సంగీత.. తారలు

సంగీతానికి భాష లేదు.. ఎవరి మనసునైనా కరిగించే శక్తి దీనిది.. ఇలాంటి మాటలు చాలాసార్లే వినుంటాం కదూ! వీళ్లు మాత్రం దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు.

Updated : 24 Dec 2023 03:22 IST

సంగీతానికి భాష లేదు.. ఎవరి మనసునైనా కరిగించే శక్తి దీనిది.. ఇలాంటి మాటలు చాలాసార్లే వినుంటాం కదూ! వీళ్లు మాత్రం దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. తమ సంగీతంతో దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకోవడమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. అలా ఈ ఏడాది సంగీత ప్రపంచంలో రారాణులుగా నిలిచిన కొందరు వీళ్లు!


ఆసియాలో ఉత్తమ డీజే!

స్నేహితులతో పబ్‌లకు వెళ్లడం.. నచ్చిన పాటలను కోరడం ఈ తరానికి మామూలే. ఓసారి ఇలాగే పబ్‌కి వెళ్లింది స్నేహల్‌ షా. తనకు నచ్చిన ఓ పాటను ప్లే చేయమంది. అప్పటికే అలసిపోయి ఉన్నాడేమో ఆ డీజే.. ‘నేను చేయను. కావాలంటే నీకు నచ్చింది నువ్వే ప్లే చేసుకో’ అన్నాడట. అలా అన్నప్పుడు ఎవరైనా అవమానంగా భావిస్తారు. స్నేహల్‌ మాత్రం నిజంగానే ప్రయత్నించడానికి వెళ్లింది. అలా దానిపై ఆసక్తినీ పెంచుకుంది. అంతేకాదు.. చేస్తున్న మార్కెటింగ్‌ ఉద్యోగాన్ని వదిలి మరీ.. దీన్నే కెరియర్‌గా ఎంచుకుంది. స్నేహల్‌ది గుజరాత్‌. ప్రముఖ డీజేల వద్ద శిక్షణ తీసుకుంది. ఎలక్ట్రానిక్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌లో దిట్ట తను. ‘డీజే రింక్‌’గా పేరు మార్చుకొని.. ముంబయిలో వేడుకలేవైనా తను ఉండాల్సిందేనన్న పేరు తెచ్చుకుంది. సింగర్‌, రీమిక్సర్‌ కూడా. కాన్సర్టుల్లోనూ పాల్గొంటుంది. ప్రపంచంలోని 100 మంది ఉత్తమ డీజేల్లో తనూ ఒకరు. దేశంలో మొదటి స్థానం. ఈ ఏడాది ఆసియాలోనే టాప్‌ 50 డీజేల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ‘రికార్డ్‌ లేబుల్‌’ పేరుతో డీజే స్కూల్‌నీ నిర్వహిస్తోంది. ఐపీఎల్‌కీ పనిచేసింది. డీజే రైట్స్‌ అసోసియేషన్‌కి సెక్రటరీ కూడా.


 శ్వేతసౌధంలో ప్రదర్శనిచ్చింది!

దేశాధ్యక్షుల ముందు ప్రదర్శన అంటే ఎంత అరుదైన అవకాశం! తన ప్రతిభతో శ్వేతసౌధంలో ప్రదర్శించే అవకాశం పొందడమే కాదు.. ప్రధాని మోదీ, అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ మెప్పునీ అందుకుంది విభా జానకీరామన్‌. ఈ 17ఏళ్ల అమ్మాయిది చెన్నై. వీళ్ల కుటుంబం తన చిన్నతనంలోనే అమెరికాలో స్థిరపడింది. సంగీత నేపథ్యమున్న కుటుంబం. భారత శాస్త్రీయ సంగీత కళాకారుడైన తాతను చూసి ఆరో ఏట నుంచే విభ వయోలిన్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. భారత, పాశ్చాత్య సంగీతాలను మేళవించి తనిచ్చే ప్రదర్శనలకు అభిమానులెక్కువ. సంగీతాన్నే కెరియర్‌గా ఎంచుకొని బ్యాచిలర్స్‌ చేస్తోంది. ఆర్కెస్ట్రల్‌, ఛాంబర్‌ మ్యూజిక్‌ ప్రోగ్రాముల్లో ప్రదర్శనలిచ్చి స్కాలర్‌షిప్‌లనూ అందుకుంది. ప్రపంచమంతా తిరుగుతూ ప్రదర్శనలివ్వాలి, కోట్ల మంది మనసులపై ముద్ర వేయాలన్నది ఈమె ఆశ.


