ఆర్థిక ఇబ్బందులు దాటి.. అంతర్జాతీయ స్థాయికి!

ఫిట్‌నెస్‌ కోసం సరదాగా మొదలుపెట్టిన ఆట కాస్తా.. ఆమెకు జీవిత లక్ష్యంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా పట్టుదలగా ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా పోటీ పడుతోంది.. విజయవాడకు చెందిన నెలకుడితి అనూష. ఆ క్రమంలో ఆమె దాటిన సవాళ్లెన్నో!

Published : 06 Nov 2023 01:52 IST

ఫిట్‌నెస్‌ కోసం సరదాగా మొదలుపెట్టిన ఆట కాస్తా.. ఆమెకు జీవిత లక్ష్యంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా పట్టుదలగా ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా పోటీ పడుతోంది.. విజయవాడకు చెందిన నెలకుడితి అనూష. ఆ క్రమంలో ఆమె దాటిన సవాళ్లెన్నో!

మ్మ నిర్మల, నాన్న శంకరరావు వ్యాపారి. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌ కోమసని టెన్నిస్‌లో శిక్షణ తీసుకున్నా. అది కాస్తా ఆటపై ప్రేమగా మారింది. సీరియస్‌గా సాధన చేశా. అమ్మానాన్నలూ ప్రోత్సహించారు. బాగా ఆడేదాన్ని కానీ తొలిరోజుల్లో టోర్నమెంట్‌లు ఎక్కడ నిర్వహిస్తారు? ఎలా పాల్గొనాలన్నదీ తెలిసేది కాదు. చెప్పేవారూ లేరు. ఇంతలో పదో తరగతికి వచ్చేశా. దీనికోసం ఏడాది విరామం కూడా తీసుకున్నా. అదయ్యాక శిక్షకుడు వీరేందర్‌ మెహల్డా దగ్గర చేరా. ఆయన ద్వారా దిల్లీలో టెన్నిస్‌ టోర్నమెంట్‌కి వెళ్లాను. ఆ పక్కనే సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలూ జరుగుతున్నాయి. టెన్నిస్‌లో పసుపు రంగు గట్టి బంతి ఉంటుంది కదా! సాఫ్ట్‌ టెన్నిస్‌లో మృదువుగా ఉండే రబ్బర్‌ బంతితో ఆడతారు. అది నన్ను బాగా ఆకర్షించింది. దీంతో ఆ ఆట నేర్చుకోవడమే కాదు... ఆసియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌-2019 పోటీల్లోనూ పాల్గొన్నా.

ఆటలంటేనే ఖర్చుతో కూడుకున్నవి. ఆహారం, సాధన, శిక్షణ ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. స్థోమతలేక ఒక నెల జిమ్‌కి వెళ్తే, మరో నెల ఆహారం విషయంలో రాజీ పడేదాన్ని. ధర ఎక్కువని పాత బంతులతోనే సాధన చేశా. ఇక విమాన ఛార్జీలు, బస కూడా లక్షల్లో ఖర్చవుతుంది. దిల్లీలో శిక్షణ తీసుకునేప్పుడు గంట సాధనకు రూ.500 కట్టాల్సి వచ్చేది. అప్పుడు ప్రతి క్షణమూ విలువైనదే అనిపించేది. అందుకే అసలు వృథా చేసేదాన్ని కాదు. పట్టుదలగా సాధన చేసేదాన్ని. ఇన్ని సమస్యల మధ్యే ఛాంపియన్‌ షిప్‌ల్లో పాల్గొన్నా. 2022 థాయ్‌లాండ్‌లో జరిగిన ఐఎస్‌టీఎఫ్‌ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ డబుల్స్‌, అంతర్జాతీయ సాఫ్ట్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌ 21 అమ్మాయిల డబుల్స్‌, సింగిల్స్‌ల్లో అయిదు పతకాలు గెలుచుకున్నా. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఐదు బంగారు పతకాలు సహా మరెన్నో రజత, కాంస్య పతకాలను అందుకున్నా. ఈ ఏడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడలకీ అర్హత సాధించా. కానీ తృటిలో పతకం చేజారింది. సొంత ఖర్చుతోనే ఇక్కడివరకూ చేరా. పతకం సాధించినపుడు చాలాసార్లు అభినందిస్తారు. కానీ సాయానికి ముందుకు రారు. ప్రభుత్వం కాస్త తోడ్పాటునిస్తే ఎంతోమంది క్రీడారంగంలోకి అడుగుపెడతారు. నాలాంటివాళ్లు మరింత రాణిస్తారు. అమ్మ ఉద్యోగం చేసేది. కానీ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నేను ఇబ్బంది పడతానని నాకోసం కొలువును
వదులుకుంది. మరెన్నో పతకాలు సాధించి తనకీ.. దేశానికీ మంచి పేరు తేవాలన్నది
నా కోరిక.

గొడిశెల వినయ్‌గౌడ్‌, ఈజేఎస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్