అలుపెరగని అతివలకు.. అర్జున కిరీటాలు!

ఆటని శ్వాసగా...ధ్యాసగా మార్చుకున్నారు! వైఫల్యాలకి ఎదురునిలిచి పోరాడారు..  ఆటతోనే పుట్టి పెరిగిన ఊరికీ.. దేశానికీ పేరుతెచ్చారు.. నేడిలా దేశం గర్వించేలా అర్జున అవార్డులని అందుకున్నారు..

Updated : 22 Dec 2023 06:52 IST

ఆటని శ్వాసగా...ధ్యాసగా మార్చుకున్నారు! వైఫల్యాలకి ఎదురునిలిచి పోరాడారు..  ఆటతోనే పుట్టి పెరిగిన ఊరికీ.. దేశానికీ పేరుతెచ్చారు.. నేడిలా దేశం గర్వించేలా అర్జున అవార్డులని అందుకున్నారు..


ఊరి వెతలు తీర్చింది..

హిమాచల్‌ప్రదేశ్‌లోని షిరోగ్‌ గ్రామ ప్రజలు ఊళ్లోకి రావాలన్నా, అక్కడ నుంచి బయటకు వెళ్లాలన్నా చాలా కష్టం. కారణం వాళ్ల ఊరికి ఒకే ఒక బస్సు మరి. కానీ ఏడాదిగా ఆ పరిస్థితి మారింది. తరచూ బస్సులు వస్తూ, పోతూ ఊరి ప్రజల వెతలు తీర్చాయి. కారణం.. రీతూనేగి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కబడ్డీ క్రీడాకారిణిగా ఆ ఊరి కష్టాలు తీర్చిందీ అమ్మాయి...

తండ్రి భవన్‌సింగ్‌ కబడ్డీ క్రీడాకారుడు కానీ అవకాశాలు రాక స్కూల్లో పీఈటీగా చేరిపోయాడు. తల్లి పూర్ణిమ. షరోగ్‌లో తొమ్మిదో తరగతి వరకూ చదివి.. ఆ తర్వాత బిలాస్‌పుర్‌ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ తనకిష్టమైన కబడ్డీలో శిక్షణ తీసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ టీంలో చోటు దక్కించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తూ నాయకత్వం వహించింది. దేశానికి స్వర్ణాలు తీసుకొచ్చింది. హరియాణాకు చెందిన క్రీడాకారుడు రోహిత్‌ గులియాని వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలోనే కీలక మ్యాచ్‌లు ఉండటంతో నాలుగురోజులు మాత్రమే సెలవు తీసుకుని ఇంట్లో వాళ్లని ఒప్పించి మ్యాచ్‌కి హాజరైంది. జట్టుకు విజయాన్ని అందించింది. ‘ఎన్నో ఏళ్ల సాధనకు దక్కిన ఫలితమే ఈ విజయం. నాన్న గొప్ప క్రీడాకారుడు. అవకాశాల్లేక ఆయన ఆపేసిన ప్రయాణాన్ని నేను కొనసాగించా’ననే రీతూ గతేడాది ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణపతకాన్ని సాధించి ఎంతోమంది అమ్మాయిలు కబడ్డీవైపు అడుగులు వేసేలా చేసింది.


పొలాల్లో పరుగుపెట్టి.. 

చూడ్డానికి సన్నగా, బక్కపల్చగా ఉండే పరుల్‌చౌధరి ఒకప్పుడు బొద్దుగా ఉండేదంటే నమ్ముతారా? ఆమె బరువే నేడు పరుల్‌ని దేశం మెచ్చిన క్రీడాకారిణిని చేసింది. బొద్దుగా ఉండే పరుల్‌ని ఎత్తడం, దించడం కష్టమయ్యేదట ఆమె తల్లికి. దాంతో పొలంలో ఉన్న తండ్రికి క్యారేజీ తీసుకెళ్లాలన్నా... ఊర్లోకి వెళ్లి గబుక్కున ఏ కబురు చెప్పాలన్నా... పరుల్‌నే పంపించేదట వాళ్లమ్మ. పరుగు పెడితే అయినా... పిల్ల బరువు తగ్గుతుందని ఆశ. అలా చెరకు పొలాల్లో... ఒట్టి కాళ్లతో పరుగుపెట్టిన పరుల్‌ స్కూల్‌ పోటీల్లో గెలిచిన తర్వాత పరుగునే కెరియర్‌గా ఎంచుకుంది. తర్వాత కాలంలో అథ్లెట్‌గా రాణించి... వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతా సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాలా గ్రామానికి చెందిన పరుల్‌ది సాధారణ రైతు కుటుంబం. తనతోపాటు చెల్లిని కూడా పరుగు పెట్టేందుకు ప్రోత్సహించిందీ అమ్మాయి. ‘ఆడపిల్లలేంటి.. ఈ పరుగులేంటి’ అని ఊరివాళ్లు అన్నమాటలు పట్టించుకోకుండా తండ్రి కృష్ణపాల్‌ కూతుళ్లని ప్రోత్సహించాడు. అలా పరుల్‌ ఈ రంగంలోకి వచ్చింది. 2016కు ముందు వరకూ ఎన్నో విజయాలని తృటిలో చేజార్చుకున్న ఈ అమ్మాయి వరస వైఫల్యాలు వల్ల మరింత పట్టుదలతో సాధన చేసి.. ఐదుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. 3000, 5000 మీటర్ల పరుగులో రాణిస్తూ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 11వ స్థానంలో నిలిచింది పరుల్‌. ప్రస్తుతం రైల్వేలో విధులు నిర్వర్తిస్తోంది.  


