అంజలి.. అమ్మ... కొకెడెమా

ఇంటిని ఎంత ఖరీదైన వస్తువులతో అయినా అలంకరించండి. కానీ పచ్చని మొక్కలతో వచ్చే అందం కోట్లు పెట్టినా రాదు. అందుకే కొకెడెమా మొక్కలతో ఇంటిని అలంకరించుకోవడం ఎలానో చెప్పి వేలకొద్దీ అభిమానులని సంపాదించుకుంటోంది అంజలి... 

Updated : 24 Nov 2023 02:28 IST

ఇంటిని ఎంత ఖరీదైన వస్తువులతో అయినా అలంకరించండి. కానీ పచ్చని మొక్కలతో వచ్చే అందం కోట్లు పెట్టినా రాదు. అందుకే కొకెడెమా మొక్కలతో ఇంటిని అలంకరించుకోవడం ఎలానో చెప్పి వేలకొద్దీ అభిమానులని సంపాదించుకుంటోంది అంజలి... 

కొకెడెమా అంటే జపాన్‌ భాషలో నాచుబంతి అని అర్థం. ఇంగ్లిష్‌లో మాస్‌బాల్‌ అంటారు. ఈ కొకెడెమా పద్ధతిలో మొక్కలు పెంచడమే అంజలి ప్రత్యేకత. ఈమె స్వస్థలం కేరళ. చిన్నతనం నుంచీ ప్రకృతిపై పెంచుకున్న ప్రేమే ఇప్పుడు తననిలా గార్డెనింగ్‌ నిపుణురాలిని చేసింది. చదువుకునే రోజుల్లో అంజలి తల్లితో కలిసి ఊరి పక్కనే ఉన్న కొండపైకి వెళ్లేది. అక్కడి వాతావరణం ఆమెని బాగా ఆకర్షించింది. ఖాళీ సమయాల్లో అమ్మతో కలిసి ఇంట్లో బోలెడు మొక్కలు పెంచేది. ‘అమ్మ వాళ్ల స్నేహితురాలింట్లో మొదటిసారి కొకెడెమా పద్ధతిలో పెంచిన మొక్కల్ని చూశా.

మనం కుండీల్లో పెంచినట్టుగా జపాన్‌, చైనా దేశాల్లో నాచుని బంతుల్లా తయారుచేసి వాటిల్లో మొక్కలు పెంచి పైనుంచి వేలాడదీస్తారు. చూడ్డానికి బోన్సాయ్‌ చెట్లలా కనిపిస్తాయి. కొత్తగా అనిపించి తయారీ ప్రారంభించా. అమ్మ సాయంతో టైర్లు, కొబ్బరి చిప్పలు, సీసాలు, డ్రమ్ములు ఒకటేమిటి వ్యర్థం అనుకున్న ప్రతిదానిలోనూ ఈ రకం మొక్కల్ని పెంచేదాన్ని. వంటింటి వ్యర్థాలనే ఎరువుగా వాడి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పెంచేదాన్ని. అవి చూసిన చాలామంది మాకూ ఈ కొకెడెమా మొక్కల తయారీ నేర్పించమన్నారు. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రిద్దీ ప్లాంట్స్‌’ పేరుతో వీడియోలు పోస్ట్‌ చేసేదాన్ని. 76 వేలమంది అనుసరిస్తున్నారు. ‘ఈచ్‌ వన్‌.. ప్లాంట్‌ వన్‌’ అనేది నా నినాదం. ప్రతిఒక్కరూ పచ్చదనం గురించి ఆలోచించేలా చేయాలన్నదే నా లక్ష్యం’ అంటోంది అంజలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్