బ్రిటిష్‌ హై కమిషన్‌కి.. బాస్‌ అయ్యింది!

అక్కడంతా ఉన్నత స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు.. ఆ తలపండిన వారి మధ్య ఓ 21 ఏళ్లమ్మాయి! చర్చల్లో భాగంగా తన సలహాలు, సూచనలు ఇస్తోంది. నిజానికి వాటిని నడిపిస్తోందే ఆ అమ్మాయి. భారత్‌లో బ్రిటిష్‌ హై కమిషన్‌కి హై కమిషనర్‌ తను మరి!

Updated : 13 Oct 2023 03:05 IST

అక్కడంతా ఉన్నత స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు.. ఆ తలపండిన వారి మధ్య ఓ 21 ఏళ్లమ్మాయి! చర్చల్లో భాగంగా తన సలహాలు, సూచనలు ఇస్తోంది. నిజానికి వాటిని నడిపిస్తోందే ఆ అమ్మాయి. భారత్‌లో బ్రిటిష్‌ హై కమిషన్‌కి హై కమిషనర్‌ తను మరి! అంత చిన్నమ్మాయికి అదెలా సాధ్యమంటే.. శ్రేయ గురించి తెలుసుకోవాల్సిందే!

శ్రేయా ధర్మరాజన్‌కి ఉపాధ్యాయ వృత్తి అన్నా పిల్లల సైకాలజీలపై పరిశోధనలన్నా చాలా ఇష్టం. తనది చెన్నై. పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేసిన ఆమె ముంబయి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తోంది. పిల్లల మనస్తత్వాలు, ఆలోచనలకు అనుగుణంగా బోధన ఉండాలి. అప్పుడే నేర్చుకునే ప్రక్రియను ఆసక్తికరంగా మార్చగలమని నమ్ముతుంది. తన ఈ నమ్మకమే ఆమెను ‘హై కమిషనర్‌’ని చేసింది. బలమైన ఆలోచనలు, దిశానిర్దేశం చేయగల సత్తా అమ్మాయిలకూ ఎక్కువే! కావాల్సిందల్లా ఒక్క ఛాన్స్‌ మాత్రమే. ఆ అవకాశమే ఇస్తే ప్రపంచానికి తామేంటో నిరూపించగలరన్న ఉద్దేశంతో బ్రిటిష్‌ హై కమిషన్‌ ఏటా ‘హై కమిషనర్‌ ఫర్‌ ఎ డే’ నిర్వహిస్తోంది. ఎంపికైనవారు దిల్లీలోని హై కమిషన్‌ కార్యాలయంలో ఒక్కరోజు సేవలందించొచ్చు. దౌత్యవేత్తల పనితీరు, భారత్‌ యూకేల మధ్య ఒప్పందాలు వంటివన్నీ దగ్గరుండి చూడొచ్చు. దేశవ్యాప్తంగా 18-23 ఏళ్ల అమ్మాయిలు దీనికి అర్హులు. ఉపాధ్యాయురాలిగా తన ఆలోచనలు పంచుకుని ఈ ఏడాది శ్రేయ ధర్మరాజన్‌ ఎంపికైంది. 180 మందిని వెనక్కి నెట్టి ఆ అవకాశం దక్కించుకుంది.

ఇరు దేశాల మధ్య సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం వంటి కీలకమైన చర్చల్లో పాల్గొనడమే కాదు.. విలువైన సలహాలిచ్చి అందరి మెప్పూ పొందింది. ‘భారత్‌ భవిష్యత్‌ లక్ష్యాలు.. దానికోసం తీసుకుంటున్న చర్యలు వంటివెన్నో తెలిశాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల మహిళా నాయకురాళ్లతో మాట్లాడే అవకాశమొచ్చింది. వాళ్ల అనుభవాలు, దాటొచ్చిన సవాళ్లను తెలుసుకున్నాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక్కడ నేను నేర్చుకున్న పరిజ్ఞానాన్ని నా విద్యార్థులకు అందించడమే కాదు.. భవిష్యత్తులో వారిని ఉన్నత లక్ష్యాల దిశగా ప్రోత్సహిస్తా’నంటోంది శ్రేయ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్