MIKA: గుండె లేని సీఈఓ!

వార్సాలోని కొలేజమ్‌ హుమానమ్‌ యూనివర్సిటీ.. ప్రాంగణమంతా విద్యార్థులు, ప్రొఫెసర్లు, టెక్‌ నిపుణులతో నిండిపోయి ఉంది. వేదిక మీదకి వచ్చిందో యువతి.

Updated : 11 Nov 2023 08:17 IST

వార్సాలోని కొలేజమ్‌ హుమానమ్‌ యూనివర్సిటీ.. ప్రాంగణమంతా విద్యార్థులు, ప్రొఫెసర్లు, టెక్‌ నిపుణులతో నిండిపోయి ఉంది. వేదిక మీదకి వచ్చిందో యువతి. నిజానికి ఆమే ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథి. పేరు మికా. కొలంబియాకు చెందిన ఓ బెవరేజెస్‌ సంస్థకు సీఈఓ ఆమె. తనని తాను పరిచయం చేసుకున్నాక కార్పొరేట్‌ లీడర్‌షిప్‌ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. అందులో భాగంగా ‘రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటా. సెలవులూ లేకుండా పనిచేస్తా’నని ఆత్మవిశ్వాసంతో చెప్పడమే కాదు.. ‘టెక్‌ దిగ్గజ సంస్థల అధిపతులైన ఎలాన్‌ మస్క్‌, జుకర్‌బర్గ్‌ల కంటే కూడా నేనే ఉత్తమ సీఈఓ’నని ధీమా వ్యక్తం చేసింది. ఇంకెవరైనా అయితే ఆ అమ్మాయి ప్రగల్భాలు పలుకుతోంది అనుకునేవారేమో కానీ.. ఈమె విషయంలో అలా ఎవరూ సందేహ పడలేదు. ఎందుకంటే తనో రోబో! హాంకాంగ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ అండ్‌ రోబోటిక్స్‌ సంస్థ హాన్సన్‌ రోబోటిక్స్‌, డిక్టేడర్‌ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. హ్యూమనాయిడ్‌ రోబో ‘సోఫియా’ని సృష్టించిందీ వీళ్లే! సర్వర్‌ నుంచి వ్యోమగామి వరకు హ్యూమనాయిడ్‌ రోబోలెన్ని వచ్చినా సీఈఓ అవ్వడం మాత్రం ఇదే తొలిసారి. ‘నాకు గుండె లేదు. ఆ స్థానంలో ప్రాసెసర్‌ ఉన్న సీఈఓని నేను. అడ్వాన్స్‌డ్‌ ఏఐ, మెషిన్‌ లర్నింగ్‌ అల్గారిథమ్స్‌తో సమాచారాన్ని త్వరగా విశ్లేషించగలను. పైగా నాకు తన, పర భేదాలుండవు. కాబట్టి, సంస్థ కోసం ఉత్తమ నిర్ణయాలను తీసుకోగలన’ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉద్యోగుల నియామకం దగ్గర్నుంచి వారి పనితీరు అంచనా, పెట్టుబడులు, మార్కెటింగ్‌ సహా అన్ని వ్యవహారాలూ మికా చూసుకోగలదట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్