సైగలతోనే సాధించింది..

దీక్షా దాగర్‌కి పుట్టుకతోనే వినికిడి సమస్య. సైగల భాష, పెదాల కదలిక మీదే ఆధారపడేది. దీంతో ఎవరూ తనతో ఆడటానికీ ఇష్టపడేవారు కాదు. ఆమె అన్నయ్య పరిస్థితీ అంతే. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపాలని వీళ్ల నాన్న ఆటలను పరిచయం చేశారు. వీళ్లది హరియాణ. టెన్నిస్‌, ఈత, అథ్లెటిక్స్‌ అన్నీ ప్రయత్నించిన దీక్ష.. గోల్ఫ్‌వైపు ఆకర్షితురాలైంది. శిక్షణ ఇప్పిద్దామనుకుంటే ఎవరూ ముందుకు రాలేదు. నాన్న నరీందర్‌ గోల్ఫ్‌ క్రీడాకారుడే. దీంతో ఆరేళ్ల దీక్షకు ఆయనే కోచ్‌ అయ్యారు. తనది ఎడమ చేతివాటం కావడంతో రిఫరెన్స్‌కీ ఎవరూ లేకపోవడం మరో సమస్య అయ్యింది. అయినా వెనకడుగు వేయలేదు 22 ఏళ్ల దీక్ష. 2015 లేడీస్‌ గోల్ఫర్‌ పోటీలతో గుర్తింపు తెచ్చుకున్న తను.. రెండు డెఫెలింపిక్స్‌లో పోటీపడి రజత, బంగారు పతకాలు గెలిచింది. వీటితోపాటు ఒలింపిక్స్‌లోనూ పోటీపడిన తొలి గోల్ఫర్‌గా చరిత్రకెక్కింది. హియరింగ్‌ ఎయిడ్‌తో ఇప్పుడు కాస్త వినగలదు. లేడీస్‌ యూరోపియన్‌ టూర్‌ సహా విదేశాల్లో పలు పోటీల్లోనూ గెలిచింది. పర్యటనల మధ్యే చదువునూ కొనసాగిస్తోంది. దీంతో స్నేహితులే లేరు తనకు. అందుకే ఎప్పుడూ తన వెంట ఉండే నాన్నే తన స్నేహితుడంటుందీమె.


ఇంటినే అమ్మేశారు

గుర్రాల మీద ప్రేమ దివ్యకృతికి వారసత్వంగా వచ్చింది. నాన్న విక్రమ్‌ రాథోడ్‌తోపాటు ఆమె తాతలూ గుర్రపు స్వారీ చేసేవారు. అలా ఈక్వస్ట్రియన్‌.. గుర్రపు స్వారీ పోటీలపై మనసు పారేసుకుంది. వీళ్లది రాజస్థాన్‌లోని జైపుర్‌. పన్నెండేళ్ల వయసులో స్వారీ మొదలుపెట్టిన దివ్య జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో వ్యక్తిగత, బృంద విభాగాల్లో సత్తా చాటింది. డిగ్రీ సమయంలో చదువుకు ఆటంకం కలుగుతోందని రెండేళ్లు పోటీలకు దూరంగా ఉంది. పూర్తయ్యాక ఆసియా క్రీడల్లో పోటీపడాలని ఉందన్న కోరికను అమ్మానాన్నల ముందు ఉంచింది. దీనికోసం యూరప్‌లో శిక్షణ తీసుకోవాలి. వాళ్ల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇంట్లోవాళ్లూ ప్రోత్సహించారు. తీరా.. రెండేళ్ల విరామం కారణంగా పోటీల్లో వెనకబడింది. దీంతో ఇక రాణించడం కష్టమేమోనని కుంగిపోయింది. అయితే కొవిడ్‌ కారణంగా ఆ పోటీలు వాయిదా పడటంతో తిరిగి సాధనపై దృష్టిపెట్టింది. రెండేళ్లు ఇంటికీ రాలేదు. తన శిక్షణకు అయ్యే ఖర్చుకోసం వాళ్ల నాన్న ఇంటినీ అమ్మేశారు. ఆ పట్టుదల ఫలితమే ఆసియా క్రీడల్లో చారిత్రాత్మక బంగారు పతకం. దీనికోసం 23ఏళ్ల దివ్య తన రోజును ఉదయం 5గంటలకే ప్రారంభించేదట. విపరీతమైన చలి, మంచు కురుస్తున్నా దినచర్యలో మార్పు చేసుకోలేదు సరికదా సాధనను కొనసాగించింది. ఈక్వస్ట్రియన్‌లో ఆసియాలోనే తొలి ర్యాంకు తనది. ప్రపంచంలో 14వ స్థానం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్