ఇది రెండోసారి..

మూడేళ్లకే శాస్త్రీయ సంగీత సాధన ప్రారంభించిన ఎస్‌జే జనని.. ఏడేళ్లొచ్చేసరికి తొలి ఆల్బమ్‌ని రిలీజ్‌ చేసింది. ఈమెది మదురై. డాక్టర్‌ బాలమురళీ కృష్ణ శిష్యురాలు. ఎస్‌పీ బాలు, హరిహరన్‌, ఉన్నికృష్ణన్‌ వంటి మహామహులతో కలిసి పాటలు పాడింది. కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించడమే కాదు.. పలు వాద్యాలనూ వాయించగలదు. సినిమాలతోపాటు ప్రైవేటు ఆల్బమ్‌లూ చేసిన ఆమె పాటల రచయిత్రి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా. పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియాతో కలిసి పారిస్‌లో జుగల్‌బందీలో పాల్గొని ప్రపంచ వేదికపైనా తన ముద్ర వేసింది. పాతికేళ్ల సంగీత ప్రస్థానంలో తనందుకున్న జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో. పాప్‌, జానపదం, ఫ్యూజన్‌ ఇలా తను పాడని జానర్‌ లేదు. గత ఏడాది ఇంటర్‌ కాంటినెంటల్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌ నుంచి పాప్‌ విభాగంలో ‘బెస్ట్‌ ఆఫ్‌ ఆసియా’ పురస్కారాన్ని అందుకున్న 28ఏళ్ల జనని.. ఈసారి జానపద విభాగంలోనూ సాధించింది. 3 డాట్‌ రికార్డింగ్‌ స్టూడియోతోపాటు సొంత లేబుల్‌ జేఎస్‌జేనీ ప్రారంభించిన తను లాస్‌ఏంజెలెస్‌కి చెందిన ఓ సంస్థతో కలిసి పనిచేస్తోంది.


మిల్లెట్లపై పాడి..

ఫాలూ ఉరఫ్‌ ఫాల్గుణి షాది ముంబయి. మూడో ఏట నుంచే సంగీత సాధన మొదలుపెట్టిన తను శాస్త్రీయ సంగీతంతోపాటు జానపదాలు, గజల్స్‌నీ నేర్చుకుంది. భారత శాస్త్రీయ సంగీతంలో పీజీ చేసిన ఫాలూ పెళ్లయ్యాక అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఇండో-అమెరికన్‌ బ్యాండ్‌ ‘కరిష్మా’లో లీడ్‌ సింగర్‌గా మారింది. సింగర్‌ ‘యో యో మా’తో చేసిన ప్రాజెక్టుతో ఈమె పేరు ప్రపంచమంతా తెలిసింది. హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీతోపాటు ఇతర ప్రముఖులతోనూ పనిచేసింది. ప్రముఖ పురస్కారాలెన్నో అందుకుంది. గత ఏడాది తన ఆల్బమ్‌ ‘ఎ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’కి ‘ఉత్తమ పిల్లల ఆల్బమ్‌’ కేటగిరీలో గ్రామీ అవార్డు వరించింది. దాన్ని అందుకున్న ఫాలూ దేశానికి వచ్చినప్పుడు మోదీని కలిస్తే ఆయన చిరుధాన్యాలపై పాట రాయమని సలహా ఇచ్చారు. ఆయనతో కలిసి గీతరచన పూర్తిచేసి.. ‘అబండెన్స్‌ ఇన్‌ మిల్లెట్స్‌’ పేరుతో హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదల చేశారు. ఈ పాట తాజాగా గ్రామీ నామినేషన్లలో చోటు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్