చెల్లి ప్లేయర్‌.. అక్క ఆర్బిటర్‌!

ఆ ఇద్దరూ చదరంగంలోనే రాణిస్తున్నారు.. ఒకరు క్రీడాకారిణిగా... మరొకరు చెస్‌ టోర్నీలు నిర్వహించే ఆర్బిటర్‌గా.  వాళ్లే మూగి ఫల్గుణి, సాహితి వర్షిణి.

Published : 07 Nov 2023 02:40 IST

ఆ ఇద్దరూ చదరంగంలోనే రాణిస్తున్నారు.. ఒకరు క్రీడాకారిణిగా... మరొకరు చెస్‌ టోర్నీలు నిర్వహించే ఆర్బిటర్‌గా.  వాళ్లే మూగి ఫల్గుణి, సాహితి వర్షిణి. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీళ్ల విజయగాథ మనమూ తెలుసుకుందామా! 

ఫల్గుణి, వర్షిణిలది విశాఖపట్నం. అమ్మ జయశ్రీవల్లి. నాన్న మూగి లోకేశ్వరరావుకి చదరంగంపై ఆసక్తి. పిల్లలకూ నేర్పించాలనుకున్నారు. ఫల్గుణి పన్నెండేళ్ల వయసులో చెస్‌ సాధన ప్రారంభించింది. కొవిడ్‌ సమయంలో టోర్నీలు లేకపోవడంతో చదరంగం నిబంధనలపై అధ్యయనం చేసి, ఆన్‌లైన్‌లో ఆర్బిటర్‌ కోర్సు పూర్తి చేసింది. 2021లో నేషనల్‌ ఆర్బిటర్‌గా అర్హత సాధించింది. క్రికెట్‌లో అంపైర్‌ మాదిరిగా చదరంగంలో టోర్నీలు నిర్వహించేందుకు, క్రీడాకారుల మధ్య సఖ్యత నెలకొల్పేందుకు ఆర్బిటర్లు ఉంటారు. టోర్నీల ఫలితాలను వరల్డ్‌ చెస్‌ అసోసియేషన్‌కు పంపేది కూడా వీళ్లే. కొవిడ్‌ తర్వాత బుడాపెస్ట్‌ (హంగేరీ)లో ఆర్బిటర్‌ అర్హతతో డిగ్రీ కళాశాలలో సీటుతోపాటు అక్కడ గ్రాండ్‌ మాస్టర్ల టోర్నీ నిర్వహించేందుకు అవకాశాన్నీ సంపాదించింది. ఇప్పటివరకు నేరుగా నాలుగు, ఆన్‌లైన్‌లో పలు టోర్నీలు నిర్వహించింది. తాజాగా ఆసియన్‌ చెస్‌ ఫెడరేషన్‌, ఫిలిప్పీన్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఫిడే ఆర్బిటర్‌ సెమినార్‌లో ఉత్తీర్ణత పొంది, ప్రతిష్ఠాత్మక ‘ఫిడే ఆర్బిటర్‌’ టైటిల్‌కు అర్హత సాధించింది.

అక్కను చూసి..

వర్షిణి ఎనిమిదేళ్ల వయసు నుంచే ఈ ఆటలో అడుగుపెట్టింది. ఉజ్బెకిస్థాన్‌ (2017)లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రెండు కామన్వెల్త్‌ పోటీల్లోనూ స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 2018లో తన కంటే సీనియర్లతో పోటీపడి 5 స్వర్ణాలు గెలుచుకుని అందరి ప్రశంసలూ అందుకుంది. అండర్‌- 14లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం, జాతీయస్థాయి మహిళా విభాగంలో టాప్‌-10లో చోటు దక్కించుకుంది. 2022లో హంగేరీలో ముగ్గురు గ్రాండ్‌ మాస్టర్లపై విజయం సాధించి, ఛాంపియన్‌షిప్‌ సొంతం చేసుకుంది. 15 ఏళ్లకే దేశం తరఫున చెస్‌ ఒలింపియాడ్‌కు ప్రాతినిధ్యం వహించింది. మహిళా విభాగంలో క్యాండిడేట్‌ మాస్టర్‌, ఫిడే మాస్టర్‌, ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిళ్లు సాధించింది. తొమ్మిది అంతర్జాతీయ పతకాలు, నాలుగు ఫిడే టైటిళ్లు సాధించిన వర్షిణి ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది.

- కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్