చిత్రాల్లో భవిష్యత్తు చూపిస్తోంది!

ఒక విషయాన్ని మాటల్లో కంటే.. చిత్రం ద్వారా మరింత ప్రభావవంతంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు అని నమ్ముతారు ఆరతి కుమార్‌ రావ్‌. వాతావరణ మార్పులను ఫొటోల్లో చూపించి.. రాబోయే తరాల భవిష్యత్తుపై ఆలోచన రేకెత్తిస్తున్నారామె.

Published : 27 Nov 2023 01:28 IST

ఒక విషయాన్ని మాటల్లో కంటే.. చిత్రం ద్వారా మరింత ప్రభావవంతంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు అని నమ్ముతారు ఆరతి కుమార్‌ రావ్‌. వాతావరణ మార్పులను ఫొటోల్లో చూపించి.. రాబోయే తరాల భవిష్యత్తుపై ఆలోచన రేకెత్తిస్తున్నారామె. అందుకే బీబీసీ.. ప్రపంచవ్యాప్త 100 మంది స్ఫూర్తిదాయక మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె ప్రయాణమిది!

ది 2010.. లద్దాఖ్‌.. మేఘాలన్నీ పగబట్టాయా అన్నంతగా కుండపోత వర్షం. పొంగిన వరదల్లో చెట్టూ, చేమలే కాదు బలమైన కట్టడాలూ నేలకొరిగాయి. ఎంతమంది ఆ నీటిలో కొట్టుకుపోయారో లెక్కేలేదు. వేల కోట్ల నష్టం. ఇదంతా కేవలం కొద్ది గంటల్లోనే జరిగిపోయింది. ఆ తర్వాతా ప్రతి రెండు, మూడేళ్లకోసారి ఇది కొనసాగుతూనే ఉంది. దీనివల్ల నీటి ఎద్దడి, పంటలు సరిగా పండకపోవడం, వలసలు లాంటివెన్నో చోటుచేసుకున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితులకు పర్యావరణ మార్పులే కారణమంటారు ఆరతి. ఈవిడది బెంగళూరు. ఫిజిక్స్‌ మీద ప్రేమకొద్దీ బయో ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసినా.. ప్రయోగశాలల్లో జీవితమంతా గడపటం ఇష్టంలేక దారి మార్చుకున్నారు. ఓ జాతీయ మీడియాలో రిపోర్టర్‌గా చేరారు. తర్వాత పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లారు. ఎనిమిదేళ్లు పలు కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగం చేశారు. కానీ ఏదో వెలితి. అందుకే తిరిగి భారత్‌ వచ్చి ఫొటో జర్నలిస్ట్‌గా మారారు.

‘నేనో పర్యావరణ ఫొటోగ్రాఫర్‌ని. ప్రకృతిపై ప్రేమే నన్నిటు నడిపింది. వాతావరణంలో విపరీతమైన మార్పులు.. అవి జనజీవనంపై ప్రభావం చూపడం దగ్గరగా గమనించా. వాటిని మాటల్లో చెప్పి ఒప్పించలేం. అలాగని మనం కోరుకున్నప్పుడు ప్రకృతిలో మార్పుని బంధించలేం. ఒక్కోసారి నెలలు, ఏళ్లు కూడా వేచి చూడాలి. అందుకే మమ్మల్ని స్లో జర్నలిస్టులు అంటార’నే ఆరతి.. భూగర్భ జలాలు అంతరించిపోవడం, పరిశ్రమల కారణంగా కాలుష్యం, జీవవైవిధ్యం సహా క్లైమేట్‌ ఛేంజ్‌ అంశాలపై ఎన్నో ఫొటోలు, డాక్యుమెంటరీలు తీశారు. ప్రముఖ పత్రికలతో కలిసి పనిచేశారు. ప్రపంచ వేదికలపైనా ప్రసంగాలిచ్చారు. తన చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ మ్యాగజీన్లలో ప్రచురితమయ్యాయి. ఇందుకుగానూ ‘అవుట్‌స్టాండింగ్‌ ఫొటో జర్నలిస్ట్‌’ సహా పలు పురస్కారాలూ అందుకున్నారు.

ఆరతి రచయిత కూడా. లాండ్‌ స్కేప్‌ బొమ్మలతో కూడిన రచనలు ఈమె ప్రత్యేకత. భారతదేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని కళ్లకు కట్టేలా ‘మార్జిన్‌ల్యాండ్స్‌ ఇండియాస్‌ ల్యాండ్‌స్కేప్‌ ఆన్‌ ది బ్రింక్‌’ అనే పుస్తకం రాశారీమె. ఇది ‘టాటా లిట్‌ లివ్‌ 2023’ అవార్డుకు నాన్‌ ఫిక్షన్‌ కేటగిరీలో ‘బెస్ట్‌ ఫస్ట్‌ బుక్‌’ గా షార్ట్‌లిస్ట్‌ అయింది. కాప్‌21లో యునైటెడ్‌ నేషన్స్‌లో మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ మీడియా డెలిగేట్‌గానూ వ్యవహరించారు. తాజాగా బీబీసీ ‘100 విమెన్‌ 2023’ లో ‘క్లైమేట్‌ పయనీర్స్‌’ విభాగంలో ఎంపికయ్యారు. ‘తొలినాళ్లలో మగవాళ్లతో పోటీ ఎదుర్కొన్నా.. ఒక దిశంటూ తెలియని పరిస్థితి. స్థిర ఆదాయమూ ఉండదు. రాబోయే తరాల భవిష్యత్తు ముందు ఇవన్నీ చిన్నవి అనిపించేవి’ అనే ఆరతి దక్షిణాసియా అంతటా పర్యటించారు. టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. ప్రస్తుతం ఈమె దేశంలో బలవంతపు మానవ వలసలపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్