ఆన్‌లైన్‌.. యోగినులు

యోగా.. చాలామందికి ఇది వ్యాయామం కాదు.. జీవనశైలి కూడా! అది శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం అలాంటిది మరి. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు వీళ్లు. ఇతరులకీ చేరువ చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారారు. లక్షల మందిని ఆకట్టుకుంటున్నారు.

Updated : 09 Nov 2023 14:16 IST

యోగా.. చాలామందికి ఇది వ్యాయామం కాదు.. జీవనశైలి కూడా! అది శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం అలాంటిది మరి. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు వీళ్లు. ఇతరులకీ చేరువ చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారారు. లక్షల మందిని ఆకట్టుకుంటున్నారు.

బ్లాగర్‌గా మొదలై..

అత్యంత ధనిక యోగా ఇన్‌స్ట్రక్టర్‌ అంటే రాధిక పేరే వినిపిస్తుంది. ఆమె ఆస్తి విలువ రూ.600 కోట్లకు పైమాటే! ఈమెది దిల్లీ. స్కూల్లో ఉన్నప్పుడు అమ్మతో కలిసి సరదాగా యోగా ప్రారంభించింది. శరీరాన్నీ, మనసునీ ఉల్లాసంగా ఉంచే ఈ వ్యాయామం ఆమెకు బాగా నచ్చి రోజూ సాధన చేసేది. వీడియో ఎడిటింగ్‌లో డిగ్రీ చేసింది. కానీ.. నచ్చిన పనైతే మరింత రాణించొచ్చని నమ్మిన తను దీన్నే కెరియర్‌గా మలుచుకుంది. ‘యోగాసిని’ పేరుతో బ్లాగర్‌గా తన ప్రయాణం ప్రారంభించింది. నాలుగు గోడల మధ్య యోగాసనాలు వేయడం తనకంతగా నచ్చలేదు. రాధికకు పర్యటనలన్నా ప్రాణమే. దీంతో ప్రకృతితో మమేకమవుతూ యోగాసనాలు వేసి, ఆ ఫొటోలను పోస్ట్‌ చేసింది. వాటికి మంచి స్పందన వచ్చింది. దాంతో ప్రముఖ సంస్థల నుంచి ప్రకటనల అవకాశాలు వరుసకట్టాయి. బ్యూటీ, ఫిట్‌నెస్‌, మానసిక ఆరోగ్య సలహాలు సూచిస్తూ వేసే ఆసనాలకు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ప్రచారకర్త. తన ఇన్‌స్టాను 6.13 లక్షలు, యూట్యూబ్‌ను దాదాపు లక్షమంది అనుసరిస్తున్నారు. టెడెక్స్‌ స్పీకరు కూడా.


మోడల్‌ కూడా..

గ్రాడ్యుయేషన్‌ పూర్తవడంతోనే మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది ప్రదాయిని. ఈమెది చెన్నై. చిత్రాల్లోనూ నటించింది. కానీ ఎక్కువగా మోటివేషనల్‌ స్పీకర్‌గానే గుర్తింపు. అమ్మాయిల్లో సానుకూలతను నింపుతుంటుంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ప్రదాయిని యోగా ఇన్‌స్ట్రక్షన్‌ కోర్సు చేసి, యోగినిగా మారింది. దేశవ్యాప్తంగా యోగా సెషన్లు నిర్వహిస్తుంటుంది. తన ప్రత్యేకతల్లో పాగా ఒకటి.. అంటే పప్పీలతో చేసే యోగా. ఏదైనా ఇబ్బందైనా.. దూరప్రాంతాలకు వెళ్లాల్సొచ్చినా చాలామంది కుక్కలను వదిలేస్తుంటారు. ఇంటి వాతావరణానికి అలవాటుపడిన అవేమో బెంబేలెత్తుతాయి. అలాంటివాటిని చేరదీసే సంస్థలతో ఒప్పందం చేసుకొని ఆ పప్పీలతో కలిసి యోగా చేయిస్తుంది. అలా వాటిని దత్తత తీసుకునేవాళ్లు దొరుకుతారనే ఆశ ఒకపక్కయితే వాటి చేష్టలతో ఒత్తిడీ దూరం చేయొచ్చన్న ఆలోచన ప్రదాయినిది. యోగానే కాదు.. వీగన్‌ పద్ధతిని అనుసరించే తను వాటికి సంబంధించిన ఆహారం, మోడలింగ్‌ అవకాశాలు, ప్రకృతి హిత జీవన విధానం, దుస్తులు, జీవనశైలికి సంబంధించిన సలహాలనూ ఇస్తుంది. తన ఇన్‌స్టా ఖాతాను 4.12 లక్షలమంది అనుసరిస్తున్నారు.


