కిచిడీతో.. కోట్ల వ్యాపారం!

కిచిడీ.. ఓ వంటకం మాత్రమే మనకి! అభాకి కాదు. అది తనకో జ్ఞాపకం, నేస్తం. అందుకే కిచిడీతో ప్రయోగాలు చేసింది. అందరికీ రుచి చూపించి, కితాబులందుకుంది. కోట్ల వ్యాపారంగానూ మార్చింది. ఎన్నో దేశీ, విదేశీ రుచులను దాటి ఎలా రాణిస్తోందంటే.. మనసును కదిలించే తన కథను తెలుసుకోవాల్సిందే!

Updated : 20 Oct 2023 07:28 IST

కిచిడీ.. ఓ వంటకం మాత్రమే మనకి! అభాకి కాదు. అది తనకో జ్ఞాపకం, నేస్తం. అందుకే కిచిడీతో ప్రయోగాలు చేసింది. అందరికీ రుచి చూపించి, కితాబులందుకుంది. కోట్ల వ్యాపారంగానూ మార్చింది. ఎన్నో దేశీ, విదేశీ రుచులను దాటి ఎలా రాణిస్తోందంటే.. మనసును కదిలించే తన కథను తెలుసుకోవాల్సిందే!

అమ్మ చేతిరుచి, ఇంటి భోజనం విలువ తెలియాలా? హాస్టళ్లు, దూరప్రాంతాల్లో నివసించే వారిని అడగండి. వాటి గొప్పతనం బాగా తెలిసేది వారికే మరి! అభా సింఘాల్‌కి ఆ రుచిని గుర్తు చేసేది కిచిడీ! తనది ముంబయి. ఆమెకు పన్నెండేళ్ల వయసులో అమ్మానాన్న విడిపోయారు. బాల్యమంతా హాస్టళ్లు, బోర్డింగ్‌ స్కూళ్లలోనే గడిచిపోయింది. దీనికితోడు ఆర్థిక కష్టాలు. కష్టపడి చదివి, స్కాలర్‌షిప్‌లు దక్కించుకుంది. ‘లండన్‌లో ఎంబీఏ చేస్తున్నప్పుడు ఇతర ఖర్చులకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. ఖర్చు తగ్గాలంటే స్వయంగా వండుకోవాలి. త్వరగా చేసుకోవచ్చు, ఇంటి రుచులను గుర్తుచేస్తుందని నా ఎంపిక కిచిడీనే! రోజూ ఒకేలా తినలేక ప్రయోగాలు చేసేదాన్ని. అలా దానిలో ప్రావీణ్యం సంపాదించేశా’నంటుంది అభా.

మళ్లీ దూరమైంది..

ఎంబీఏ పట్టా తీసుకొని ఇంటికొచ్చిన అభాను ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోమన్నారు. కెరియర్‌ ఎలా మలుచుకోవాలన్న ఆలోచనలో ఉన్న తను ససేమిరా అంది. ఇంట్లోవాళ్లు పట్టుబట్టడంతో దుస్తులు, రూ.5వేలతో ఇల్లు దాటింది. స్నేహితురాలితో కలిసి ఓ గది అద్దెకు తీసుకొని ఉద్యోగ ప్రయత్నాల్లో పడింది. కొద్దిరోజుల్లోనే మార్కెటింగ్‌ ఉద్యోగం వచ్చింది. ఆఫర్‌ లెటర్‌ చూసి ‘ఇంటి అద్దెకు ఇబ్బంది లేదు’ అనుకుందట. అలా సాగుతున్న తనకు అనుకోకుండా ఓ యాడ్‌ డైరెక్టర్‌తో పరిచయమైంది. తనకేమో మోడలింగ్‌ పరిచయమే లేదు. కానీ ప్రయత్నిస్తే పోయేదేముందనుకుంది. ఒక్కరోజు పనికి రూ.40 వేలొచ్చాయి. తన జీతంకన్నా రెండింతలు. ఇంకేం ఉద్యోగం మాని మోడల్‌గా కొనసాగింది. క్యాడ్‌బరీ, శామ్‌సంగ్‌ వంటి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు పనిచేసింది.

కితాబుతో దారి మళ్లి..

ఆదాయం, గుర్తింపు వచ్చాయి. నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. అయినా సొంతంగా ఏదైనా చేయాలన్న తపన అభాది. ఓరోజు భోజనమయ్యాక భర్త ‘నీ చేతి కిచిడీకి పోటీ లేద’న్నారట. అప్పుడే దీంతో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది. ఒంటరని ఎప్పుడు అనిపించినా తనకు గుర్తొచ్చేది కిచిడీనే! ప్రావీణ్యమూ ఉంది. కాబట్టి, పరిశోధన చేసి చేయగలనన్న నమ్మకమొచ్చాక తన దగ్గరున్న రూ.3లక్షలతో 2019లో హైదరాబాద్‌లో ‘కిచిడీ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభించింది. తనతోపాటు సాయంగా మరొకరితో మొదలైన ఆ వ్యాపారాన్ని నాలుగేళ్లలో రూ.50కోట్లకు చేర్చింది. ‘ముంబయితో పోలిస్తే అద్దె తక్కువని హైదరాబాద్‌కొచ్చా. రోగులు తినే కిచిడీతో వ్యాపారం చేస్తావా? ఎవరు తింటారన్నారంతా. నేనెప్పుడూ ‘చేయలేకపోతే.. ఇది కాకపోతే మరేంటి’ అని సందేహపడే రకాన్ని కాదు. కష్టమో, నష్టమో ధైర్యంగా ప్రయత్నిస్తా. పైగా పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలతో చేసే ఈ వంటకం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి, ఆదరణ ఉంటుందని ధైర్యం చేశా. ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నా. మొదట ఆసుపత్రులు, అనారోగ్యంగా ఉన్నవారి నుంచే ఆర్డర్లు వచ్చేవి. అయితేనేం.. నోటికి, కడుపుకి హాయిగా ఉందన్న అభినందనలొచ్చేవి. ఆ ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలు చేశా. రాబడి పెరిగాక ఒక్కో బ్రాంచీ తెరుస్తూ వెళ్లా. హైదరాబాద్‌, ముంబయిల్లో ఎనిమిది బ్రాంచీలున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నా. అలాగని ఇబ్బందులు లేవనేం కాదు. ప్రయోగాలు చేసి, కొన్నిసార్లు విఫలమయ్యా. టీ తాగడానికీ డబ్బుల్లేని రోజులున్నాయి. ఓపికతో కొనసాగా కాబట్టే ఈరోజు విజయవంతమయ్యా’ననే అభా 20కిపైగా రకాల కిచిడీలు అందిస్తోంది. వాటిని విదేశాల్లోనూ పరిచయం చేస్తుందట.

‘ఏదైనా మొదలుపెట్టక ముందే ‘ప్లాన్‌ బి’ సిద్ధం చేసుకోవద్దు. అలా చేస్తే అపజయాన్ని ఒప్పుకొన్నట్లే. మీకు నచ్చిందేంటి? చేయగల సత్తా ఉందా అన్నది చూసుకొని ప్రయత్నించండి. సవాళ్లొచ్చినా ఓపిగ్గా నిలవగలిగితేనే ఏదైనా సాధించగలం’


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్