యువసేన.. ఘన సేవ!

నేటి యువతకు కాలక్షేపానికి కొదువేం ఉంది! ఇన్‌స్టా రీల్స్‌లోకి వెళ్తే.. గంటలను నిమిషాల్లా గడిపేయొచ్చు. స్నాప్‌ చాట్‌లోకి తొంగిచూస్తే పొద్దుగూకే వరకూ తలెత్తే పరిస్థితే లేదు. లైక్‌, షేరింగ్‌ అంటూ ఊపిరి సలపనంత బిజీ. కానీ సామాజిక మాధ్యమాల్లో కృతకంగా బతకడం కన్నా.. సామాజిక సేవలో తృప్తిగా జీవించాలని నిశ్చయించుకున్నారు వీళ్లు.

Updated : 18 Dec 2023 07:13 IST

నేటి యువతకు కాలక్షేపానికి కొదువేం ఉంది! ఇన్‌స్టా రీల్స్‌లోకి వెళ్తే.. గంటలను నిమిషాల్లా గడిపేయొచ్చు. స్నాప్‌ చాట్‌లోకి తొంగిచూస్తే పొద్దుగూకే వరకూ తలెత్తే పరిస్థితే లేదు. లైక్‌, షేరింగ్‌ అంటూ ఊపిరి సలపనంత బిజీ. కానీ సామాజిక మాధ్యమాల్లో కృతకంగా బతకడం కన్నా.. సామాజిక సేవలో తృప్తిగా జీవించాలని నిశ్చయించుకున్నారు వీళ్లు. చిన్నప్పుడు అమ్మచెప్పిన నీతి కథలు బుర్రకు కాకుండా మనసుకు ఎక్కించుకున్న వాళ్లు ఒకరైతే, పదిమందికీ పంచడంలోనే ఆనందం ఉందన్న స్కూలు పాఠాన్ని ఇంకా గుర్తుంచుకున్నవాళ్లు మరొకరు. వయసుకు మించిన మనసుతో.. శక్తికి మించిన ప్రయత్నం చేస్తున్న ఈ యంగిస్థాన్‌ 2023 ఛేంజ్‌ మేకర్స్‌ వీళ్లంతా..!

అందరికీ విద్య అందాలని..

ఉపాసన రవికన్నన్‌ .. ఊహ తెలిసినప్పటి నుంచీ వీల్‌చైర్‌లోనే! సెరిబ్రల్‌ పాలసీ కారణంగా పుట్టుకతోనే నడిచే అవకాశం కోల్పోయింది. అందరూ నవ్వుతూ తుళ్లుతూ ఆడుతోంటే నాకా అవకాశం లేదే అనిపించడం ఖాయం. కానీ తను మాత్రం ఇతరుల గురించే ఆలోచించింది. ఈమెది చెన్నై. ‘స్పెషల్‌ స్కూల్లో చేర్చడం వల్లేమో పెద్దగా బాధపడిన సందర్భాల్లేవు. కానీ నలుగురిలో మాట్లాడాలంటే మాత్రం భయమే. ఓసారి పోటీలో గెలిచినప్పుడు కలిగిన ఆత్మవిశ్వాసం నేనూ చేయగలనన్న ధీమానిచ్చింది. అంతే భయమనిపించిన ప్రతిదీ చేసుకుంటూ వెళ్లా. ఓరోజు వీధిలో ఒంటిమీద సరిగా దుస్తులు లేనివాళ్లని చూశా. నాకు అమ్మానాన్న తోడున్నారు. కాబట్టి చదువుకోగలుగుతున్నా. ఆ అవకాశం లేనివాళ్ల పరిస్థితేంటి అనిపించింది. ఇదే చెప్పి అమ్మానాన్న, బంధువులు, తెలిసినవాళ్ల దగ్గర్నుంచి డబ్బులు సేకరించా. పేదపిల్లల చదువును ప్రోత్సహిస్తోన్న సంస్థలకు అందించా’ననే ఉపాసన 16 ఏళ్ల వయసులోనే ‘గో పడాయి’ ప్రారంభించింది. బృందాన్ని ఏర్పాటు చేసుకొని పల్లెల్లో పర్యటనలు చేస్తూ వారికి చదువుపై అవగాహన కలిగించడం.. ఇబ్బందులు తెలుసుకొని సాయం చేయడం మొదలుపెట్టింది. వేలమందిని విద్య దిశగా ప్రోత్సహించింది. తన సేవలకు గుర్తింపుగా అశోకా యంగ్‌ ఛేంజ్‌ మేకర్స్‌ సహా పలు పురస్కారాలూ అందుకొంది.


తమ్ముడిని చూసి..

