కలలకు రంగుల రెక్కలు ఇస్తున్నా!

ఊహలకు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తే...? మనసులో మెదిలే ఆలోచనలు రంగులద్దుకొని కాన్వాస్‌పై ఆవిష్కృతమైతే... ఎలా ఉండొచ్చు? వీటికి సమాధానం ప్రియాంక ఏలె చిత్రాలు చెబుతాయి.

Updated : 07 Dec 2023 05:35 IST

ఊహలకు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తే...? మనసులో మెదిలే ఆలోచనలు రంగులద్దుకొని కాన్వాస్‌పై ఆవిష్కృతమైతే... ఎలా ఉండొచ్చు? వీటికి సమాధానం ప్రియాంక ఏలె చిత్రాలు చెబుతాయి. అదెలాగో మనమూ తెలుసుకుందాం!

‘మట్టి మనుషుల సజీవ చిత్రాలనూ, పల్లె సంస్కృతినీ, ప్రకృతి అందాలనూ చూపించేందుకు ఎలాంటి బంధనాలు, నిబంధనలు ఉండకూడ’దని నాన్న చెప్పే మాటలే నాకు ఆదర్శం. మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని కదిరేనిగూడెం. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అయినా నేనీ ఊరు ఆడబిడ్డగానే పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతా. నాన్న ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర రూపశిల్పి, అనేక ప్రభుత్వ సంస్థల లోగోల సృష్టికర్త. ఊహ  తెలిసినప్పటి నుంచీ రంగులూ, బ్రష్‌లూ, కాన్వాసుల మధ్యే పెరిగా. వాటితోనే ఆటలూ, ఆలోచనలూ సాగాయి. అందుకేనేమో త్వరగానే చిత్ర కళను ఒంటపట్టించుకోగలిగా. నాన్న సూచనలూ, సలహాలు స్వీకరిస్తూ.. చిత్రకారిణిగా ఎదగగలిగా. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూ నుంచి డిగ్రీ, సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి పీజీ చదివా. పెయింటింగ్‌తో పాటు థియేటర్‌ ఆర్ట్స్‌లోనూ పీహెచ్‌డీ చేశా. ఈ క్రమంలోనే సురభి, యక్షగానం కళాకారులు తగ్గిపోవడం గమనించా. మరింత లోతుగా తెలుసుకుంటే ఇప్పుడున్నవారే చివరి తరమనీ అర్థమైంది. అందుకే వారి సంస్కృతిని రికార్డు చేసి పదిల పరిచా. ఎందుకంటే భావితరాలకు మన జీవనవిధానం అర్థం కావాలి కదా! 

బోర్డెక్స్‌లో బొమ్మలు గీశా...

మనసులోని భావాలకు కుంచెతో దృశ్యరూపం ఇవ్వడం అంత సులభమేమీ కాదు. వాస్తవికత, భావుకతల మధ్య ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది. దీన్ని దృశ్యరూపంగా మలచడం ఎంతో  క్లిష్టమైన పని. దాన్నే నేను అందిపుచ్చుకోవాలనుకున్నా. ఇష్టంతో, ఆసక్తితో చేస్తున్నా కాబట్టి ఎప్పుడూ కష్టంగానూ అనిపించలేదు. ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ దేశవిదేశాల్లో చిత్రప్రదర్శనలెన్నో చేశా. ప్రముఖ చిత్రకారుల మెప్పునీ పొందా. నా చిత్ర ప్రయాణంలో బోర్డెక్స్‌లో బొమ్మలు గీయడం ఓ మధురానుభూతి. హైదరాబాద్‌కి చెందిన కృష్ణకృతి ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఫ్రాన్స్‌ దేశంలోని బోర్డెక్స్‌ నగరంలో ఉన్న మెట్రోపోల్‌తో కలిసి ఏటా ‘ఎక్స్ఛేంజ్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మనదేశం నుంచి పంపే ముగ్గురు చిత్రకారుల్లో ఒకరిగా నేను ఎంపికయ్యా. అక్కడే ఆరువారాల పాటు ఉండి బొమ్మల్ని గీశా. యూరోపియన్‌, భారత సంస్కృతులకు దగ్గరగా ఉన్న అంశాలతో చిత్రించిన బొమ్మలు అక్కడివారిని ఆకట్టుకున్నాయి. ఏ పనిచేసినా నాకంటూ ఓ గుర్తింపు ఉండాలి కదా! అందుకే చిత్రకారులంతా చతురస్రాకారంలో ఉండే కాన్వాస్‌లపై బొమ్మలేస్తే నేను మాత్రం గుండ్రటి దాన్నే ఎంచుకుంటా. ఆలిండియా పెయింటింగ్‌ పోటీల్లో బంగారు పతకాన్ని అందుకున్నా. స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ నుంచి అవార్డు అందుకున్నా. ‘లవ్‌బైట్స్‌’, ‘ఫ్లవర్‌ పవర్‌’, ‘జెనిసిస్‌ ఆఫ్‌ మెమొరబిలియా, ‘దక్కనీస్ట్రోక్స్‌’, ‘పవర్‌ ఆఫ్‌ది విమెన్‌’, ‘ఇనాగ్రల్‌షో’, ‘కలెక్టర్స్‌ ఛాయిస్‌’, ఆర్ట్‌ఎట్‌ తెలంగాణ’, మెట్రోపాలిస్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌, ‘పూలమ్మ’ వంటివెన్నో నా చిత్ర ప్రదర్శనలు గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. భవిష్యత్తులో

 ఎస్‌.ఎన్‌.చారి. మోత్కూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్