ఎవరూ లేరని.. అనుకోకూడదని!

తక్కువ ఫీజులు.. వీధి బాలలకు చదువులు చెప్పడం.. ఒంటరి వృద్ధులను చేరదీసి వారి బాగోగులు చూడటం.. ఇలా చెప్పుకొంటూ వెళితే జాగృతి చేపడుతోన్న కార్యక్రమాలెన్నో! 27 ఏళ్లమ్మాయి.. ఎదగడంపై కాకుండా సేవ వైపు ఎందుకు మొగ్గు చూపెడుతోందంటే.. దానికి అమ్మే కారణం అంటోంది.

Updated : 18 Nov 2023 03:14 IST

తక్కువ ఫీజులు.. వీధి బాలలకు చదువులు చెప్పడం.. ఒంటరి వృద్ధులను చేరదీసి వారి బాగోగులు చూడటం.. ఇలా చెప్పుకొంటూ వెళితే జాగృతి చేపడుతోన్న కార్యక్రమాలెన్నో! 27 ఏళ్లమ్మాయి.. ఎదగడంపై కాకుండా సేవ వైపు ఎందుకు మొగ్గు చూపెడుతోందంటే.. దానికి అమ్మే కారణం అంటోంది. అదెలాగో తెలియాంటే ఈమె కథను చదివేయాల్సిందే!

జాగృతి సవానీ ఈ భూమ్మీదకు రాకముందే వాళ్ల నాన్న చనిపోయారు. దీంతో తననీ, అన్నయ్యనీ పెంచడానికి తల్లి ఎన్ని కష్టాలు పడిందో ఆమె కళ్లారా చూసింది. ‘రేపెలా?’ అని అమ్మ కంగారు పడిన ప్రతిసారి ఆమె కష్టం ఎలా తగ్గించాలా అని ఆలోచించేది. అందుకే కష్టపడి స్కాలర్‌షిప్‌లు తెచ్చుకుంది. ట్యూషన్లు వగైరా చెప్పేది. ఈమెది సూరత్‌. ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తయ్యాక టీచర్‌ ఉద్యోగాన్నీ సంపాదించింది. సిలబస్‌ పూర్తిచేయడం కాదు.. నాణ్యమైన విద్యను అందించడం ప్రధానమని నమ్మింది జాగృతి. అందుకే సొంతంగా ‘ఎల్‌బీ సవానీ’ పేరుతో స్కూలు ప్రారంభించింది. తన విద్యార్థులు చదువులు, పరీక్షల ఒత్తిడితో కాకుండా ఆనందంగా నేర్చుకోవాలని ఆమె తాపత్రయం. అందుకే సులువైన పద్ధతిలో బోధించడం, జీవన నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. రామాయణ, భారతాలకు సిలబస్‌లో చోటివ్వడమే కాదు.. పుస్తక భాషనీ సరళీకృతం చేస్తోంది.

తన పాఠశాలలో అనాథలకు ఉచితం, ఒంటరి తల్లుల పిల్లలకు సగం ఫీజే తీసుకుంటుంది. ‘నాన్న లేని జీవితం నాకు బాగా తెలుసు. అందుకే అమ్మకే కాదు.. అలాంటి తల్లులందరికీ సాయపడాలని ముందే నిర్ణయించుకున్నా’ అంటుంది జాగృతి. ఉపాధ్యాయులూ ఆడవాళ్లే. మురికివాడల పిల్లలు చదువుకు నోచుకోలేకపోవడం, చెడు అలవాట్లకు బానిస అవడం చూసి వారికి సాయంత్రాలు, సెలవు దినాల్లో పాఠాలు చెబుతోంది. వారికి అవసరమైన సామాన్లనూ అందిస్తోంది. చిన్నప్పటి నుంచీ ఎప్పుడు మనసు బాగోలేకపోయినా, సెలవులొచ్చినా వృద్ధాశ్రమాలకు వెళ్లడం జాగృతికి అలవాటు. పెద్దయ్యాక బరువంటూ చాలామంది వృద్ధులను ఒంటరిగా వదిలేయడం గమనించింది. వారికి ఎన్‌జీఓలతో కలిసి సాయం చేస్తోంది. వారితో మాట్లాడుతూ ఒంటరితనం దూరం చేయడమే కాదు.. వారి అవసరాలను తనే చూసుకుంటోంది. స్కూలును గుజరాత్‌ వ్యాప్తంగా నాలుగు బ్రాంచీలకు పెంచింది. ఆమె వల్ల ఎంతోమంది విద్యను కొనసాగించగలుగుతున్నారు. ‘బాల్యం ప్రశాంతంగా సాగితేనే ఉత్తమ పౌరులు తయారవుతారు. అందుకే నేర్చుకోవడాన్ని సరదాగా మలుస్తున్నా. నా వెయ్యిమంది విద్యార్థులూ నా పిల్లలే’ అంటోన్న జాగృతి పీహెచ్‌డీని చేస్తోంది. ఎవరూ లేరన్న భావన కొందరిలోనైనా తగ్గించాలి.. తన వల్ల ఎంతోమంది ముఖాల్లో నవ్వులు విరియాలన్నదే ఆమె తాపత్రయమట.. అందుకే ఈ సేవలన్నీ చేస్తున్నానంటోన్న ఆమె కథ స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్