బస్సుల్లో చదివిన.. బంగారు తల్లి!

‘నాలా భద్రత లేని ఉద్యోగం నీకొద్దమ్మా..’ నాన్న చెప్పిన ఈ మాటనే మనసులో నిలుపుకొంది వినుత. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా రోజూ గంటల కొద్దీ ప్రయాణించి చదువు పూర్తిచేసింది.

Updated : 19 Oct 2023 07:40 IST

‘నాలా భద్రత లేని ఉద్యోగం నీకొద్దమ్మా..’ నాన్న చెప్పిన ఈ మాటనే మనసులో నిలుపుకొంది వినుత. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా రోజూ గంటల కొద్దీ ప్రయాణించి చదువు పూర్తిచేసింది. ఆ కష్టానికి ఫలితంగా యూనివర్సిటీ టాపర్‌ అవ్వడమే కాదు.. బంగారు పతకాలూ అందుకొంది. ఆ ప్రయాణం.. ఆమె మాటల్లోనే..!

నాన్న జయరాం సర్వేయర్‌ డిపార్ట్‌మెంట్‌లో హెల్పర్‌. అమ్మ చంద్రిక. ఇద్దరూ పదో తరగతి మాత్రమే చదివారు. ‘నాది భద్రత లేని ఉద్యోగం. నువ్వయినా ప్రభుత్వోద్యోగం తెచ్చుకోవాలి’ నాన్న నాకు ఊహ వచ్చినప్పటి నుంచీ చెప్పిన మాటిది. అందుకే నా దృష్టంతా చదువు మీదే! పది, ఇంటర్‌ల్లో 90 శాతంపైగా మార్కులు సాధించడంతో బెంగళూరులో మంచి కళాశాలలో సీటొచ్చింది. మేముండేదేమో ఆనేకల్‌. రానూపోనూ ప్రయాణానికే ఆరు గంటలు పడుతుంది. పోనీ బెంగళూరులో హాస్టల్‌లో ఉందామన్నా, గది అద్దెకు తీసుకుందామన్నా స్థోమత సరిపోదు. దీంతో రోజూ వెళ్లి రావడానికే మొగ్గు చూపా. కళాశాలకు చేరుకోవాలంటే మూడు బస్సులు మారాలి. ఉదయం 6గంటలకు ఇంట్లోంచి బయటికెళితే తిరిగి చేరుకునే సరికి రాత్రి 8 అయ్యేది. అంత దూరం ప్రయాణం ఎవరికైనా విసుగే. కానీ నేను దాన్ని వినియోగించుకోవాలి అనుకున్నా. బస్టాండ్‌, బస్సు అన్న తేడా లేకుండా ఎక్కడ సమయం దొరికినా పాఠాలు చదివేదాన్ని. ఇంటికొచ్చాక కొద్దిసేపు చూసుకుంటే సరిపోయేది. అలా చదివే డిగ్రీలో 85శాతం మార్కులు తెచ్చుకున్నా.

పీజీకి బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో సీటొచ్చింది. కెంగేరిలో ఉండే విశ్వవిద్యాలయానికి వెళ్లి రావడానికి 8గంటలు పడుతుంది. డిగ్రీలో నా కష్టం చూసిన నాన్న తట్టుకోలేక పోయారు. అప్పు చేసైనా హాస్టల్‌ ఫీజు కడతానన్నారు. మా ఆర్థిక పరిస్థితి తెలిసిన నేను అందుకు ఎలా ఒప్పుకోగలను? నాన్నకు అంత శ్రమ ఇవ్వాలనుకోలేదు. అందుకే కాస్త దగ్గర్లోని ఆక్స్‌ఫర్డ్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరా. దీనికీ రెండు బస్సులు మారాలి. రోజూ పెద్ద పెద్ద పుస్తకాలు మోయటం భారంగా తోచేది. అందుకే కళాశాల ముగిశాక గంట అదనంగా ఉండి, నోట్స్‌ రాసుకునేదాన్ని. దాన్ని బస్సుల్లో చదువుకునేదాన్ని. నా కష్టం చూసి స్నేహితులు ‘ఫీజు మేం కడతాం.. హాస్టల్‌లో ఉండి చదువుకో’మన్నా సున్నితంగా తిరస్కరించా. సబ్జెక్టు నేర్చుకోవాలి, మంచి మార్కులు సాధించాలి అనే తపన పడేదాన్ని. కానీ యూనివర్సిటీలో ప్రథమ ర్యాంకు సాధించాస్తానని అనుకోలేదు. స్నాతకోత్సవం రోజు బంగారు పతకాలు ప్రకటిస్తూ ‘వినుత’ అని పిలిస్తే నన్ను కాదేమో అనుకున్నా. అలాంటిది వరుసగా ఎనిమిది అందుకున్నా. మూడు నగదు బహుమతులూ వచ్చాయి. ఈ ఏడాది అత్యధిక పతకాలు తీసుకున్నది నేనేనని తెలిసి నాన్న ఆనందానికి అవధుల్లేవు. పీహెచ్‌డీ చేయాలని కల. అయితే.. నాన్నకోసం ముందు ప్రభుత్వోద్యోగం సంపాదించాలి. అది సాధించాక పీహెచ్‌డీపైనా దృష్టిపెడతా.

- కె.ముకుంద, బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్