ఏనుగుని స్ఫూర్తిగా తీసుకున్నా!

తినే ఆహారం సేంద్రియమైతే ఆరోగ్యం బాగుంటుంది. మరి కట్టుకునే దుస్తులు రసాయన రహితమైతే? శరీరానికి హాయినివ్వడమే కాదు, పర్యావరణానికీ మేలు జరుగుతుందని అంటున్నారు అలంకృత చంద్ర.

Updated : 21 Oct 2023 07:24 IST

తినే ఆహారం సేంద్రియమైతే ఆరోగ్యం బాగుంటుంది. మరి కట్టుకునే దుస్తులు రసాయన రహితమైతే? శరీరానికి హాయినివ్వడమే కాదు, పర్యావరణానికీ మేలు జరుగుతుందని అంటున్నారు అలంకృత చంద్ర. ఈ దుస్తులని అందరికీ చేరువ చేయాలని ఉద్యోగం వదిలి పల్లె బాట పట్టారామె. ఆ విషయాలని వసుంధరతో పంచుకున్నారిలా..

ఇష్టమైన పని కష్టంగా అనిపించదు అంటారు కదా! పర్యావరణ మేలు కోసం నేను అలాగే పనిచేస్తున్నా. నా స్వస్థలం తెనాలి. వడ్లమూడిలోని విజ్ఞాన్‌ కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం 2015లో అమెరికా వెళ్లా. అక్కడున్నప్పుడు ఓసారి కొత్త దుస్తులు ధరిస్తే శరీరంపై అలర్జీ వచ్చింది. దుస్తుల తయారీలో వాడిన రంగులు పడక అలా దద్దుర్లు వచ్చాయని తెలిసింది. ఆరా తీస్తే అనేక చేదు వాస్తవాలు తెలిశాయి. దుస్తులకు అద్దే రసాయనిక రంగుల వల్ల నదులు కలుషితం అవుతున్నాయనీ, చేపలు చనిపోతున్నాయనీ, ఆ పరిశ్రమల్లో పనిచేసే వారి పిల్లలకు కూడా క్యాన్సర్‌ సోకుతోందని తెలిసి బాధనిపించింది. అప్పుడే సేంద్రియ దుస్తులవైపు నా దృష్టి మళ్లింది. 2020లో ఇండియాకు వచ్చాక అమెరికాలో పరిచయం అయిన మెహర్‌ గుండవరంతో వివాహం అయ్యింది. ఆ తర్వాత ఇద్దరం ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డా.. సమాజానికి ఉపయోగపడే పని చేయాలన్న ఆలోచన మాత్రం మనసులో అలాగే ఉండిపోయింది. దాంతో చేస్తున్న ఉద్యోగం వదిలి అహ్మదాబాద్‌లో సహజ రంగులతో దుస్తులుచేసే ‘కలర్‌ ఆశ్రమ్‌’ వాళ్లను సంప్రదించా. నా ఉత్సాహం చూసి మావారు కూడా ప్రోత్సహించారు. అలా రెండేళ్ల క్రితం ఆధునిక తరానికి నచ్చేలా ‘ఎలిఫెంట్ ఇన్‌ యూ’ అనే బ్రాండ్‌తో ఆర్గానిక్‌ దుస్తుల తయారీ మొదలుపెట్టాం. గుజరాత్‌, భోపాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలోని దేశీకాటన్‌, హెంప్‌ వంటివాటితో ఆర్గానిక్‌ వస్త్రాలు చేసిచ్చే పరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నాం. వాటిని తెనాలిలో కుట్టిస్తాం. చూడ్డానికి సాధారణంగా అనిపించినా ధరిస్తే శరీరానికి ఎంతో సౌఖ్యంగా, చల్లగా ఉంటాయివి. అలర్జీల సమస్య ఉండదు. మామూలు దుస్తులతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువే. రూ.2వేల నుంచి రూ.5 వేల వరకూ ఉంటాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఉన్న చాలామంది యువత ఈ దుస్తుల్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గోవాలో ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్‌ని నడిపే విదేశీయురాలు లిజీకి మా ఆశయాలు నచ్చి మా దుస్తులకు ఉచితంగా మోడలింగ్‌ చేస్తున్నారు. మా వెబ్‌సైట్‌ నుంచే అత్యధికంగా అమ్మకాలు సాగుతున్నాయి. హైదరాబాద్‌లో రెండుసార్లు, బెంగళూరు, గోవాల్లో పలుమార్లు ఎగ్జిబిషన్లు నిర్వహించా. మంచి ఆదరణ లభించింది.

తిరిగివ్వాలనే ఉద్దేశంతో..

‘ఎలిఫెంట్ ఇన్‌ యూ’ అనే బ్రాండ్‌ పేరు ఎందుకు పెట్టారని అందరూ అడుగుతుంటారు. ఏనుగు అడవిలో రోజూ అనేక ప్రదేశాల్లో తిరుగుతుంది. భారీగా మేత మేస్తుంది. కానీ అది విసర్జించే పేడ చక్కని సేంద్రియ ఎరువు. అది అడవికి మేలు చేస్తుంది. దాని వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. మనమూ ప్రకృతిలోని సహజ వనరులు వాడుకుంటే మళ్లీ తిరిగివ్వాలనేది మా ఉద్దేశం. ఇవ్వకున్నా ప్రకృతిని ధ్వంసం చేయొద్దని ఏనుగును స్ఫూర్తిగా తీసుకున్నాం. కేవలం వ్యాపార దృక్పథంతోనే అయితే ఏవో కొత్త ఆకర్షణలు, బొటిక్‌లు పెట్టి దుస్తులని అధిక ధరలకు అమ్మవచ్చు. కానీ నా లక్ష్యం అది కాదు. మన దేశీయ పత్తిలో 5వేల రకాలను ఒకప్పుడు రైతులు సేంద్రియ విధానంలో సాగు చేసేవారట. మాకు జనగామ జిల్లా ఘన్‌పూర్‌ మండలంలోని మీదికొండలో వ్యవసాయ క్షేత్రం ఉంది. భవిష్యత్తులో ఇక్కడ పత్తి సహజంగా పండించి దుస్తులు తయారుచేయాలనే ఆలోచనలో ఉన్నాం. పాఠశాలలతో కలిసి పిల్లలకు సేంద్రియ దుస్తులపై అవగాహన కలిగించేలా కార్యశాలలు నిర్వహించాలనుకుంటున్నాం. మాతో కలిసి పనిచేయడానికి యువత వాలంటీర్లుగా కూడా వస్తున్నారు. ఏనుగుని స్ఫూర్తిగా తీసుకున్నా!

గుండు పాండురంగశర్మ, వరంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్