గాంధీ బలం.. సైన్స్‌ చరిత్ర చెప్పారు!

చరిత్ర అంటే రాజులూ, రాజ్యాలు... తేదీలూ, సంవత్సరాలేనా? వాటితోపాటు పరిశోధనలూ, ఆవిష్కరణలు.. సైన్స్‌ పరిణామక్రమం కూడా అంటారు జాహ్నవి ఫాల్కీ..  భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ అధ్యాయం ప్రత్యేకం... అహింసా, సత్యాగ్రహాలనే పదునైన ఆయుధాలతో ఆయన సాధించి...

Published : 20 Nov 2023 01:55 IST

చరిత్ర అంటే రాజులూ, రాజ్యాలు... తేదీలూ, సంవత్సరాలేనా? వాటితోపాటు పరిశోధనలూ, ఆవిష్కరణలు.. సైన్స్‌ పరిణామక్రమం కూడా అంటారు జాహ్నవి ఫాల్కీ..  భారత స్వాతంత్య్రోద్య మంలో గాంధీ అధ్యాయం ప్రత్యేకం... అహింసా, సత్యాగ్రహాలనే పదునైన ఆయుధాలతో ఆయన సాధించిన విజయాలని నేటి తరానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు కరుణ మంతెన... తాజాగా వీరులక్ష డాలర్లు విలువ చేసే ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అవార్డుని అందుకున్న సందర్భంగా వారి స్ఫూర్తి కథనాలు...

సైన్స్‌ చరిత్ర చెప్పి..

రిత్ర అంటే మనకి ఠక్కున గుర్తొచ్చేవి రాజకీయ, సామాజిక పరిణామాలే. కానీ సాంకేతిక, పరిశోధనా రంగాల్లో వచ్చిన మార్పులని పుస్తక రూపంలోకి తీసుకొచ్చి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చరిత్రకారిణిగా రాణిస్తున్నారు డా.జాహ్నవిఫాల్కీ. సామాన్యులు కూడా సైన్స్‌ పరిశోధనలు తెలుసుకొనేందుకు వీలుగా ఏర్పాటు చేసిన బెంగళూరు సైన్స్‌ గ్యాలరీని స్థాపించింది జాహ్నవీనే. మనదేశ అభివృద్ధిలో సైన్సుపాత్రపై లోతైన పరిశోధనలు చేశారామె. ముఖ్యంగా న్యూక్లియర్‌ సైన్స్‌ అభివృద్ధితో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, వలసవాద పాలన అనంతరం భారతీయుల జీవితాల్లో సైన్స్‌ పాత్రపై ఎన్నో పరిశోధనా పత్రాలని అందించారీమె. ముంబయికి చెందిన జాహ్నవి అక్కడి ఎల్‌ఫిన్‌స్టోన్‌ కాలేజీలో బీఏ చదివారు. ఆపై లండన్‌ యూనివర్సిటీలో ఆసియా, ఆఫ్రికా ఖండాల రాజకీయాలని ప్రత్యేకాంశంగా తీసుకుని పీజీ చేశారు. జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి హిస్టరీ- సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశంతో పీహెచ్‌డీ చేశారు. డాక్టరేట్‌ అందుకున్నాక జర్మనీలోని డచెస్‌ మ్యూజియంలో రెసిడెన్స్‌ స్కాలర్‌గా తన కెరియర్‌ ఆరంభించారు. ఆపై ఇంపీరియల్‌ కాలేజీలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోగా, విస్సెన్స్‌చాఫ్ట్‌స్కోలెగ్‌జు బెర్లిన్‌లో ఫెలోగా ఉన్నారు. లండన్‌లోని సైన్స్‌ మ్యూజియంలో కొన్నాళ్లపాటు క్యూరేటర్‌గా పనిచేశారు. 2020లో సైక్లోట్రాన్‌ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారీమె. సైక్లోట్రాన్‌ అనేది.. అత్యంత పురాతనమైన, పార్టికల్‌ యాక్సిలరేటర్‌. దీని సాయంతో విశ్వ ఆవిర్భావ రహస్యాలతో పాటు అనేక కీలకాంశాలని తెలుసుకోవచ్చు. ఈ అనుభవాలతో  భారతదేశ అణు పరిశోధన చరిత్రపై ‘ది అటామిక్‌ స్టేట్‌’ అనే పుస్తకం రాశారు. 21వ శతాబ్దంలో సైన్స్‌ దిగ్గజ దేశాలుగా ఎదిగిన ఇండియా- చైనాలపై రాసిన పుస్తకం.. ‘సైన్స్‌ ఆఫ్‌ జెయింట్స్‌’కి కో-ఎడిటర్‌గా పనిచేశారు. బ్రిటిష్‌ జర్నల్‌ ‘ఫర్‌ ది హిస్టరీ ఆఫ్‌ సైన్స్‌ థీమ్స్‌’తో పాటు సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌కీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.


అహింస గొప్పతనం చాటి..

రుణ మంతెన.. హైదరాబాద్‌ మూలాలున్న ఎన్‌ఆర్‌ఐ, రాజకీయ సిద్ధాంత కర్త. ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయాలపై అధ్యయనం చేయాలనుకొనే స్కాలర్స్‌కి అండగా ఉండే ‘ఇంటర్నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ పొలిటికల్‌ థాట్‌’ సంస్థకి దశాబ్దకాలంగా కో- డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి బీఎస్సీ(ఎకనామిక్స్‌)లో బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఎసెక్స్‌ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఆపై హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి.. సామ్రాజ్యవాదం, దక్షిణాసియా మేధోచరిత్ర, వలస పాలనానంతరం ప్రజాస్వామ్యం అనే అంశాలపై పీహెచ్‌డీ చేశారు. యేల్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా కెరియర్‌ని ప్రారంభించారీమె. ఆపై కార్నెల్‌ యూనివర్సిటీలోని ప్రభుత్వ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఉద్యోగం చేస్తూనే ఉదారవాదం, పందొమ్మిదో శతాబ్దపు సామ్రాజ్యవాదం గురించి ‘ఆల్బిస్‌ ఆఫ్‌ ఎంపైర్‌’ పేరుతో తన మొదటి పుస్తకాన్ని విడుదల చేశారు కరుణ. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. అహింస, గాంధీ సిద్ధాంతాలపై ఎన్నో జర్నల్స్‌లో వ్యాసాలు రాశారు. ‘గాంధీ అండ్‌ ద పాలిటిక్స్‌ ఆఫ్‌ అహింస’పై పుస్తకం రాయడంతో పాటు.. గాంధీ సిద్ధాంతాలపై అండర్‌ గ్రాడ్యుయేట్‌ లెక్చర్‌ కోర్సులనీ అందిస్తున్నారు. ఇప్పటికే కరుణ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి గాడిస్‌ స్మిత్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ప్రైజ్‌నీ, ఉత్తమ పరిశోధకులకు అందించే సెనేటర్‌ చార్లెస్‌ సమ్మర్‌ ప్రైజ్‌తోపాటు ఇతర పురస్కారాలెన్నో అందుకున్నారు.

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్