కువ. ఈ విషయాలు చెప్పినా అర్థమయ్యేవి కాదు. కాబట్టి, ముందు అక్షరాస్యత పెంచాలని ఇంటింటికీ తిరిగి పిల్లలను బడికి పంపమని కోరేదాన్ని. అన్నీ పేద కుటుంబాలు. కూలీ వస్తే కడుపు నిండుతుందని పిల్లలనీ క్వారీలకు పంపేవారు. అలాంటివారికి నా మాటలు రుచించలేదు. అయినా ఛాలెంజ్‌గా తీసుకొన్నా. ఓ ఉపాధ్యాయుడి సాయంతో ఇంటింటికీ తిరిగి చదువు ప్రాముఖ్యాన్ని వివరించడం మొదలుపెట్టా. నెమ్మదిగా వారిలో మార్పు వచ్చింది. అలా చదువు, ఆపై ఓ ఎన్‌జీఓ సాయంతో వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కరపత్రాలను పంచడం చేసేదాన్ని. ఇంట్లో ఒక్కరు మారినా ఆ ప్రభావం అందరిపై ఉంటుందని నా నమ్మకం. అనుకున్నట్టుగానే గ్రామంలో మార్పు మొదలైంది.

మొదటి అమ్మాయిని..

అవగాహన వస్తే సరిపోదు. దానికి తగ్గ మార్గాలు చూపించాలనుకున్నా. మొక్కలు నాటించడం, నీటి వృథా తగ్గించే మార్గాలు, వస్తువును తిరిగి ఉపయోగించే మార్గాలు వంటివెన్నో పరిచయం చేశా. ఇవన్నీ మావద్ద అమలవుతున్నాయి. ఇక్కడ సాధించిన విజయంతో ఇతర రాష్ట్రాల్లోని గ్రామాలకీ సేవలు విస్తరించా. ఇలా సామాజికపరమైన అవగాహన కలిగించడానికి మా గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే. ‘హ్యాష్‌ట్యాగ్‌ వియ్‌ ద ఛేంజ్‌ నౌ’ ప్రచారంలో భాగంగా 2021లో ఐక్యరాజ్యసమితి 17 మందిని ఎంపిక చేసింది. ఆ క్లైమేట్‌ ఛేంజ్‌ లీడర్స్‌లో నేనూ ఒకరిని. ఎంబీఏ చదువుతూనే ‘విమెన్‌ క్లైమేట్‌ కలెక్టివ్‌ (డబ్ల్యూసీసీ)’ సహకారంతో దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే భూమిని కాపాడుకోగలమని ప్రచారం చేస్తున్నా. యువతంతా చేయి కలిపితే దాన్ని సాధించడం సాధ్యమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్