సంపద తెచ్చారు..స్టార్లు అయ్యారు!

తారలు అంటే ఒకప్పుడు సినిమావాళ్లే! మరి ఇప్పుడో.. ఇన్‌ఫ్లుయెన్సర్లూ ఆ జాబితాలో చేరారు. తమ మాటలతో.. సలహాలతో లక్షల మందిని ఆకర్షిస్తోన్న వీళ్లు కేవలం అలరించడానికే పరిమితం కావట్లేదు.

Updated : 29 Oct 2023 07:36 IST

తారలు అంటే ఒకప్పుడు సినిమావాళ్లే! మరి ఇప్పుడో.. ఇన్‌ఫ్లుయెన్సర్లూ ఆ జాబితాలో చేరారు. తమ మాటలతో.. సలహాలతో లక్షల మందిని ఆకర్షిస్తోన్న వీళ్లు కేవలం అలరించడానికే పరిమితం కావట్లేదు. రూ.కోట్ల సంపదనూ సృష్టిస్తున్నారు. దేశంలో అలాంటి కొందరిని ఫోర్బ్స్‌ ‘డిజిటల్‌ స్టార్స్‌’గా ఎంపిక చేసింది. అందులో వీరు ప్రత్యేకం.


తారలను మెప్పించి..
ధార్నా దుర్గ

ర్యాంకింగ్‌లో మొదటి స్థానం ధార్నాదే! ఈమెకి నటన, డ్యాన్స్‌ రెండూ పంచప్రాణాలు. అందుకే డిగ్రీ తర్వాత డ్యాన్స్‌, థియేటర్‌ ఆర్ట్స్‌ల్లో ఏది తీసుకోవాలా అని తెగ ఆలోచిస్తోంటే లాక్‌డౌన్‌ వచ్చింది. ఆన్‌లైన్‌ తరగతులు.. తర్వాత స్నేహితులతో కలిసి డ్యాన్స్‌, స్కిట్‌ ఛాలెంజ్‌లతో గడిపేసింది. నిజానికి ఈ దిల్లీ అమ్మాయికి సోషల్‌ మీడియా అంటేనే పడదు. కానీ తినడం.. టీవీ.. పడుకోవడంతోనే సరిపోతున్న తన దినచర్యను ఓరోజు వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. హాస్యాన్ని జోడించిన ఆ వీడియోకి లక్షల్లో వీక్షణలొచ్చాయి. ఇన్‌ఫ్లుయెన్సర్లూ మెచ్చడంతో సబ్‌స్క్రైబర్లూ అకస్మాత్తుగా పెరిగారు. రోజువారీ సంభాషణలు, ఇంటి సమస్యలు, పరిచయమయ్యే వింత వ్యక్తులు.. తన స్కిట్‌లకు అన్నీ కథావస్తువులే. ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడిస్తుండటంతో అనుసరించేవారు పెరిగారు. ఇంకేం యాడ్‌లూ వెతుక్కుంటూ వచ్చాయి. వేడుకల సమయంలో డ్యాన్స్‌టీచర్‌ నేర్పించే విధానాన్ని వీడియో చేస్తే దీపికా పదుకోణ్‌ ప్రశంసించడమే కాదు.. తన ఇన్‌స్టా స్టోరీలోనూ పోస్ట్‌ చేసింది. దాంతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యింది ధార్నా. తనని ఇన్‌స్టాలో దాదాపు 9 లక్షలు, యూట్యూబ్‌లో 2.6 లక్షలమంది అనుసరిస్తున్నారు. బాలీవుడ్‌ తారలతో కలిసి సినిమా ప్రచార వీడియోలూ చేసింది. బ్యూటీ, ఫ్యాషన్‌ సహా ఎన్నో ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తోంది. ‘మెటా’కీ ప్రచారకర్తగా ఎంపికైంది. ‘యాడ్‌, ప్రమోషన్‌ ఏదైనా నాదైన ముద్ర ఉండాలి. సృజనాత్మకత చూపించే వీలుండాలి. అప్పుడే అంగీకరిస్తా. లేదంటే ఎంత మొత్తం ఆఫర్‌ చేసినా చేయననే చెబుతా’నంటోంది 23ఏళ్ల ధార్నా.


