దూసుకొచ్చింది!

రేసింగ్‌ పోటీల్లో దూసుకెళ్లాలంటే ఎన్నో ఏళ్ల శిక్షణ, కఠోర శ్రమ కావాలి. ఈ అమ్మాయి అవేమీ లేకుండానే పోటీలో పాల్గొంది. అంతేనా.. తొలి పోటీలోనే ట్రోఫీలు గెలిచింది.

Published : 22 Nov 2023 01:24 IST

రేసింగ్‌ పోటీల్లో దూసుకెళ్లాలంటే ఎన్నో ఏళ్ల శిక్షణ, కఠోర శ్రమ కావాలి. ఈ అమ్మాయి అవేమీ లేకుండానే పోటీలో పాల్గొంది. అంతేనా.. తొలి పోటీలోనే ట్రోఫీలు గెలిచింది. ఆ ఉత్సాహంతో రేసర్‌గా మారింది. అనుకోకుండా రేసింగ్‌లోకి దూసుకొచ్చిన ఆ అమ్మాయే నికితా టకాలే! ఈ యువ రేసర్‌ కథ ఇది.

‘అమ్మాయిని నాలుగు గోడల మధ్య భయపెడుతూ కాదు.. పులిలా పెంచాలి’ అంటారు నికిత వాళ్ల నాన్న నితిన్‌. అందుకే ఆటలు, కరాటే.. ఇలా ఏది చేస్తానన్నా అడ్డు చెప్పలేదు. వీళ్లది పుణె. ఆయనకి రేసింగ్‌ అంటే ప్రాణం. ఓసారి పోటీలను చూడటానికి వెళుతూ నికితని కూడా తీసుకెళ్లారు. అది నికితను బాగా ఆకట్టుకుంది. ఒక్కో రేసర్‌ బలాలు, ఎక్కడ పొరపాట్లు చేయడం వల్ల వెనకబడ్డారో ఆసక్తిగా చెబుతోంది. ఆయనా నవ్వుతూ విన్నారు. తర్వాత అకస్మాత్తుగా ‘నాకూ ప్రయత్నించాలని ఉంది’ అంది నికిత. మొదట ఆశ్చర్యపోయినా వాళ్ల నాన్న కూడా భుజం తట్టారు. అంతే.. పేరు నమోదు చేయించుకొని ఒకటి, రెండు కాదు.. వివిధ విభాగాల్లో 9 ట్రోఫీలు గెలిచింది. పోడియం మీదకి ఎక్కి వాటిని అందుకుంటోంటే ఆమెలో తెలియని ఆనందం.

ఆ ఉత్సాహంతో మరో పోటీలో పాల్గొంది. అక్కడా అంతే! దాంతో రేసింగ్‌పై మక్కువ పెంచేసుకుంది నికిత. అక్కడే పరిచయమైన కోచ్‌ చేతన్‌ శివరామ్‌ దగ్గర శిక్షణలో చేరింది. చదువుతూనే రేసింగ్‌ మీదా దృష్టిపెట్టింది. తను ఈ రంగంలోకి అడుగుపెట్టి రెండేళ్లే. అయినా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 60కిపైగా ట్రోఫీలు గెలుచుకుంది. మగవాళ్లతో పోటీపడి మరీ రికార్డులు బద్దలు కొడుతోంది. ‘ప్రొఫెషనల్‌ రేసింగ్‌లోకీ అడుగుపెట్టా. నాది ఆటోక్రాస్‌ రేసింగ్‌. దీనిలో కార్లన్నీ ఒకేసారి పోటీపడవు. ఒకదాని తర్వాత ఒకటి పాల్గొంటాయి. ఓసారి రేస్‌ కొండ మీద. మధ్యలో స్టీరింగ్‌ విరిగిపోయింది. అదుపు తప్పితే లోయలోకి జారే ప్రమాదం. భయపడకుండా వైర్ల సాయంతో బిగించి మరీ పోటీపడ్డా. మూడోస్థానంలో నిలిచా. వెనకడుగు వేయకుండా గమ్యం చేరుకున్నందుకు ఆనందమేసింది. ఇదే కాదు.. ప్రతి రేసూ నాకో పాఠమే’ అనే 23 ఏళ్ల నికిత బీబీఏ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ల్లో పట్టా పొందింది. 2022లో వేగవంతమైన డ్రైవర్‌, ఎమర్జింగ్‌ ఇండియన్‌ విమెన్‌ ఇన్‌ మోటార్‌స్పోర్ట్స్‌ పురస్కారాలు అందుకుంది. ఆసియా పసిఫిక్‌ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఏకైక భారతీయ మహిళా రేసర్‌. 62 పోడియం ట్రోఫీలు అందుకున్న తొలి మహిళగా రికార్డు సాధించింది. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టినా తనకు నచ్చిన ఫ్యాషన్‌ డిజైనింగ్‌, రేసింగ్‌లను సమన్వయం చేసుకుంటూ సాగుతోంది. ‘ఈ రెండేళ్లలో అనుకోని అవరోధాలూ ఎన్నో. నిరూపించుకోవాలి అని పట్టుదలగా సాగా కాబట్టే.. ఇక్కడిదాకా చేరా. మీరూ ప్రయత్నించండి. నచ్చిన రంగంలో దూసుకెళతార’ని సలహానిస్తోందీ యువ రేసర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్