‘అపూర్వ’ ఆలోచన

జీవితానికో లక్ష్యం ఉండాలి... దాన్ని చేరుకునే దారి ఎంత కష్టమైనా సరే! కష్టపడే తత్వం, మన మీద మనకి నమ్మకం ఉంటే చాలు... విజయం మనదే అంటోంది దుగ్గిరాలకు చెందిన కొలగాని అపూర్వ. ఆడపిల్లవు... వ్యాపారమెందుకు హాయిగా ఉద్యోగం చేసుకో అని సలహా ఇచ్చారందరూ! అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్తే...జీవితంలో స్థిరపడిపోవచ్చనీ సూచించారు.

Updated : 23 Oct 2023 03:51 IST

జీవితానికో లక్ష్యం ఉండాలి... దాన్ని చేరుకునే దారి ఎంత కష్టమైనా సరే! కష్టపడే తత్వం, మన మీద మనకి నమ్మకం ఉంటే చాలు... విజయం మనదే అంటోంది దుగ్గిరాలకు చెందిన కొలగాని అపూర్వ. ఆడపిల్లవు... వ్యాపారమెందుకు హాయిగా ఉద్యోగం చేసుకో అని సలహా ఇచ్చారందరూ! అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్తే...జీవితంలో స్థిరపడిపోవచ్చనీ సూచించారు. కానీ, ఆమె మాత్రం తనకాళ్లపై తాను నిలబడాలనుకుంది. చేసే పని నలుగురికీ ఉపయోగపడాలనుకుంది. ఆ ప్రయత్నంలోనే ‘భ్రమరి’ పేరుతో సహజ సౌందర్య ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టింది. ఆ ప్రయాణం...

అందంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి! అలాగని ఏది పడితే అది వాడేస్తే...ప్రయోజనం మాట అటుంచి ఆరోగ్యానికి ప్రమాదం తప్పదు. ఈ ఆలోచనే రసాయనరహిత సౌందర్య ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టడానికి కారణమైంది. అయితే, అది అనుకున్నంత సులువేం కాదని అర్థం చేసుకోవడానికి నాకు ఎక్కువ కాలమేమీ పట్టలేదు. నేను ఎం.ఫార్మసీ పూర్తి చేశా. చదువయ్యాక కుటీర పరిశ్రమ ప్రారంభించాలనుకుంటున్నా అన్న ఆలోచన చెప్పినప్పుడు ‘వ్యాపారంలో బోలెడు సవాళ్లు ఉంటాయి. ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదంతా వద్దు’ అంటూ కుటుంబ సభ్యులూ, స్నేహితులూ నాకు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించారు. నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఎందుకంటే, ఈ ఆలోచనకు బీజం బీఫార్మసీ చదివే రోజుల్లోనే పడింది. అప్పట్లో ప్రాజెక్టు కోసం ఓ మాత్ర తయారు చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే సౌందర్య ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు శరీరానికి ఎంత హాని చేస్తాయో తెలుసుకున్నా. భవిష్యత్తులో ప్రకృతిహిత పదార్థాలతోనే బ్యూటీ ప్రొడక్ట్స్‌ చేయాలనీ, అందులోనే కెరియర్‌ వెతుక్కోవాలనీ నిర్ణయించుకున్నా.

ఇంటి నుంచే...

అందుకే అమ్మానాన్నలకు స్పష్టంగా నా భవిష్యత్తు లక్ష్యాలను చెప్పా. ఇక, కాదనలేకపోయారు. ముఖ్యంగా నాన్న రాధాకృష్ణ పెట్టుబడికోసం మూడు లక్షల రూపాయలను ఇచ్చి మరీ ప్రోత్సహించారు. వ్యాపారంలో ఒడుదొడుకులు ఎలా ఉంటాయో సూక్ష్మంగా చెప్పారు. దాంతో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయ్యింది. ఆ వెంటనే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆయూష్‌ సంస్థ నుంచి లైసెన్సు పొందా. అలా మూడేళ్ల క్రితం ‘భ్రమరి’ పేరుతో సంస్థని నమోదు చేయించా. ఆపై ఇంటి నుంచే సహజ సౌందర్య ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టా. సబ్బులూ, షాంపూలతో పాటు హెయిర్‌ ఆయిల్‌, ఫేస్‌వాష్‌ వంటివెన్నో చేస్తున్నా. వివిధ ప్రయోగాల అనంతరం ఒక్కో ప్రొడక్ట్‌ని అమ్మకానికి తీసుకురావడానికి మూడు నుంచి ఆరునెలల సమయం పడుతుంది. ఇందుకు అవసరమైన ముల్తానీమట్టి, వేప, బొప్పాయి, కరివేపాకు, గులాబీ రేకలు, చార్‌కోల్‌, స్ట్రాబెర్రీ వంటి వాటిని సేంద్రియంగా సాగు చేసే వివిధ ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నా. ఇదంతా ఒకెత్తయితే, మార్కెటింగ్‌ మరో ఎత్తు. వీటిని ప్రజలకు పరిచయం చేయడానికి దాదాపు ఏడాది పాటు కష్టపడ్డా. లాభాలూ అందుకుంటున్నా. ‘ఆడపిల్లలకు చదువయ్యాక ఉద్యోగం ఒకటే కెరియర్‌ ఆప్షన్‌ కాదు మరెన్నో లక్ష్యాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే... సాధ్యం కాదన్నవన్నీ సాధించి చూపిస్తారు’.

న్యూస్‌టుడే, దుగ్గిరాల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్