ఏకైక టెకీ
శ్రీమణి త్రిపాఠి

‘వీళ్లకు తెలియదు.. సరిగా వివరించలేరు అంటారని వెనకడుగు వేస్తారే కానీ.. అమ్మాయిలకీ టెక్‌ పరిజ్ఞానం ఎక్కువే’ అంటుంది శ్రీమణి. అందుకు తనే ఉదాహరణ మరి! 24 ఏళ్ల శ్రీమణిది నాగ్‌పుర్‌. కామర్స్‌లో డిగ్రీ అయ్యాక గ్రాఫిక్‌ డిజైన్‌ కోర్సు చేసింది. అందులో ఫ్రీలాన్సర్‌గా కథల వీడియోలు, సంస్థల సోషల్‌ మీడియా ఖాతాలకు పని  చేసింది. అప్పుడే ఆమె దృష్టి యూట్యూబ్‌పై పడింది. కాలేజీ సమయంలోనే బాగా మాట్లాడుతుందన్న పేరుంది శ్రీమణికి. ఇంకేం తనకు నచ్చిన టెక్‌ అంశాలతో వీడియోలు మొదలుపెట్టింది. ‘అందరిలా బ్యూటీ, ఫ్యాషన్‌లపై దృష్టిపెట్ట’మన్న సలహాలొచ్చినా వినిపించుకోలేదు. యాప్‌లు, ఫోన్‌ ఫీచర్లు, వ్యక్తిగత, ఇంటి సమస్యలకు సాయపడే సాంకేతికతల గురించి చెబుతుంది. చదువు రాని వారికీ అర్థమయ్యేలా చెప్పే తన తీరుతో యూట్యూబ్‌లో 21 లక్షల మంది అనుసరించేలా చేసుకుంది. తన ఇన్‌స్టాకి 2.6 లక్షలమంది ఫాలోయర్లున్నారు. టెక్‌ విభాగంలో ఎంపికైన ఇన్‌ఫ్లుయెన్సర్లలో శ్రీమణి ఒక్కతే అమ్మాయి. వివో, శామ్‌సంగ్‌, మోటరోలా, బోట్‌ సహా ఎన్నో సంస్థలతో పనిచేసింది.


ఫెయిలైన అమ్మాయి
నేహా నాగర్‌

‘డబ్బు విషయాలు మీ ఆడవాళ్లకెందుకు? ఇది మగవాళ్ల పని’ అనే మాటలు వింటూ పెరిగిన నేహాను ‘సీఏ కష్టమైన కోర్సు.. కానీ ఇది చేసినవాళ్లకి చాలా గుర్తింపు ఉంటుం’దన్న టీచర్‌ మాటలు ఆకర్షించాయి. ఇదే చదవాలనుకొని ప్రవేశపరీక్ష రాసి.. మూడుసార్లూ ఫెయిల్‌ అయ్యింది. పట్టుదలతో ఫైనాన్స్‌ విద్యనే చదవాలనుకొని ఎంబీఏ వైపు వెళ్లింది. ఆర్థిక విషయాలపై పట్టు తెచ్చుకొని మంచి సంస్థల్లో ఉద్యోగం సాధించింది. పోటీపడి పనిచేసినా అమ్మాయి అనగానే క్లయింట్లు చూసే చిన్నచూపు తనకు నచ్చేది కాదు. అందుకే ‘టాక్సేషన్‌ హెల్ప్‌’ పేరుతో సంస్థను ప్రారంభించి టాక్స్‌, మార్కెటింగ్‌, ట్రేడింగ్‌ వంటి అంశాల్లో సంస్థలకు సాయమందించడం మొదలుపెట్టింది. విజయవంతంగా సాగిపోతున్న ఆమె లాక్‌డౌన్‌లో చాలామందికి ఆర్థిక అంశాలపై కనీస అవగాహన ఉండటం లేదని గ్రహించింది. మహిళలకు సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌ చిట్కాలతోపాటు స్కామ్‌లు, పెట్టుబడులు, ఆర్థిక ద్రవ్యోల్బణం వంటి ఎన్నో అంశాలను సులువుగా వివరించడం మొదలుపెట్టింది. తనకు ఇన్‌స్టాలో 15 లక్షలు, యూట్యూబ్‌లో 3.75 లక్షలమంది ఫాలోయర్లున్నారు. 28ఏళ్ల నేహాకి పాడ్‌కాస్టింగ్‌ ఛానెల్‌ కూడా ఉంది. ఈ దిల్లీ అమ్మాయి ఎన్నో స్టార్టప్‌లకు పెట్టుబడులు పెట్టడమే కాదు.. ఫ్యాషన్‌, స్పోర్ట్స్‌, మేకప్‌ సహా ఎన్నో టాప్‌ బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేస్తోంది.


* గత ఏడాది దేశీ ఇన్‌ఫ్లుయెన్సర్ల మార్కెట్‌ విలువ రూ.1200 కోట్లు. సమాచారంలో నాణ్యత, ఎంత మందిని ఆకర్షిస్తున్నారు, పనిచేసిన సంస్థల ఆధారంగా ఫోర్బ్స్‌ వివిధ కేటగిరీల్లో 100 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంపిక చేసింది. వారిలో 45 మంది అమ్మాయిలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్