నలుపు.. అందం కాదా?

స్కూలుకెళితే అందంగా లేవనేవారు. మోడల్‌ అవుతానంటే ‘నల్లగా ఉన్నావ్‌.. నిన్నెవరు తీసుకుంటా’రని ఏడిపించేవారు. బయటివాళ్లు సరే.. ఇంట్లోవాళ్ల నుంచీ ఇవే దెప్పిపొడుపులు.

Published : 30 Nov 2023 01:49 IST

స్కూలుకెళితే అందంగా లేవనేవారు. మోడల్‌ అవుతానంటే ‘నల్లగా ఉన్నావ్‌.. నిన్నెవరు తీసుకుంటా’రని ఏడిపించేవారు. బయటివాళ్లు సరే.. ఇంట్లోవాళ్ల నుంచీ ఇవే దెప్పిపొడుపులు. ఒకానొక దశలో శాన్‌ రాచెల్‌ గాంధీ కుంగిపోయింది కూడా. అలాంటి తను అమ్మాయిలందరికీ స్ఫూర్తిగా ఎలా మారింది?

‘తెల్లగా అవుతావ్‌’ అని చెబితే చాలు.. వెంటనే ఆ క్రీమ్‌, సబ్బు తెచ్చి వాడేది రాచెల్‌. తన రంగంటే తనకు అసహ్యం. ఎవరూ మెచ్చని ఆ రంగు తనకే ఎందుకన్న బాధ. ‘నీ కజిన్లు బాగానే ఉన్నారు. నువ్వెందుకిలా ఉన్నావ్‌’ ఎక్కడికెళ్లినా ఇవే మాటలు, పోలికలు. వినీ వినీ విసిగిపోయింది. అందుకే టీవీ, పేపర్‌ యాడ్‌ల్లో ఫెయిర్‌నెస్‌ క్రీములేం కనిపించినా కొని రాసేది. ఫలితం మాత్రం శూన్యం. వీళ్లది చెన్నై. గ్రాడ్యుయేషన్‌లో చేరాక తన మనసులో ‘ఎవరి కోసం తెల్లబడాలి అనుకుంటున్నా’ అనే ప్రశ్న మెదిలింది. ‘నేను అందంగా ఉన్నానో లేదో తేల్చడానికి వాళ్లెవరూ అనిపించింది. నన్ను నేనే అంగీకరించలేకపోతే వేరే వాళ్లు మాత్రం ఎలా ప్రేమిస్తారు’ అనుకుంది. ఇకప్పటి నుంచి తెల్లబడాలన్న ప్రయత్నాన్ని పక్కన  పెట్టింది రాచెల్‌.

తనకు ఐశ్వర్యారాయ్‌ అంటే ఇష్టం. తనలా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందాల వేదికపై నిలవాలని కలలు కనేది. బెంగళూరులో చదువుతున్నప్పుడు ఓ బ్యూటీ కాంటెస్ట్‌ గురించి తెలిసి ప్రయత్నించింది. ‘వాళ్లు నన్ను చూసి మోడల్‌గా పనికిరానన్నారు. నేనేమీ బాధపడలేదు. ఎలాగైనా నిరూపించుకోవాలని పట్టుదల పెంచుకున్నా. నా ధైర్యానికి మెచ్చి ఒక నగల సంస్థ అవకాశమిచ్చింది. అలా టీవీ ప్రకటనలో మెరిశా.. అది మొదలు మరెన్నో సంస్థలు ముందుకొచ్చాయి. మిస్‌ పుదుచ్చేరితోపాటు ఎనిమిదేళ్లలో నాలుగు టైటిళ్లు, మూడు రన్నరప్‌లు.. ఏడు అవార్డులూ అందుకున్నా. దేశవిదేశాల్లో ఫ్యాషన్‌ షోల్లో మెరిశా’ననే 24 ఏళ్ల రాచెల్‌ ప్రస్తుతం మిస్‌ ఆఫ్రికా గోల్డెన్‌ పీజెంట్‌ పోటీల్లో తుదిదశకు చేరుకుంది. ఫైనల్స్‌లో విజయం సాధించి మన దేశ జెండా ఆ వేదికపై ఎగరేయాలని ఈమె కోరిక. తను ఆత్మవిశ్వాసం పెంచుకోవడమే కాదు.. ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపుతోంది రాచెల్‌. పుదుచ్చేరి క్వీన్స్‌ పేరుతో ఓ గ్రూపుని ఏర్పాటు చేసి, మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న యువతులకు మార్గనిర్దేశం చేస్తోంది. ‘అందంగా లేవన్న మాట చిన్నదే కానీ.. దాని ద్వారా చూపే వివక్ష చాలామంది జీవితాలపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే చర్మరంగు, కొలతల ఆధారంగా చూపే వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నా’ననే రాచెల్‌ కథ స్ఫూర్తిదాయకమేగా మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్