వాటిని చూసి.. కళ్లలో నీళ్లు తిరిగాయి!

సైన్స్‌ పాఠాల్లో భాగంగా బొద్దింకనీ, కప్పనీ కొయ్యడానికే చేతులు వణుకుతాయి. అలాంటిది ఓ మృతదేహాన్ని కోసి పరీక్షించాలంటే? మనసులోని అన్ని భయాలనీ పక్కన పెట్టింది.. కుటుంబాన్ని నడిపించడం కోసం శవాగారంలోనే పనికి కుదిరింది. వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది వరాలు.

Updated : 08 Dec 2023 02:46 IST

సైన్స్‌ పాఠాల్లో భాగంగా బొద్దింకనీ, కప్పనీ కొయ్యడానికే చేతులు వణుకుతాయి. అలాంటిది ఓ మృతదేహాన్ని కోసి పరీక్షించాలంటే? మనసులోని అన్ని భయాలనీ పక్కన పెట్టింది.. కుటుంబాన్ని నడిపించడం కోసం శవాగారంలోనే పనికి కుదిరింది. వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది వరాలు. ఆ అనుభవాలని వసుంధరతో పంచుకుంది..

మాది వైయస్‌ఆర్‌ జిల్లాలోని చిన్నవరదాయపల్లె గ్రామం. అమ్మానాన్నలు గంగాదేవి, గంగన్నలకు ఇద్దరం ఆడపిల్లలమే. రైతు కుటుంబం.. అమ్మకి పోలియో కావడంతో పెద్ద పనులేమీ చేయలేదు. నాన్న కష్టంతోనే కుటుంబం గడిచేది. కొన్నేళ్ల కిందట అక్క అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వాళ్ల ఆశలన్నీ నామీదే. అందుకే కష్టమైనా చదివించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంకాం పూర్తి చేశా. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ మంచి సంస్థలో ఉద్యోగం సాధించా. నెలకు రూ.15 వేలు జీతం. కానీ ఒత్తిడి తట్టుకోలేక మానేశా. తర్వాతా కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించినా ఏదో ఒక సమస్య. జీతం సరిగా ఇచ్చేవారు కాదు. ఇంతలో మా గ్రామానికే చెందిన బాలయ్యతో పెళ్లైంది. ఆయన చిట్‌ఫండ్‌ సంస్థలో ఉద్యోగి. ఒక్కరి ఆదాయం సరిపోదు. పోనీ మెరుగైన అవకాశాలుంటాయని వేరే ప్రాంతానికి వెళతామంటే ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు శవపరీక్ష సహాయకుల కోసం ఉద్యోగ ప్రకటన వచ్చింది. పది చదివితే చాలు. ఆడపిల్లను కదా... కార్యాలయ విధులే కేటాయిస్తారు అనుకొని దరఖాస్తు చేశాను. నేను, ఇంకొకావిడ ఎంపికయ్యాం. సంతోషంగా వెళితే.. అధికారులు శవపరీక్ష చేయడం తప్పనిసరి అన్నారు.

కాళ్లు వణుకుతున్నా...

శవాగారంలోకి వెళ్లడానికే కాళ్లు వణికాయి. అలాంటిది శవపరీక్షలో భాగంగా మనిషి పుర్రెను పగలగొట్టడం, లోపలి భాగాలను కోసి తీయడం నావల్ల కాదనిపించింది. చేరిన తొలిరోజే మూడు మృతదేహాలొచ్చాయి. వాటిని చూశాక కంట్లోంచి నీళ్లాగలేదు. కానీ నేను, నా కుటుంబం బతకాలంటే ఉద్యోగం కావాలి. ఇక్కడైతే క్రమం తప్పకుండా జీతం అందుకోవచ్చని నాకు నేనే సర్దిచెప్పుకొన్నా. ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌ అనుదీప్‌ ఆరు నెలలు శిక్షణిచ్చారు. నేనైతే గుండె దిటవు చేసుకున్నా కానీ నాతోపాటు ఎంపికైనావిడ వెళ్లిపోయారు. ఒక్కదాన్నే.. ఓవారం పాటు వరసగా పిల్లలు అదీ.. ఈతకెళ్లి మునిగిపోయిన, అయిన వారి చేతిలో చనిపోయిన వారికి శవపరీక్షలు నిర్వహించా. కొందరివి కుళ్లి, దుర్వాసన వచ్చేవి. పురుగులు బయటికొస్తోంటే కడుపులో పేగులన్నీ దేవేసినట్లుగా అనిపించేది. బంధువులేమో ‘మగవాళ్లైతే మద్యం సేవించి చేస్తారు. ఆడపిల్లవి నీకవసరమా ఇవన్నీ’ అనేవారు. ఇరుగూపొరుగూ నా పనిని ఛీత్కరించేవారు. జీవించిన మనిషికి వైద్యుడు చికిత్స చేస్తాడు. మరణించిన వారికి నేను చేస్తున్నా అని అనుకునేదాన్ని. నా భర్త అండ నాకు మరింత ధైర్యం ఇచ్చింది. మరో ప్రొఫెసర్‌ గంగాధర్‌ కూడా అండగా నిలిచారు.

తెలియక హితబోధ..

ఏడాదిన్నరగా ఈ పని చేస్తున్నా. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకోవడం చూస్తే బాధనిపిస్తుంది. ఆస్తుల కోసం కొట్లాడుకోవడం, చంపుకోవడం చూసినప్పుడు బతికున్నంత వరకే విలువ. ఎంత సంపాదించినా చనిపోయాక మోయడానికే కాదు చూడటానికీ ఆలోచిస్తారని చెప్పాలనిపిస్తుంది. నెలకు కనీసం 20 మృతదేహాలు వస్తుంటాయి. ప్రస్తుతం నేను గర్భిణిని. శవాగారం ముందు బెంచిపై కూర్చుంటే ‘కడుపుతో ఉన్నవారు ఇక్కడుండొద్ద’ని చాలామంది సలహా ఇస్తుంటారు. తీరా శవపరీక్ష చేసేదే నేనని తెలిసి ఆశ్చర్యపోతుంటారు. వృత్తిధర్మం కాబట్టి ఈ పరిస్థితిలోనూ మామూలుగానే చేసుకుంటూ వెళుతున్నా. నేను బ్యాంకు ఉద్యోగి కావాలన్నది నాన్న కల. శిక్షణ తీసుకునే స్థోమత లేక కాలేకపోయా. పుట్టబోయే బిడ్డను డాక్టర్‌ చేయాలనుంది. రోగులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంటే చూడాలన్నది నా ఆశ.

నిప్పాణి శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్