ప్రేమను పంచుదాం!

ఇల్లంతా వెలుగులు.. నోరూరించే మిఠాయిలు! కుటుంబసభ్యులు, బంధువులంతా ఓ చోట చేరితే ఆ సందడే వేరు. సంతోషాన్ని, ప్రేమను పంచే ఈ దీపావళి.. పర్యావరణం, జంతువులు, చిన్నారులకు మాత్రం ఎందుకు శాపంగా మారాలి? ఇదే ఆలోచించారీ తారలు. వెలుగుల పండగను కాలుష్య రహితంగా నిర్వహించుకుందామని పిలుపునిస్తున్నారు.

Updated : 12 Nov 2023 05:16 IST

ఇల్లంతా వెలుగులు.. నోరూరించే మిఠాయిలు! కుటుంబసభ్యులు, బంధువులంతా ఓ చోట చేరితే ఆ సందడే వేరు. సంతోషాన్ని, ప్రేమను పంచే ఈ దీపావళి.. పర్యావరణం, జంతువులు, చిన్నారులకు మాత్రం ఎందుకు శాపంగా మారాలి? ఇదే ఆలోచించారీ తారలు. వెలుగుల పండగను కాలుష్య రహితంగా నిర్వహించుకుందామని పిలుపునిస్తున్నారు.

వారి గురించీ ఆలోచించాలిగా..

‘దీపావళి సమయంలో ఇంటికి రావాలంటే భయమేసేది’ ఈ మాట అన్నది ఎవరో కాదు.. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. ఆ సమయంలో ఏర్పడే కాలుష్యం, పొగకి ఊపిరి ఆగుతుందేమోనని భయమేసేదట. తనకు అయిదేళ్ల వయసులో ఆస్తమా బయటపడింది. టపాసుల నుంచి వచ్చే పొగకి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికీ అదే పరిస్థితి. తనే కాదు.. ఎంతోమంది ఆరోగ్యవంతులైన చిన్నారులూ ఇలాంటి కాలుష్యం కారణంగా ఆస్తమా బారిన పడుతున్నారని చెబుతూ టపాసులు, కాలుష్యం లేని దీపావళికి ఓటేద్దామంటోంది ప్రియాంక. ‘మట్టి దీపాలైతే ప్రకృతికి హాని ఉండదు. కొందరు చేతివృత్తుల వారికి ఉపాధి అని అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాట మనసులో నాటుకుపోయింది. ఓసారి టపాసుల తయారీలో పాల్గొనేది ఎక్కువగా చిన్నపిల్లలే. అగ్నిప్రమాదంలో ప్రాణాలూ కోల్పోతుంటారని విన్నప్పుడు భయమేసింది. అందుకే పర్యావరణ హిత దీపావళికే నా ప్రాధాన్యం. వేడుకల పేరుతో ఇలా కాలుష్యం వ్యాప్తి చేసి, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ కారణమవుతున్నాం. రాబోయే తరాలకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాం. బదులుగా మొక్కలు పెంచండి.. ఎన్నో జీవితాల్లో వెలుగులు తెచ్చిన వాళ్లమవుతాం’ అంటోంది దియామిర్జా. సింప్లిసిటీకి ప్రాధాన్యమిచ్చే సాయిపల్లవిదీ ఇదే బాట. ‘వేడుకలంటే అయినవాళ్ల మధ్య సంతోషంగా సాగాలి. మనవల్ల ఎవరికీ హాని కలగకూడదు. అందుకే ఎకో దీపావళికే నా ప్రాధాన్యం’ అంటుందీమె. భూమి ఫడ్నేకర్‌ ‘కాలుష్యాన్ని కాదు.. ప్రేమను పంచుదా’మంటూ ఆత్మీయులకు మొక్కలను పంచుతోంది.

భూమి వాటిది కూడా!

అనుష్క శర్మకి మూగజీవులంటే ప్రాణం. వీగన్‌ జీవనశైలిని అనుసరిస్తోన్న ఈమె ‘భూమిపై మూగజీవులకీ సమాన హక్కు ఉంది. మన ఆనందం పేరుతో వాటిని భయపెట్టడం, ఒత్తిడికి గురిచేయడం తగదు’ అంటుంది. టపాసుల్లేని ప్రశాంత దీపావళికి ప్రాధాన్యమిద్దామని పిలుపునిస్తోంది. ‘పా’జిటివ్‌ పేరుతో క్యాంపెయిన్‌నీ నిర్వహించింది. అలియాదీ అదే మాట. ‘మనకే ఇబ్బంది వచ్చినా నోరు తెరిచి చెప్పగలం. పాపం జంతువులకు ఆ అవకాశం ఉండదు. మనమే అర్థం చేసుకుందాం’ అంటుందీమె. ‘పూచ్‌ ఓవర్‌ పటాకా’ పేరుతో టపాసులకు వ్యతిరేకంగా ప్రచారాన్నీ చేస్తోంది. ‘చిన్న శబ్దాన్ని భరించలేక చెవులు మూసేసుకుంటాం. తలనొప్పి అని బాధపడతాం. మనకంటే మందులున్నాయి. పాపం మూగజీవులకు పారిపోవడం మినహా వేరే అవకాశముండదు. వాటి గురించీ ఆలోచిద్దా’మంటుంది అనన్య పాండే. ఈమే కాదు దిశాపటానీ సహా ఎంతోమంది ‘పెట్‌ మామీస్‌’ టపాసులొద్దంటూ ప్రచారం చేస్తున్నారు.


టపాసులు సంప్రదాయంలో భాగం! వాటినెలా ఆపేస్తాం అనేవారూ లేకపోలేదు. అందుకని ప్రణీత ప్రకృతికే ప్రాధాన్యమిస్తూ ఎకో క్రాకర్లకు ఓటేయమంటోంటే.. చేతివృత్తుల వారికి ఉపాధినిద్దాం అంటున్నారు ప్రగ్యా జైశ్వాల్‌, అదాశర్మ వంటివారు. మట్టి ప్రమిదలనే కొందాం.. స్థానికంగా తయారు చేసిన వారి వద్దే తీసుకుందామంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాన్నీ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్