పైలట్‌ కావాలనుకొని..

ఆటలన్నా.. రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగరడమన్నా అన్షుకకి ప్రాణం. ఈతలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌నీ సాధించింది. కానీ అనుకోని ప్రమాదం ఆమె ప్రయాణాన్ని మార్చింది. అన్షుకది ముంబయి. తనేం చేస్తానన్నా ఇంట్లో ప్రోత్సహించేవారు. దాంతో మగవాళ్లతో పోటీపడి ఆటలాడేది, వాహనాలు నడిపేది. ఓసారి బైకు మీద వెళుతూ ప్రమాదానికి గురైంది. కాళ్లు విరిగాయి. తలకీ, వెన్నెముకకీ బలమైన గాయాలయ్యాయి. నెలలపాటు మంచానికే పరిమితమైంది. కోరుకున్న పైలట్‌ ఉద్యోగం దూరమవుతుందన్న బాధతో మానసికంగా కుంగిపోయింది. ఇది గమనించిన వాళ్లమ్మ అన్షుకను యోగా దిశగా ప్రోత్సహించింది. ఆవిడ యోగా శిక్షకురాలు కూడా. కేవలం మందులపైనే ఆధారపడటం ఇష్టంలేని అన్షుక కూడా సాధన మొదలుపెట్టింది. నెమ్మదిగా శరీరం, మనసు ఆధీనంలోకి రావడంతో కోర్సు చేసి యోగినిగా మారింది. ‘అన్షుక యోగ’తో ఆంత్రప్రెన్యూర్‌గా మారింది. యోగాకు పైలేట్స్‌, ఏరియల్‌ టెక్నిక్స్‌ వంటివి జోడించడం ఈమె ప్రత్యేకత. దీపిక పదుకోణ్‌, అలియా, కరీనా కపూర్‌, రకుల్‌ సహా ఎంతోమంది ఈమె శిష్యులే. ఇన్‌స్టాలో ఆడవాళ్ల సమస్యలకు తేలిక ఆసనాలను సూచిస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ మారింది. తన ఖాతాను 4.2 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఉత్తమ సెలబ్రిటీ యోగా నిపుణురాలిగా గతేడాది ‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఐకాన్‌’ అవార్డునూ అందుకుందీమె.


తెలుగులో..

తేజస్వినీ మనోజ్ఞ.. మిస్‌ ఎర్త్‌ ఇండియాగా నిలిచిన ఈ అమ్మాయి డాక్టర్‌, మోడల్‌, డ్యాన్సర్‌, మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. ఈ హైదరాబాదీ తన యూట్యూబ్‌, ఇన్‌స్టాల్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలు, నృత్యరూపకాలతోపాటు యోగా గొప్పతనం, వివిధ ఆసనాలనూ పంచుకుంటుంది. తనని యూట్యూబ్‌లో 2.8లక్షలు, ఇన్‌స్టాలో 6.8 లక్షలమంది అనుసరిస్తున్నారు.


సాహితీ రెడ్డి.. ప్రెగ్నెన్సీ సమయంలో తనకొచ్చిన సమస్యలను పోగొట్టుకోవడానికి యోగాను ఆశ్రయించిన ఈమె ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కనపెట్టి మరీ ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. వేల మందికి శిక్షణిస్తోంది. యోగాసనాల వీడియోలను ఇన్‌స్టాలో ‘యోగావిత్‌సాహితి’ పేరుతో పంచుకుంటోంది. తనను లక్షమందికి పైగా అనుసరిస్తున్నారు.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్