పదహారేళ్ల అమ్మాయి...వందకోట్ల వ్యాపారం!

టీనేజీ వయసంటే.. వీడియో గేమ్‌లు ఆడుతూ, సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తూ... జాలీగా కాలం గడిపేసేవాళ్లనే చూస్తుంటాం.  కానీ అదే వయసులో ప్రాంజలి తన తెలివితేటలతో చరిత్ర సృష్టించింది.

Updated : 12 Oct 2023 07:25 IST

టీనేజీ వయసంటే.. వీడియో గేమ్‌లు ఆడుతూ, సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తూ... జాలీగా కాలం గడిపేసేవాళ్లనే చూస్తుంటాం.  కానీ అదే వయసులో ప్రాంజలి తన తెలివితేటలతో చరిత్ర సృష్టించింది. కృత్రిమమేధతో పనిచేసే స్టార్టప్‌ని మొదలుపెట్టి ఏడాదిలో దాన్ని వందకోట్ల వ్యాపారంగా మార్చింది..

‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెత ప్రాంజలికి సరిగ్గా నప్పుతుంది. ఆమెది మనదేశంలోని ఓ మారుమూల పల్లెటూరు. పదేళ్లు వచ్చేవరకూ ఇక్కడే పుట్టి పెరిగింది. తండ్రి ఇంజినీరు. పిల్లలు పాఠశాల వయసులోనే కంప్యూటర్‌ సైన్స్‌ నేర్చుకోవాలన్నది ఆయన అభిమతం. తరచూ దీనికి సంబంధించిన సంవాదాలు ఇంట్లో నడుస్తూ ఉండేవి. అలా ప్రాంజలి సాంకేతిక పరిజ్ఞానంపై ఇష్టం పెంచుకోవడం మొదలుపెట్టింది.  ఏడేళ్ల వయసులోనే కోడింగ్‌ నేర్చుకుని అందరినీ అబ్బుర పరిచింది. తర్వాత తల్లిదండ్రుల ఉన్నత విద్యకోసం ఆమె కుటుంబం ఫ్లోరిడాకు మారాల్సి వచ్చింది. అక్కడే డోరల్‌ అకాడెమీ చార్టర్‌లో హైస్కూల్‌లో చేరింది. ఇక్కడకొచ్చాక కంప్యూటర్‌ సైన్స్‌ తరగతులు, కాంపిటేటివ్‌ మ్యాథ్స్‌ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకుంది. మరెన్నో అవకాశాలూ అందుకుంది. ఈలోగా కొవిడ్‌ కారణంగా చదువు వర్చువల్‌ విధానానికి మారడంతో ప్రాంజలికి వారానికి 20 గంటల పాటు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం దొరికింది. వాటిల్లో మెషిన్‌ లెర్నింగ్‌ కూడా ఒకటి. అలా అసాధారణ ప్రతిభతో 13 ఏళ్లకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ప్రారంభించింది. ఈ సమయంలోనే ఓపెన్‌ ఏఐ చాట్‌ జీపీటీఎన్‌3 బీటా ఆవిష్కరణ జరిగింది. దాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున వచ్చి పడుతోన్న ఆన్‌లైన్‌ కంటెంట్‌ నుంచి కచ్చితమైన సమాచారాన్ని సేకరించి, ఉపయోగించుకునేలా పరిశోధకులకు సాయం చేయడమే లక్ష్యంగా ఓ ఏఐ స్టార్టప్‌ని స్థాపించాలనుకుంది.

చదువుకి విరామం ఇచ్చి...

ఇందుకోసమే వ్యాపారవేత్తలు లూసీ గువో, డేవ్‌ ఫాంటెనోట్‌ నేతృత్వంలో మియామిలో ఏర్పాటైన ఏఐ స్టార్టప్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రాంలో చేరింది. ఇక్కడ నైపుణ్యాలను అందిపుచ్చుకుని ‘డెల్వ్‌.ఏఐ’ అనే స్టార్టప్‌ని ఏర్పాటు చేసింది. దీన్ని సాఫ్ట్‌వేర్‌ని ఉచితంగా పంచుకునే ప్లాట్‌ఫాం ‘ప్రొడక్ట్‌ హంట్‌’లో విడుదల చేసింది. ఇది తక్కువ కాలంలోనే అసాధారణమైన విజయాల్ని నమోదు చేసుకుంది. ఆన్‌ డెక్‌, విలేజ్‌ గ్లోబల్‌ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను అందుకోగలిగింది. గతేడాది 4,50,000 డాలర్ల(సుమారు రూ. 3.7 కోట్లు) నిధులను సేకరించింది. ప్రస్తుతం దాని విలువ 12 మిలియన్ల (రూ.100 కోట్లు) డాలర్లు. ఈ సంస్థలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో పాటు ప్రాంజలి కాలిఫోర్నియాలోని శాండియాగో విశ్వవిద్యాలయంలో న్యూరో సైన్స్‌లో రిమోట్‌ ఇంటర్న్‌షిప్‌ చేసింది. మరో పక్క టెలీ మెడిసిన్‌ రంగంలో స్టార్టప్‌ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి కొంత ఫండింగ్‌ కూడా సేకరించింది. ఇక, ఆ మధ్య ఓ సారి ఇండియా వచ్చినప్పుడు తాత నేర్పిన సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుని హస్త కళాకారులకు చేయూత నిచ్చేందుకు ‘ఇండిక్‌ వ్యాలీ’ పేరుతో ఓ వెబ్‌సైట్‌నీ ఏర్పాటు చేసింది. ఇవన్నీ చేస్తోంది సరే... మరి చదువో అంటారా? సంస్థ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కొంత విరామం ఇచ్చింది. ‘ఆలోచనలకు పరిమితులు విధించుకోకుండా అడుగేస్తే...అద్భుతాలు వాటంతట అవే జరుగుతాయి. సవాళ్లు తీసుకుంటేనే ఏదైనా సాధించగలం’ అని చెబుతోంది ప్రాంజలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్