రాణించారు.. స్ఫూర్తిని నింపారు!

వైఫల్యం వేదనకు గురిచేస్తుంది.. నిస్సహాయత.. కుంగుబాటును కలిగిస్తుంది. అలాగని వాటికి తలొంచితే.. అక్కడే ఆగిపోతాం. అదే.. కసితో, సాధించాలన్న తపనతో పోరాడితే? వీళ్లలా విజేతలవుతారు.

Updated : 19 Dec 2023 07:03 IST

వైఫల్యం వేదనకు గురిచేస్తుంది.. నిస్సహాయత.. కుంగుబాటును కలిగిస్తుంది. అలాగని వాటికి తలొంచితే.. అక్కడే ఆగిపోతాం. అదే.. కసితో, సాధించాలన్న తపనతో పోరాడితే? వీళ్లలా విజేతలవుతారు. అలా తమ తలరాతను మార్చుకొని ఈ ఏడాది స్ఫూర్తిగా నిలిచిన వారిలో కొందరు వీళ్లు!


రాయలేకపోయినా.. ర్యాంకు

తం మర్చిపోయింది.. తనెవరో, తనవాళ్లెవరో తెలియదు. అలాంటి షెరిన్‌ సహానా.. ఈ ఏడాది కష్టమైన పరీక్షల్లో ఒకటిగా భావించే సివిల్స్‌లో ర్యాంకు సాధించింది. కేరళలోని వాయనాడ్‌ షెరిన్‌ది. ఆనందంగా సాగిపోతున్న తన జీవితంలోకి తండ్రి మరణంతో విషాదం మొదలైంది. దాన్ని జీర్ణించుకోలేక కుంగిపోయింది. అలాంటి తనను ఓ ప్రమాదం చావు అంచుల వరకూ తీసుకెళ్లింది. ఎలాగోలా బతికినా మంచానికే పరిమితం అయ్యింది. అప్పుడే అక్షరాలతో సహా అన్నీ మర్చిపోయింది. చికిత్స తర్వాత కోలుకున్నా నడుము కింది భాగం, చేతులు పనిచేయలేదు. అయినా తిరిగి చదువు మొదలుపెట్టింది.సివిల్స్‌ కలను నెరవేర్చుకోవాలి అనుకుంటే ‘నీకది అసాధ్యం’ అన్నారంతా. తను మాత్రం సంకల్పం ఉంటే చాలనుకుంది. పేపరు మీద పెన్ను పెట్టడానికీ వేళ్లు సహకరించవు. అందుకని స్క్రైబ్‌ సాయం తీసుకుని పరీక్షలు రాసింది. అలా చదివే.. ‘నెట్‌’కి అర్హత సాధించి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో సాధించింది. పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీనీ చేస్తోంది. అమ్మకు భారమవొద్దనుకున్న తను సివిల్స్‌కి ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకొంది. పట్టుదలగా చదివి 913వ ర్యాంకు సాధించింది. ‘ప్రాణం ఉంది, అంతకుమించి ఆత్మవిశ్వాసముంది. చాలు.. ఏదైనా సాధించొ’చ్చంటుందీమె.


గురిచూసి కొట్టింది!

‘నువ్వే మాకు ఆదర్శం’.. ప్రధాని మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సహా ఎంతోమంది ప్రముఖుల నుంచి ఈ కితాబు అందుకుంది శీతల్‌ దేవి. ఎంతో ఏకాగ్రత, తీక్షణత అవసరమైన ఆర్చరీలో సత్తా చాటింది తను. అదీ రెండు చేతుల్లేకుండా! జమ్మూకశ్మీర్‌కు చెందిన శీతల్‌కి ఓ అనారోగ్య సమస్య కారణంగా చేతుల్లేవు. పేద కుటుంబం. అయితేనేం లేనివాటి గురించి ఆలోచించి బాధపడలేదామె. కాళ్లతోనే పనులు చేయడం నేర్చుకుంది. వేగంగా కొండలెక్కుతూ కాళ్లని బలంగా మలుచుకుంది. ఓ క్రీడా ఈవెంట్‌లో ఆ చురుకుదనం చూసే భారతసైన్యం ఆమెను ఆటలవైపు ప్రోత్సహించింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న శీతల్‌ రోజూ 20 కి.మీ.లు ప్రయాణించి మరీ ఆర్చరీలో రాటుదేలింది. కాలితో బాణం పట్టుకొని నోటితో నారిని లాగి లక్ష్యానికి గురిపెట్టడంపై పట్టుసాధించింది. పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజతంతో రెండు చేతులూ లేని తొలి ఆర్చర్‌గా రికార్డుకెక్కింది. పారా ఆసియన్‌ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసింది.


