భారతీయ కళలకు పట్టం కట్టాలని..

అమెరికాలో పుట్టి, పెరిగినా భారతీయ కళలపై  ప్రేమను పెంచుకుంది. ఈ కళల్ని ప్రపంచమంతా పరిచయం చేయాలని వైతాళిక ఫౌండేషన్‌ స్థాపించింది.

Updated : 19 Oct 2023 16:45 IST

అమెరికాలో పుట్టి, పెరిగినా భారతీయ కళలపై  ప్రేమను పెంచుకుంది. ఈ కళల్ని ప్రపంచమంతా పరిచయం చేయాలని వైతాళిక ఫౌండేషన్‌ స్థాపించింది. మరోవైపు గ్రామీణ కళాకారులకు అండగా ఉండేందుకు వి-హబ్‌తో కలిసి పనిచేస్తోంది ప్రీతికా పావిరాల. తన లక్ష్యాలను మనతో పంచుకుందిలా..

నేను పుట్టి పెరిగింది అమెరికాలో. అమ్మానాన్నలది భీమవరం. అమ్మ దీపిక. నాన్న అచ్యుత్‌ ప్రసాద్‌ ఐటీ ఉద్యోగి. ఆయన వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డాం. మా అమ్మమ్మ విమల బాగా పాటలు పాడేవారు. ఎవరు అడిగినా కాదనకుండా సాయం చేసేవారు. ఆమె ప్రభావం నాపై ఉంది. అందుకే అమెరికాలో ఉన్నా కూచిపూడి, సంగీతం నేర్చుకున్నా. వీలుదొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. నాయనమ్మ కోసమని ఐదేళ్ల కిందట మనదేశానికి తిరిగొచ్చి, హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. స్కూల్‌ టూర్‌లో భాగంగా శిల్పారామం వెళ్లినప్పుడు ఎన్నో హస్తకళలని చూశా. వాటిపై అవగాహన లేక, సరైన మార్కెటింగ్‌ లేక చాలా కళలు ప్రాచుర్యానికి నోచుకోవడం లేదని తెలిసింది. మన కళలని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో వైతాళిక ఫౌండేషన్‌ ప్రారంభించా. మా సంస్థకి ప్రపంచవ్యాప్తంగా 120 మంది వాలంటీర్లున్నారు. వీరంతా భారతీయ కళల పరిరక్షణ కోసమే పనిచేస్తున్నారు.

అలా మొదలైంది...

ఓసారి మా ఇంటికి దగ్గర్లోని చీర్స్‌ ఫౌండేషన్‌కి వెళ్లాను. మాటల మధ్యలో కొంతమంది అనాథ పిల్లలు మాకు నాట్యం నేర్చుకోవాలని ఉన్నా, నేర్పేవాళ్లు లేరని అన్నారు. సరే అని టీచర్‌ కోసం నా వంతు ప్రయత్నం మొదలుపెట్టా. నలభై, యాభైమంది టీచర్లతో మట్లాడితే అతికష్టం మీద కొంతమంది ఒప్పుకొన్నారు. అక్కడుండే పిల్లలకు మా ఫౌండేషన్‌ తరఫున ఉచితంగా నాట్యం, సంగీతం నేర్పిస్తున్నా. ఆ తర్వాత నచికేత తపోవన్‌తోపాటు మరికొన్ని అనాథాశ్రమాలు, ప్రభుత్వ బడులకు వెళ్లి అక్కడ నాట్యం, సంగీతానికి సంబంధించిన సెషన్స్‌ నిర్వహించాం.

వాళ్లలో ఆసక్తి ఉన్న వాళ్లకి క్లాసులు చెప్పడం మొదలుపెట్టాం. ఇంతవరకూ 15 అనాథాశ్రమాల్లో.. 110 సెషన్స్‌ నిర్వహించాం. 400 మంది విద్యార్థులకు చేరువయ్యాం. వీరంతా ఉచితంగా నాట్యం, సంగీతం నేర్చుకుంటున్నారు. ఇందుకోసం అమెరికా, డల్లాస్‌, అట్లాంటాలో మా వాలంటీర్ల సాయంతో నిధులు సేకరిస్తున్నాం. 

చేర్యాల కళకోసం..

గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చేర్యాల మాస్క్‌లు, చిత్రలేఖనం గురించి తెలిసింది. అక్కడ కొంతమంది మహిళలు ఈ కళలో శిక్షణ పొందారు. కానీ దానిపై వచ్చే రాబడి వాళ్లకు సరిపోవడంలేదు, మరేదయినా ఆదాయ మార్గాలని చూపించమని కోరారు. దాంతో వాళ్లకు కావాల్సిన వస్త్రాలు, జిగురు, రంగులతో పాటు ల్యాప్‌టాప్‌ వంటి వనరులు సమకూర్చాం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు తీర్చిదిద్దేలా 250 మందికి శిక్షణ ఇస్తున్నాం. కళాఖండాల ప్రచారం, మార్కెటింగ్‌, రవాణా ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు వి-హబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక వెబ్‌సైట్‌నీ తీర్చిదిద్దాం. ఒక్క చేర్యాలతో ఆగిపోకుండా వి-హబ్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో హస్తకళలు తయారుచేసే 25 గ్రామాలకూ వెళ్లి జియో ట్యాగింగ్‌ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఉత్పత్తులని విదేశాల్లోనూ అమ్మాలన్నదే మా లక్ష్యం. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వీటిని మార్కెటింగ్‌  చేస్తున్నాం. ప్రస్తుతం నేను 12 క్లాస్‌ చదువుతూనే ఇస్కారా స్కిన్‌కేర్‌ అనే స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించా. చందనం, భృంగరాజ్‌ వంటివాటితో నాయనమ్మ చెప్పిన చర్మ, కేశ సంరక్షణ రహస్యాలతో మనలో ఒత్తిడిని తగ్గించేలా సౌందర్య ఉత్పత్తులని రూపొందిస్తున్నా. మా హెయిర్‌ ఆయిల్‌, చర్మ ఉత్పత్తుల తయారీ బాధ్యత కూడా గ్రామీణ మహిళలకే అప్పగించా. భవిష్యత్తులో వీటి అమ్మకాలతో వచ్చిన లాభాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నా. భారతీయ కళలని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్నదే నా కల.

- దేవి పట్టపు, ఈనాడు పాత్రికేయ పాఠశాల


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్