30ల్లోపే.. మెరిశారు!

ఆన్‌లైన్‌లో.. బర్రెలమ్మకం, యాప్‌ని నమ్మి సాగు.. వాట్సప్‌లో అమ్మకాలు..వినడానికి కాస్త కొత్తగా ఉన్నా ఈ ఆలోచనలతోనే కోట్ల వ్యాపారం చేస్తున్నారీ అమ్మాయిలు. 30 ఏళ్లలోపు యువ వ్యాపారవేత్తలుగా హురున్‌ ఇండియా విడుదల చేసిన జాబితాలోకి చేరి శభాష్‌ అనిపించుకుంటున్నారు.

Updated : 15 Dec 2023 07:05 IST

ఆన్‌లైన్‌లో.. బర్రెలమ్మకం, యాప్‌ని నమ్మి సాగు.. వాట్సప్‌లో అమ్మకాలు..వినడానికి కాస్త కొత్తగా ఉన్నా ఈ ఆలోచనలతోనే కోట్ల వ్యాపారం చేస్తున్నారీ అమ్మాయిలు. 30 ఏళ్లలోపు యువ వ్యాపారవేత్తలుగా హురున్‌ ఇండియా విడుదల చేసిన జాబితాలోకి చేరి శభాష్‌ అనిపించుకుంటున్నారు...

వర్చువల్‌ సంతతో...  

నీతూయాదవ్‌
యానిమాల్‌

‘ఆన్‌లైన్‌లో పశువుల సంత’ ఏర్పాటు చేస్తా అని నీతూ అన్నప్పుడు... ‘నీకేమైనా పిచ్చా.. ఇంత చదువూ చదివి బర్రెలమ్ముతావా’ అన్నారంతా. ఆమె మాత్రం తన స్నేహితురాలు కీర్తిజంగ్రాతో కలిసి ‘యానిమాల్‌’ యాప్‌తో తమ స్టార్టప్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2019లో మొదలైన ఈ వర్చువల్‌ సంతలో ఇప్పటివరకూ రూ.2500 కోట్లకు పైగా విలువైన పశువుల అమ్మకాలు జరిగాయి. నీతూది జైపుర్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవల్‌పుర్‌. కీర్తిది హరియాణాలోని హిసార్‌. ఇద్దరూ ఐఐటీ దిల్లీలో చదువుకున్నారు. మేలు జాతి పశువుల్ని కొనాలనుకున్న రైతులే కాదు, అమ్మాలనుకున్నవారూ వీళ్లు రూపొందించిన ‘యానిమాల్‌’ యాప్‌ వేదికగా లావాదేవీలు సాగించొచ్చు. రాజస్థాన్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌లలో యానిమాల్‌ వ్యాపారం విస్తరించింది. ఇప్పటికి 80 లక్షల మందికిపైగా రైతులు ‘యానిమాల్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌లో రైతులకు పాల దిగుబడి పెంచుకొనేందుకు సలహాలూ, వాటిని కొనేందుకు కావాల్సిన లోన్లు వంటి వివరాలు కూడా ఉంటాయి. ఈ యాప్‌ ఉత్తర భారతదేశంలో ఓ విప్లవాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి.


అన్నదాతకు అండగా...

సాయి గోలే
భారత్‌ అగ్రి

ప్రపంచం సాంకేతికత, కృత్రిమ మేధ చుట్టూ పరుగెడుతోంది. సరికొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ అన్నదాతకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అన్న ఆలోచనే నాగ్‌పుర్‌కి చెందిన సాయి గోలేని ‘భారత్‌ అగ్రి’ స్టార్టప్‌ దిశగా నడిపించాయి. మద్రాస్‌ ఐఐటీలోని తన సహ విద్యార్థి సిద్దార్థ్‌ దైలనీతో కలిసి వ్యవసాయం, సాంకేతిక ఆవిష్కరణలకు మధ్యనున్న దూరాన్ని తగ్గించాలనుకున్నారామె. 2017లో ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు. అయిదు భాషల్లో అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ అన్నదాతలకు భూమి, నీరు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారం, సలహాలను ఇస్తుంది. ప్రతి రైతుకీ వారివారి భౌగోళిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కస్టమైజేషన్‌ విధానంలో క్రాప్‌ క్యాలెండర్‌నీ ఏర్పాటు చేశారు. పదిలక్షల మంది రైతులకు చేరువైన ఈ యాప్‌ సాయంతో... సాయిల్‌, వాటర్‌ టెస్టింగ్‌ వంటివాటిపై అవగాహన తెచ్చి రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది సాయిగోలే.


వాట్సప్‌లో వ్యాపారం...

సోనాక్షి నథాని
బికాయి

నూతన సాంకేతిక ఆవిష్కరణలతో వ్యాపార సంస్థలను బలోపేతం చేయాలనీ, వినూత్న మార్గాల్లో వినియోగదారులకు చేరువ కావాలన్న లక్ష్యంతో బికాయి యాప్‌ని తన స్నేహితుడు అశుతోష్‌ సింగ్లాతో కలిసి ప్రారంభించింది సోనాక్షి. ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈమె... బికాయి సాయంతో  వ్యాపారుల వాట్సప్‌లో ఈ-స్టోర్‌ని ఏర్పాటు చేసి, ఉత్పత్తుల ప్రదర్శనకు కావాల్సిన తోడ్పాటును అందిస్తోంది. ఐదులక్షలకు పైగా డౌన్‌లోడ్‌లతో.. లక్షకు పైగా ఈ-స్టోర్ల నిర్వహణతో దూసుకుపోతోందీ సంస్థ.


ఏఐతో మార్కెటింగ్‌..

వృశాలీ ప్రసాదే
పిక్సిస్‌

కృత్రిమమేధ సాయంతో వ్యాపార సంస్థలకు వినూత్నమైన మార్కెటింగ్‌ నైపుణ్యాలని అందించే సంస్థ పిక్సిస్‌. దీన్ని వృశాలీ ప్రసాదే ప్రారంభించింది. కాలేజీలో చదువుతున్నప్పుడే వృశాలి టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుంది. ఈసీజీ/ఈకేజీ పరికరాల అభివృద్ధి విషయంలోనూ వృశాలికి ఐదు పేటెంట్లు ఉన్నాయి. ఈమె అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి కూడా.


ఆటలతో అభివృద్ధి...

దేవాన్షి కేజ్రీవాల్‌
స్కిల్‌ మాటిక్స్‌

ముంబయికి చెందిన దేవాన్షి కేజ్రీవాల్‌ స్కిల్‌ మాటిక్స్‌ కంపెనీకి కో ఫౌండర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థను 2017లో ధ్వనిల్‌ షేత్‌తో కలిసి ప్రారంభించిందీమె. పిల్లలకు అవసరమైన ఎడ్యుకేషనల్‌ ఉత్పత్తులు, క్రీడా వస్తువుల్నీ రూపొందిస్తుందీ సంస్థ. వీటితో 3-9 ఏళ్ల వయసుగల చిన్నారులు తమ శారీరక, మానసిక ఎదుగుదలకి అవసరమైన కీలక నైపుణ్యాలను ఒంటపట్టించుకుంటారు. ఈ ఉత్పత్తులు 15 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. దేవాన్షి న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన లియోనార్డ్‌ ఎన్‌.స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ తీసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్