ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ సాధించాం!

వారిద్దరూ అక్క చెల్లెళ్లు... ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివారు.మంచి ఉద్యోగాలూ అందుకున్నారు. అంతటితో సంతృప్తి పడిపోలేదు. తాము చేసేది అందరికీ ఉపయోగపడాలనుకున్నారు. అందుకే, ఒకరు కృతిమ మేధతో గుండెపోటుని నివారించే మార్గాలపై పరిశోధన చేస్తుంటే, మరొకరు ఫుడ్‌టెక్నాలజీతో పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశాల్ని వెతుకుతున్నారు.

Updated : 30 Oct 2023 15:30 IST

వారిద్దరూ అక్క చెల్లెళ్లు... ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివారు.మంచి ఉద్యోగాలూ అందుకున్నారు. అంతటితో సంతృప్తి పడిపోలేదు. తాము చేసేది అందరికీ ఉపయోగపడాలనుకున్నారు. అందుకే, ఒకరు కృతిమ మేధతో గుండెపోటుని నివారించే మార్గాలపై పరిశోధన చేస్తుంటే, మరొకరు ఫుడ్‌టెక్నాలజీతో పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశాల్ని వెతుకుతున్నారు. వారే ఆకాశపు కుముదిని, హేమంతిక. తాజాగా ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌(పీఎమ్‌ఆర్‌ఎఫ్‌)నీ అందుకున్న హేమంతిక వసుంధరతో మాట్లాడింది..

‘చేసే పని పదిమందికీ ఉపయోగపడితేనే... సార్థకత ఉంటుదని’ తరచూ చెబుతారు అమ్మానాన్న. ఆ మాటలే స్ఫూర్తిగా నేనూ, అక్క మా కెరియర్‌ని నిర్మించుకోవాలనుకున్నాం. మాది వరంగల్‌. నాన్న నీలకంఠేశ్వరరావు ఎన్‌ఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. అమ్మ పద్మావతి గృహిణి. అక్క కుముదినీ నేనూ చిన్నప్పటి నుంచీ చదువుల్లో చురుగ్గా ఉండేవాళ్లం. ఇంటర్మీడియట్‌ వరకూ వరంగల్‌, గుంటూరుల్లో నా చదువు సాగింది. తర్వాత ఎన్‌ఐటీ రవుర్కేలాలో సీటు సంపాదించుకున్నా. బీటెక్‌ చివరి ఏడాదిలో ఉన్నప్పుడు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరిగాయి. అందులో బెంగళూరు స్టార్టప్‌ ‘ఎఫైన్‌ ఎనలిటికల్స్‌’లో డేటాసైంటిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ రెండేళ్లు పనిచేసినా...ఏదో అసంతృప్తి. ఆ సమయంలోనే మనదేశంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయన్న వార్తలు నాలో ఆలోచన రేకెత్తించాయి. మరో పక్క కృత్రిమ మేధను సామాజిక ప్రయోజనాలకోసం ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకోవాలన్న ఉత్సాహం నన్ను పరిశోధనా రంగంవైపు నడిపించాయి.

అలా పరిశోధిస్తున్నా.. నేను గేట్‌ రాయలేదు. కానీ, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో చదివే విద్యార్థులు తమ సీజీపీఏ 80శాతం కంటే ఎక్కువ ఉన్నప్పుడు నేరుగా రిసెర్చ్‌ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండటంతో దాన్ని వినియోగించుకుని ఐఐటీ దిల్లీలో చేరా. నేను కోరుకున్నట్లే కృత్రిమ మేధను ఎంచుకుని అధ్యయనం చేస్తున్నా. ఇందులో భాగంగా స్మార్ట్‌వాచ్‌ వినియోగదారుల డేటాను సేకరించి... గుండెపోటు కారణాలను విశ్లేషించడం, ఆ ముప్పుని తగ్గించే అంశాలను గుర్తించడం వంటి అంశాలపై నా రిసెర్చ్‌ సాగుతోంది. దీనిపైనే ఉపకార వేతనం కోసం పీఎంఆర్‌ఎఫ్‌కి సంక్షిప్తంగా వివరాలు రాసి పంపించా. రెండు రోజుల క్రితమే ఈ ఫెలోషిప్‌కి ఎంపికయ్యానని మెయిల్‌ వచ్చింది.  ఈ పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి మొదటి రెండేళ్లలో నెలకు రూ.70 వేలు, మూడో ఏడాదిలో నెలకు రూ.75 వేలు, చివరి రెండు సంవత్సరాల్లో నెలకు రూ.80 వేలు చొప్పున భృతి అందజేస్తారు. దీనికి అదనంగా ఏడాదికి రూ.2 లక్షల చొప్పున ఐదేళ్లకు కలిపి మొత్తం రూ.10 లక్షల గ్రాంటు పొందే అర్హత లభిస్తుంది. మూడేళ్ల క్రితం ఐఐటీ గువాహటీలో పీహెచ్‌డీ చేస్తోన్న మా అక్క కుముదిని కూడా ఈ ఉపకార వేతనాన్ని అందుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అరుదుగా, సహజంగా దొరికే కూరగాయల నుంచి సూప్‌ మిక్చర్‌ తయారీపై ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలో తను పరిశోధన చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ స్టూడెంట్‌ ఎక్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా జపాన్‌లో ఉంది. ‘మా దారులు వేరైనా...లక్ష్యం మాత్రం ఒకటే’ అందుకోసం ఎంతైనా శ్రమించగలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్