దివా ఉత్కర్ష తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. అయినా ఆమె తమ్ముడికి టైప్‌-1 మధుమేహమని తెలిసి కంగారుపడ్డారు. వైద్య పరిజ్ఞానం ఉన్న వారే ఇలా ఉంటే.. ఆ అవగాహన లేనివారి పరిస్థితేంటన్న ఆలోచన ఆమెను కదిలించింది. ‘మధుమేహం ఉన్నవారు తిండి, వ్యాయామం, మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్లూకోజ్‌ స్థాయులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. చిన్న పొరపాటూ ప్రమాదానికి దారి తీయొచ్చు. అందుకే ‘ప్రాజెక్టు సూర్య’ ప్రారంభించా’నంటోంది 16ఏళ్ల దివా. వీళ్లది బెంగళూరు. కర్ణాటక వ్యాప్తంగా మధుమేహం బారిన పడిన పిల్లలకు సాయపడాలనుకుంది. వారిని గుర్తించి, తల్లిదండ్రులకి అవగాహన కలిగించడంతోపాటు నిపుణులతో అవగాహన సదస్సులు, ఇంటరాక్టివ్‌ కౌన్సెలింగ్‌ సెషన్లు నిర్వహిస్తోంది. వివిధ ఎన్జీఓలతో కలిసి ఇన్సులిన్‌ కిట్లు, మందుల పంపిణీ చేస్తోంది. ‘అడాప్ట్‌ ఎ చైల్డ్‌’ పేరుతో పిల్లలకు కొన్నేళ్లుగా ఇన్సులిన్‌లు అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకూ 15వేల మందికి పైగా సాయమందించింది. ఈ సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది డయానా అవార్డు సహా ఎన్నో పురస్కారాలు అందుకుందీమె.


లైంగిక ఆరోగ్యం కోసం..

శ్రియా బొప్పన.. పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది అమెరికాలో. డిగ్రీ చదువుతూ.. మహిళా హక్కుల కోసం పోరాడే ‘షి ఈజ్‌ ద ఫస్ట్‌’ ఎన్జీవోతో కలిసి పనిచేసి, ఆ సంస్థ యూత్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివిన శ్రియ హాలీవుడ్‌ నటులతో కలిసి ఇన్‌స్టాలో ‘గర్ల్స్‌గెట్‌లౌడ్‌’ పేరుతో లైంగిక విజ్ఞానంపై అవగాహన తీసుకొస్తోంది. వాతావరణ మార్పులు, యువత హక్కులు వంటివాటిపై తన గొంతు వినిపించాలని ‘బికమింగ్‌ ఎ వాయిస్‌’ సంస్థని ప్రారంభించింది. ‘బాలల హక్కులు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణ, లైంగిక ఆరోగ్యం, యాంటీ- ట్రాఫికింగ్‌ వంటివాటిపై ఒబామా ఫౌండేషన్‌సహా ఇతర ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నా’నని చెబుతున్న శ్రియ కొవిడ్‌ సమయంలో ‘టెడ్‌ టాక్‌’ పేరుతో లఘుచిత్రాన్ని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. 2020లో ‘మిస్‌ ఇండియా అమెరికా’గా నిలిచిన శ్రియ ఫాక్స్‌5 ప్లస్‌లో పలు సామాజిక అంశాలపై టీవీ షోలు చేసి లక్షలమంది అభిమానులని సంపాదించుకుంది.


ఆర్థిక పాఠాలు చెబుతోంది..

గుడ్‌గావ్‌కి చెందిన కశ్విది వ్యాపార కుటుంబం. దీంతో చిన్నప్పుడే ఆర్థికాంశాలపై మక్కువ ఏర్పడింది. తండ్రితో ఎకానమీ, స్టాక్‌మార్కెట్‌ అంశాలను చర్చించేది. ఎకనామిక్స్‌ విద్యనే ఎంచుకుంది. కొవిడ్‌ సమయంలో తమ పనిమనిషి, తెలిసిన మరో కుటుంబం ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడం చూసింది కశ్వి. ఆర్థిక భద్రత గురించి పక్కనపెడితే ప్రభుత్వం నుంచి అందే పథకాల గురించీ వాళ్లకి తెలియకపోవడం గమనించి అవగాహన కలిగించాలనుకుంది. 2022లో ‘ఇన్వెస్ట్‌ ద ఛేంజ్‌’ ప్రారంభించి కూలీలు, పనివారికి పొదుపు, మదుపులు, అర్హతల్ని బట్టి ప్రభుత్వం అందించే పథకాల గురించి వివరించడం, దగ్గరుండి దరఖాస్తు చేయించడం, బ్యాంకు ఖాతాలు తెరిపించడం వంటివెన్నో చేస్తోంది. అంతటితో తన పని అయిపోయిందనుకోదు.. అవి వాళ్లకి అందేలా కృషి చేస్తోంది కూడా. ‘రేపటి పరిస్థితేంటని చాలామంది ఆలోచించరు. కొన్నిసార్లు ఉచిత ఆరోగ్య సేవలుంటాయని తెలియక అప్పులు చేస్తుంటారు. వీటిపై అవగాహనంటూ ఉంటే చాలావరకూ వాళ్ల తలరాత మార్చొచ్చు అనిపించింది’ అనే 16ఏళ్ల కశ్వి ఎన్నో అవార్డులనీ అందుకుంది. అంతేకాదు పెద్దగా చదువుకోని వాళ్లకోసం సరళ భాషలో ఈ పథకాల వివరాలను అందించే యాప్‌నూ రూపొందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్