జుట్టుతో రికార్డు కొట్టింది!

ఆడవాళ్లకు జుట్టు మీద ఉండే ప్రేమెంతో వేరే చెప్పాలా? ఒక్క వెంట్రుక రాలినా మనసు గిలగిల్లాడి పోతుంది. ఇక కత్తిరించాలంటే ప్రాణమే పోతుందనుకునేవారూ లేకపోలేదు.

Published : 02 Dec 2023 01:28 IST

ఆడవాళ్లకు జుట్టు మీద ఉండే ప్రేమెంతో వేరే చెప్పాలా? ఒక్క వెంట్రుక రాలినా మనసు గిలగిల్లాడి పోతుంది. ఇక కత్తిరించాలంటే ప్రాణమే పోతుందనుకునేవారూ లేకపోలేదు. అలాంటి కోవలోకే వస్తారు స్మితా శ్రీవాస్తవ. అందుకే కురులను ప్రేమగా పెంచుకొని ఏకంగా గిన్నిస్‌ రికార్డునే కొట్టేశారు.

అమ్మను చూసే జుట్టు ఇష్టంగా పెంచుకోవడం మొదలు పెట్టానంటారు స్మిత. ఈవిడది ఉత్తర్‌ప్రదేశ్‌. తన 14వ ఏట నుంచి కురులను కత్తిరించడమన్న మాటే ఎరుగరు. ప్రస్తుతం ఆవిడకి 46 ఏళ్లు. ఇన్నేళ్లలో ఆ కురులు పెరిగీ పెరిగీ ఆవిడనే దాటి పోయాయి. ఏడు అడుగుల 9 అంగుళాల పొడవుకు పైగా చేరుకున్నాయి. ప్రపంచంలోనే అతి ఎక్కువ పొడవైన కురులుండటంతో ఇటీవలే గిన్నిస్‌ రికార్డునీ దక్కించుకున్నారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా ఇంత పొడవు ఎలా సాధ్యమైందంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. ‘ఇంత ఆరోగ్యకరమైన కురులకు అమ్మ వారసత్వమే కారణమని చెబుతా. అదీకాక జుట్టును కత్తిరించడం మా దగ్గర అపశకునంగా భావిస్తారు. ఇవన్నీ పక్కన పెడితే పాత తరం హీరోయిన్లు పొడవైన జడలతో అందంగా కనిపించేవారు. ఎంత పొడవుంటే ఆడవాళ్లు అంత అందంగా ఉంటారన్న భావన నాలో నాటుకుపోయింది. ఇంకేం ప్రేమగా పెంచుకోవడం మొదలుపెట్టా’నంటారు స్మిత.

చూడటానికి ఔరా అనిపించినా ఇలా కేశాలను పెంచడం ఆవిడకు తేలికేమీ కాలేదట. వాటి సంరక్షణ కోసమని వారంలో రెండుసార్లు తలస్నానం చేస్తారట. ఆరబెట్టడమైతే మరో ప్రహసనమే. మంచంమీద ఎక్కి, ఫ్యాన్‌ కింద నిలబడాలి. ఆరబెట్టడం, వేళ్లతో చిక్కులు తీసి, జడవేయడానికే మూడు గంటలు పడుతుంది. ‘మొదట్లో జుట్టు బాగా రాలిపోయేది. పారేయాలంటే చాలా బాధేసేది. ఏడ్చేదాన్ని కూడా. అప్పట్నుంచి వాటిని దాయడం మొదలుపెట్టా’ననే స్మిత వాటిని రెండు దశాబ్దాలుగా జాగ్రత్త చేస్తున్నారు. ఈ పొడువాటి జుట్టుతో ఎప్పుడు బయటకు వెళ్లినా అంతా సెల్ఫీలడిగేవారు, సెలబ్రిటీలా చూసేవాళ్లు. అది ఆనందంగా అనిపించి, తన కురుల విశేషాలతో వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేవారు. ఆమెను ఇన్‌స్టాలో లక్షన్నర మంది అనుసరిస్తున్నారు. ఈ వీడియోలను చూసే గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు వాళ్లు ఆమెను సంప్రదించారు. ‘కురులను చాలా ప్రేమగా పెంచుకున్నా. కానీ ఆ ప్రేమ ఇలా గుర్తింపు, రికార్డుని తెచ్చిపెడుతుందని మాత్రం ఊహించలేదు’ అంటోన్న ఈమె వీడియోను చూసిన ఎంతోమంది ఆమెను ‘ఇండియన్‌ రాపుంజల్‌’ అంటున్నారు. కొందరైతే ఆ రహస్యం మాకూ చెప్పొచ్చుగా అని సలహాలూ కోరుతున్నారు. మరి మీరేమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్