మైక్రోసాఫ్ట్‌ సీవీపీగా మన అమ్మాయి!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఎంతగా దూసుకుపోతున్నా... ఇందులో ఆడవాళ్లు రాణించలేరని అపోహపడే వారెందరో! వారి అంచనాలను తలకిందులు చేస్తూ... స్టెమ్‌ రంగాల్లో సత్తా చాటుతున్నారు మహిళలు. తెలుగు మూలాలున్న ఎన్‌ఆర్‌ఐ అపర్ణ చెన్నాప్రగడ కూడా అటువంటివారే. తాజాగా టెక్‌ దిగ్గజం మైక్

Updated : 14 Oct 2023 07:24 IST

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఎంతగా దూసుకుపోతున్నా... ఇందులో ఆడవాళ్లు రాణించలేరని అపోహపడే వారెందరో! వారి అంచనాలను తలకిందులు చేస్తూ... స్టెమ్‌ రంగాల్లో సత్తా చాటుతున్నారు మహిళలు. తెలుగు మూలాలున్న ఎన్‌ఆర్‌ఐ అపర్ణ చెన్నాప్రగడ కూడా అటువంటివారే. తాజాగా టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారామె...

‘ఆడవాళ్లు ఏం చేయగలరన్న వారికి ఈతరం మహిళలు సాధిస్తోన్న విజయాలే సరైన సమాధానం’ అంటారు అపర్ణ. ఆమెది తెలుగు మూలాలున్న మధ్యతరగతి భారతీయ కుటుంబం. తనకు పద్దెనిమిదేళ్లు వచ్చేవరకూ కంప్యూటర్‌నే చూడలేదట. అలాంటి అమ్మాయి ప్రపంచంలోనే దిగ్గజ టెక్‌ కంపెనీల్లో ఉన్నత స్థాయిలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడం అంటే మాటలు కాదు మరి. ‘చిన్నప్పుడు ఆడిన వీడియోగేమ్‌లు టెక్నాలజీపై ఆసక్తి కలిగిస్తే.. భవిష్యత్తు శాస్త్ర, సాంకేతిక రంగాలదే అని అమ్మ చెప్పిన మాటలు, ప్రోత్సాహం నన్నీ స్థాయికి చేర్చాయి’ అని గుర్తు చేసుకుంటారు అపర్ణ.

ఎన్నో హోదాలు...

చిన్నప్పటి నుంచీ చదువుల్లో చురుగ్గా ఉండే అపర్ణకు ఐఐటీ మద్రాస్‌లో చదవాలన్నది కల. దాన్ని నెరవేర్చుకుంటూ అక్కడే కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశారు. ఆపై అమెరికా వెళ్లి టెక్సాస్‌ విశ్వ విద్యాలయంతో పాటు ఎమ్‌ఐటీల నుంచి డబుల్‌ మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. అకామై టెక్నాలజీస్‌లో ప్రొడక్ట్‌ డెవలపర్‌గా తన కెరియర్‌ని ప్రారంభించారీమె. తర్వాత ఒరాకిల్‌, ఇంక్‌ డాట్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపై గూగుల్‌తో పన్నెండేళ్ల ప్రయాణం ఆమెది. యూట్యూబ్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ నౌ, గూగుల్‌ లెన్స్‌ సహా ఎన్నో కీలక ఉత్పత్తుల అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి టెక్నికల్‌ అసిస్టెంట్‌గానూ పనిచేశారు. ప్రముఖ ఈబే సంస్థలో కన్స్యూమర్‌ షాపింగ్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా, ఏఆర్‌, విజువల్‌ సెర్చ్‌ ప్రొడక్ట్‌లకు లీడ్‌గా కూడా అపర్ణ బాధ్యతలు నిర్వర్తించారు. స్టాక్‌ ట్రేడింగ్‌ యాప్‌ రాబిన్‌హుడ్‌లో చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా చేశారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితురాలై మైక్రోసాఫ్ట్‌ 365, మైక్రోసాఫ్ట్‌ డిజైనర్‌లో జెనరేటివ్‌ ఏఐ ప్రయత్నాలకు నాయకత్వం వహించనున్నారు.

ప్రత్యామ్నాయంతోనే...

ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవమున్న అపర్ణ వ్యక్తిగత జీవితానికీ సమప్రాధాన్యమిచ్చారు. ‘శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమ్మాయిలు అడుగు పెట్టినా... ఎక్కువ రోజులు కొనసాగడం లేదు. నాయకత్వ బాధ్యతల్ని అందుకోవడానికి ఆసక్తి చూపించడంలేదు. ఇది మారాలి. బోర్డురూముల్లో మన ప్రాతినిధ్యం పెరగాలి. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. వాస్తవానికి కెరియర్‌నీ, కుటుంబాన్నీ సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత తడబాటూ, ఒత్తిడీ సహజమే. అందుకోసం వృత్తి జీవితాన్ని త్యాగం చేయక్కర్లేదు. ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటే చాలు. గూగుల్‌లో చేరే సమయంలో నాకూ ఈ పరిస్థితి ఎదురైంది. అప్పుడు నేను గర్భవతిని. బిడ్డను సరిగా చూసుకోగలుగుతానా? నాకు ఈ ఉద్యోగం సరైనదేనా అంటూ ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు అండగా నిలబడ్డారు. వారి అనుభవాలను పంచుకుని మార్గనిర్దేశం చేశారు. నా కొడుకుని సంస్థ డేకేర్‌ సెంటర్‌లో వదిలి పనిచేసుకునేదాన్ని. క్రమంగా జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలిసింది’ అంటూ తన కెరియర్‌ ప్రయాణంలోని ఆటుపోట్ల గురించి చెబుతారు అపర్ణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్