పోస్టుకార్డుపై.. పాత జ్ఞాపకాలు!

అమ్మమ్మ చేతి గోరుముద్దలు.. ఆమె ఒడిలో పడుకొని విన్న కథలు.. ఆ రోజులే వేరు! ప్రతిదానిలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఉంటుంది.

Published : 31 Oct 2023 01:38 IST

అమ్మమ్మ చేతి గోరుముద్దలు.. ఆమె ఒడిలో పడుకొని విన్న కథలు.. ఆ రోజులే వేరు! ప్రతిదానిలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఉంటుంది. ఆరోగ్యం, అందం.. ఎలాంటి సమస్యకైనా తన పోపుల పెట్టె నుంచి ఓ చిట్కా వచ్చేస్తుంది. ఇవన్నీ ఈ తరం కోల్పోతోంది అనిపించింది శురుతికి. అందుకే వాటిని అందరికీ గుర్తుచేసే మార్గాన్నీ కనిపెట్టింది. ఇదంతా ఎందుకో తను చెబుతోంది...

డబ్బు పొదుపు చేయడం.. ఇతరులతో ప్రేమగా మెలగడం.. వంటివెన్నో అమ్మమ్మ నుంచే నేర్చుకున్నాం. అయితే అదో పాఠంలా కాదు.. మనసులో నాటుకుపోయే కథల్లా చెప్పేది. గోరుముద్దలు పెడుతూ చెబుతోంటే నేను, చెల్లి.. ఇష్టపడని కూరలనీ తెలియకుండానే తినేసేవాళ్లం. ఓసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటోంటే.. మాకు దక్కిన అదృష్టం మా పిల్లలకు లేదని బాధనిపించింది. కథలే కాదు.. జలుబు, తలనొప్పి లాంటివాటికీ అమ్మమ్మ చెప్పే చిట్కాలు చాలా బాగా పనిచేసేవి. నా దగ్గర అమ్మమ్మ పెట్టె ఒకటి ఉంది. దాన్ని తెరిస్తే.. ఈ చిట్కాలు, తన ప్రత్యేక వంటలు, విలువైన సందర్భాలు, ఆ పాత ఉత్తరాలు.. లాంటివెన్నో కనిపించాయి. నిజానికి అవి తర్వాతి తరాలకు ఆమె అందించిన వారసత్వ సంపదే అనిపించింది. వాటినోసారి అందరికీ గుర్తు చేద్దామనుకున్నా.

మాది కోయంబత్తూరు. నేనో గ్రాఫిక్‌ డిజైనర్‌ని. ఏం చేస్తే బాగుంటుందా అని చెల్లి, నేను ఆలోచించాం. స్నేహితులతో చర్చిస్తే వాళ్లూ తమ అనుభవాలను పంచుకున్నారు. వాటన్నింటినీ పోగు చేద్దామనిపించింది. రెండేళ్ల క్రితం నా వెబ్‌సైట్‌ ‘మేక్‌ మెయిల్‌’లో ‘పాటీస్‌ పెట్టి’నీ చేర్చా. అంటే అమ్మమ్మ పెట్టె అని అర్థం. దీనిలో ఎవరైనా తమ బామ్మల చిట్కాలు, ప్రత్యేక వంటలను పంచుకోవచ్చు. అలా పంపిన వారికి ప్రత్యేకంగా వాటిని ఓ కార్డు రూపంలో డిజైన్‌ చేసీ ఇస్తాం. చక్కగా వాటిని తర్వాతి తరాలకు దాచి పెట్టొచ్చు. దాన్ని స్నేహితులకూ పంపొచ్చు. వేగంగా మారుతున్న కాలం.. ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనేంటి అనిపిస్తోందా? కొవిడ్‌లో అందరం ఇళ్లకే పరిమితమయ్యాం. ఎలా ఉన్నారన్న ఒక్క పలకరింపు ఎంత ముఖ్యమో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఆ సమయంలో నేను నా స్నేహితులకు క్షేమ సమాచారాన్ని అడుగుతూ పోస్ట్‌ కార్డులు పంపా. అందరూ చాలా ఆనందించారు. అందుకే ఈ తీరుని ఎంచుకున్నా. వేలమంది తమ బామ్మల చిట్కాలను మాతో పంచుకుంటున్నారు కూడా. వెనకపడొద్దు, సాధించాలి అంటూ కాలంతోపాటు పరిగెడుతున్నాం. ఇలాంటి సమయంలో ప్రేమను మోసుకొచ్చిన చిన్నకార్డు.. అందుకున్న వారి ముఖంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. అది ఎలాంటి బహుమతులకూ సాటి రాదు. పాత తరం గొప్పతనం చెబుతూనే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకీ విలువ ఇవ్వమని చెప్పే ప్రయత్నమే మా పోస్ట్‌ కార్డు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్