అయితేనేం.. సాధించింది..

‘బాగా చదువుకుంటేనే జీవితంలో స్థిరపడతావు’ అన్న తల్లిదండ్రుల మాటలు విని తరగతిలో ఎప్పుడూ టాప్‌లో నిలిచేది రాధికా గుప్తా. వీళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌. ఏదో సమస్య కారణంగా ఆమె మెడ, కళ్లు వంకరగా ఉంటాయి. తన రూపుని చూసి ఎవరూ దగ్గరికే రానిచ్చేవారు కాదు. నాన్న ఉద్యోగరీత్యా వివిధ దేశాల్లో తిరగాల్సొచ్చింది. దీంతో స్నేహితులూ ఉండేవారు కాదు. పైగా తరగతిలో తన రూపునీ, యాసనీ చూసి ‘మీ అమ్మ అందంగా ఉంది. నువ్వెందుకిలా ఉన్నా’వంటూ వెక్కిరించేవారు. ఇవన్నీ భరించినా తన వైకల్యాన్ని చూపి ఉద్యోగానికీ తిరస్కరించారు. అది సహించలేకపోయింది. ఏడు తిరస్కరణలొచ్చేసరికి తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. కౌన్సెలింగ్‌ తర్వాత తిరిగి కోలుకున్న తను ఉద్యోగం సాధించి రాణించడమే కాదు.. ఓ సంస్థనీ ప్రారంభించింది. తర్వాత ఎడెల్‌వైస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కి సీఈఓ అయ్యే స్థాయికి ఎదిగింది. పిన్న వయస్సు సీఈఓగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. తన వంకర మెడనే చూపిస్తూ ఇతరుల్లో ఆత్మవిశ్వాసం నింపుతోన్న రాధిక షార్క్‌ట్యాంక్‌లోకీ అడుగుపెట్టింది. పెట్టుబడులు పెడుతూ చిన్న స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది.


మురికి వాడల నుంచి..

ఫ్యాషన్‌ మేగజీన్‌ కవర్ల మీద మెరవడం అంత తేలికేం కాదు. ప్రతిభతోపాటు కెమెరా ముందు నిలిచే ధైర్యం కూడా కావాలి. వాటిని ప్రదర్శించి వోగ్‌, కాస్మొపాలిటన్‌ వంటి ప్రముఖ ఫ్యాషన్‌ మేగజీన్ల దృష్టిని ఆకర్షించింది మలీషా కర్వా. ముంబయిలోని అతిపెద్ద మురికివాడలో ఆమె నివాసం. నాన్నది అంతంత మాత్రం సంపాదన. ఇంట్లో అరకొర వసతులు. రెండేళ్ల క్రితం ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ కోసం దేశానికి వచ్చిన ఓ విదేశీయుడి కంట పడిందీమె. తన చలాకీతనం నచ్చిన అతను ఆమెపై తీసిన వీడియో వైరల్‌ అయ్యింది. అలా పార్ట్‌టైమ్‌ మోడల్‌గా మారిన మలీషా ఓవైపు చదువుతూనే కుటుంబానికి ఆసరాగా మారింది. ‘స్లమ్‌ ప్రిన్సెస్‌’గా గుర్తింపు తెచ్చుకుంది. తనవల్లే వాళ్లింటికి కరెంటు, నీటి సరఫరా వంటివి వచ్చాయి. మురికివాడల నుంచి వచ్చావు అన్నా బాధపడదు తను. పైగా ‘ఇది నా ఇల్లు. దీనిలో నామోషీ ఏముం’దంటూ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ మారి 3.5లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. సూపర్‌ మోడల్‌ అవ్వడం తన కల.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్