చిన్న వయసులో సాధించేశారు!

ఆంత్రప్రెన్యూర్‌షిప్‌.. అంటే వ్యాపారం మొదలు పెట్టడం మాత్రమే కాదు! ఆలోచనతో మెప్పించాలి. దాన్ని విజయ తీరాలకు నడిపించాలి. దీనిలో ప్రధాన పాత్ర నాయకత్వానిదే. అలా తమ ఆలోచనను ముందుకు తీసుకెళ్లి విజయవంతమైన నాయకురాళ్లు వీళ్లు.

Updated : 03 Dec 2023 04:18 IST

ఆంత్రప్రెన్యూర్‌షిప్‌.. అంటే వ్యాపారం మొదలు పెట్టడం మాత్రమే కాదు! ఆలోచనతో మెప్పించాలి. దాన్ని విజయ తీరాలకు నడిపించాలి. దీనిలో ప్రధాన పాత్ర నాయకత్వానిదే. అలా తమ ఆలోచనను ముందుకు తీసుకెళ్లి విజయవంతమైన నాయకురాళ్లు వీళ్లు. హురున్‌ ఇండియా స్వశక్తితో ఎదిగిన మహిళల జాబితాకెక్కిన అతిపిన్న వ్యాపార సామ్రాజ్ఞులు..

బిడ్డ కోసం ఆలోచిస్తే..

రోజుకు రూ.1200 ఒకప్పుడు గజల్‌ అలఘ్‌ జీతం. అప్పుడు అమ్మను ఆనందంగా షాపింగ్‌కు తీసుకెళ్లడం.. భర్తతో సంతోషంగా జీవించడంపైనే దృష్టంతా. తనది హరియాణ. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి బీసీఏ, న్యూయార్క్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్‌ నుంచి మోడరన్‌ ఆర్ట్‌లో కోర్సునీ పూర్తిచేశారు. కార్పొరేట్‌ ట్రైనర్‌గా కెరియర్‌ ప్రారంభించారు. అప్పటిదాకా వ్యాపార ఆలోచనే లేదు. అమ్మయ్యాక మాత్రం తన ప్రపంచమంతా బాబే! వాడికేమో బేబీ ఉత్పత్తుల్లో రసాయనాల కారణంగా అలర్జీ మొదలైంది. ఎంత ప్రయత్నించినా సహజ ఉత్పత్తులే దొరకలేదు. దీంతో సొంతంగా పరిశోధించి రసాయనాల్లేని ఉత్పత్తుల తయారీ ప్రారంభించారు. తన పిల్లలు సరే.. ఇతరుల పరిస్థితేంటని ఆలోచించాక 2016లో భర్తతో కలిసి ‘మమా ఎర్త్‌’ ప్రారంభించారు. తర్వాత స్కిన్‌కేర్‌, బ్యూటీ ఉత్పత్తులనూ అందుబాటులోకి తెచ్చారు. ఆసియాలోనే తొలి ‘సేఫ్లీ మాన్యుఫాక్చర్డ్‌ సర్టిఫైడ్‌ బ్రాండ్‌’గా నిలిపారు. ఆన్‌లైన్‌ సేవలతోపాటు దేశవ్యాప్తంగా స్టోర్లనీ తెరిచారు. ‘మా ప్రతి ఉత్పత్తినీ స్వయంగా ప్రయత్నిస్తా. నా పిల్లలకు ఉపయోగించను అన్న దేన్నీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టన’నే 35ఏళ్ల గజల్‌ ఫార్చ్యూన్‌, ఫోర్బ్స్‌ ‘శక్తిమంతమైన మహిళ’ జాబితాల్లో నిలిచారు. షార్క్‌ట్యాంక్‌ ద్వారా పలు సంస్థల్లో పెట్టుబడులూ పెట్టారు. తాజాగా ఐపీఓకీ వెళ్లిన తన సంస్థ విలువ రూ.9800 కోట్లు.


ఆటకు బాధ్యతను జోడించి..

ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం.. మంచి సంపాదన ఉంటే స్థిరపడిపోయాం అనిపిస్తుంది. సౌమ్య సింగ్‌ రాథోడ్‌ మాత్రం ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించాలంటారు. దిల్లీకి చెందిన ఈమె సైకాలజిస్ట్‌. యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ నుంచి పీజీ పూర్తిచేశారు. మూడేళ్ల కార్పొరేట్‌ జీవితాన్ని కాదని.. జోరూమ్స్‌, జోస్టెల్‌ సంస్థల్లో భాగస్వామురాలయ్యారు. అప్పుడే ఆమెను గేమింగ్‌ రంగం ఆకర్షించింది. దీంతో 2018లో స్నేహితుడితో కలిసి ‘విన్‌జో’ ప్రారంభించారు. నిజానికి దానికంటే ముందు.. దేశంలో ఎన్నో యాప్‌లున్నా కొద్దికాలానికే ఎందుకు వెనుదిరుగుతున్నాయని సౌమ్య పెద్ద పరిశోధనే చేశారు. భాషే పెద్ద అడ్డంకి అని తెలిశాక స్థానిక భాషల్లో ఆటలను అందుబాటులోకి తెచ్చారు. అదేమో విజయం సాధించి.. పెట్టుబడులను ఆకర్షించింది. మూడేళ్లలోనే ధోనీతో ప్రకటనలు చేయించే స్థాయికి ఎదిగారు. ‘లాభాలే ప్రధానమని ఆలోచించలేదు. అందుకే గేమ్‌ ప్లాట్‌ఫామ్‌లో రకరకాల చెక్‌ పాయింట్స్‌ను ఏర్పాటు చేశాం. 2గంటల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే హెచ్చరిస్తాం. ఉచిత ట్యూటోరియల్స్‌నీ అందించాం. అందుకే పది కోట్ల మందికి చేరువయ్యా’మనే 35 ఏళ్ల సౌమ్య లక్షలమంది ఇన్‌ఫ్లుయెన్సర్లకీ ఉపాధినిస్తున్నారు. హురున్‌, ఫోర్బ్స్‌ జాబితాల్లోనూ స్థానం సంపాదించారు. తన సంస్థ విలువ రూ.3వేల కోట్లకు పైమాటే!


ఆహారం.. ఆంత్రప్రెన్యూర్‌ని చేసింది

‘ఓటమిని అంగీకరించడానికి వెనకాడొద్దు.. అప్పుడే గెలుపు వరిస్తుందంటారు 36 ఏళ్ల రాజోషి ఘోష్‌. ఆ తీరే ఆమెను యూనికార్న్‌ సంస్థ ‘హసుర’కి అధినేత్రిని చేసింది. తనది బెంగళూరు. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ నుంచి కంప్యూటేషనల్‌ జీనోమిక్స్‌లో డిగ్రీ పూర్తయ్యాక రాజోషి బయోఇన్ఫర్మాటిక్స్‌ రిసెర్చర్‌గా చేరారు. కానీ అది తనకు ఆసక్తిగా అనిపించలేదు. దీంతో ఆదరణ పెరుగుతున్న టెక్నాలజీ, బిజినెస్‌ స్కిల్స్‌ కోర్సులు చేసి, చెన్నై వచ్చారు. కొన్ని సంస్థలకు టెక్నికల్‌ సేవలందించారు. తను భోజన ప్రియురాలు. కానీ స్థానిక రుచులను ప్రయత్నించే వీలే చిక్కలేదు. ఆన్‌లైన్‌ సేవల కోసం వెదికినా దొరకలేదు. దీంతో తనే సొంతంగా ‘ఫైండ్‌ ఎ కడాయి’ ప్రారంభించారు. యాప్‌లో లోపాలను సరిదిద్దడానికి స్నేహితుడు తన్మయ్‌ సాయం కోరారు. అది విజయవంతం అవడంతో ఇద్దరూ కలిసి 34 క్రాస్‌ ప్రారంభించారు. దాని ద్వారా కొంత మొత్తం తీసుకొని ఎన్నో సంస్థలకు యాప్‌ల పరంగా సాయమందించారు. దీన్నే వ్యాపారంగా మలిస్తే అన్న ఆలోచన వచ్చింది రాజోషికి. అలా 2017లో ‘హసుర’ ప్రారంభమైంది. స్టార్టప్‌లకు కన్సల్టేషన్‌, అప్లికేషన్‌ తయారీ వంటివన్నీ చేసిస్తుందీ సంస్థ. కొత్త ఆలోచనతో పెట్టుబడులు ఆకర్షించడమే కాదు.. గత ఏడాది ‘హసుర’ యూనికార్న్‌ హోదానీ  దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్