మా పాప మాటలే... వ్యాపారవేత్తని చేశాయి!

నర్సరీ చదివే కూతురిని... నువ్వు పెద్దయ్యాక ఏమి చేస్తావ్‌? అని ప్రశ్నించిందామె. ‘నానమ్మలా, నీలా ఇంట్లోనే ఉంటాన’ని చెప్పిందా చిన్నారి. ఆ మాట వినగానే ఆ తల్లి మనసులో తెలియని దిగులు. ఇంత చదివిన తాను ఖాళీగా ఉండడం ఏంటి... బిడ్డకు తనే ఒక రోల్‌ మోడల్‌గా నిలబడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంది. ఆ సంకల్పానికి రూపం ఓ బ్రాండ్‌గా మారింది.

Updated : 12 Jan 2024 12:22 IST

నర్సరీ చదివే కూతురిని... నువ్వు పెద్దయ్యాక ఏమి చేస్తావ్‌? అని ప్రశ్నించిందామె. ‘నానమ్మలా, నీలా ఇంట్లోనే ఉంటాన’ని చెప్పిందా చిన్నారి. ఆ మాట వినగానే ఆ తల్లి మనసులో తెలియని దిగులు. ఇంత చదివిన తాను ఖాళీగా ఉండడం ఏంటి... బిడ్డకు తనే ఒక రోల్‌ మోడల్‌గా నిలబడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంది. ఆ సంకల్పానికి రూపం ఓ బ్రాండ్‌గా మారింది. వందనా కలగర ప్రారంభించిన కీబీ పిల్లల ఆర్గానిక్‌ దుస్తుల బ్రాండ్‌ దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆ వివరాల్ని ఆమె మనతో పంచుకుందిలా...

మా సొంతూరు తాడేపల్లిగూడెం. నాన్న రాంబాబు హోటల్‌ నిర్వహించేవారు. అమ్మ అనుపమ. మేము ముగ్గురు ఆడపిల్లలం. నేను రెండో అమ్మాయిని. చిన్నతనం నుంచీ ఫ్యాషన్‌ రంగం అంటే ఇష్టం.. ఆ కారణంగానే నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు చదివా. అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేశా. మావారు బాలకృష్ణ ఐటీ ఉద్యోగి కావడంతో హైదరాబాద్‌లోనే ఉంటూ కొన్ని సంస్థలకు ఫ్రీలాన్స్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేశా. మావారే నన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తూ వచ్చారు. మా పాప కడుపులో పడ్డాక.. డిజైనింగ్‌ పనిని పక్కనపెట్టా. అప్పటి నుంచి ఇంటి పనులతోనే సరిపోయేది. మా పాప నర్సరీ చదువుతున్నప్పుడు.. స్కూల్‌లో ‘కెరియర్‌ డే’ జరిగింది. తను ఇంటికొచ్చాక ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని అడిగా. టీచర్‌, డాక్టర్‌, ఇంజినీర్‌లాంటివేవో చెబుతుందిలే అనుకున్నా. తను మాత్రం ‘నేను నానమ్మలా, నీలా ఇంట్లో ఉంటా’ అనేసరికి షాకయ్యా! ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై నా ఇష్టమంతా కళ్లముందు కదలాడింది. ఇక నుంచైనా నా బిడ్డకు రోల్‌మోడల్‌ అవ్వాలనుకున్నా. ఏదో ఒకటి చేయాలనుకున్న సమయంలోనే ఓ సంఘటన జరిగింది. మా పాపకు ఇక్కడ మంచి దుస్తులు దొరక్క యూఎస్‌ నుంచి తెప్పించేదాన్ని. ఎక్కడినుంచో తెప్పించే బదులు నేనే పిల్లల కోసం ఒక బ్రాండ్‌ని ప్రారంభిస్తే బాగుంటుంది అనుకున్నా. ఎందుకంటే నవజాత శిశువుల చర్మం సున్నితంగా ఉంటుంది. సాధారణ దుస్తుల్లోని రంగులు, వస్త్రాలు కొన్నిసార్లు అలర్జీలకు కారణం కావొచ్చు. అలా కాకుండా ఉండాలంటే సేంద్రియ పత్తితో చేసిన కాటన్‌ దుస్తులు వేస్తేనే మంచిది. ఆ దుస్తుల్నే పిల్లలకు అందివ్వాలనుకున్నా. రిసెర్చ్‌ చేసి.. గ్లోబల్‌ ఆర్గానిక్‌ టెక్స్‌టైల్‌ స్టాండర్డ్‌ (జీఓటీఎస్‌) ద్వారా ధ్రువీకరించిన ముడిసరకే వాడేదాన్ని. ఈ ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్‌ను కోయంబత్తూరు నుంచి దిగుమతి చేసుకుంటాం. పెట్టుబడి కోసం బ్యాంక్‌లో రూ.15లక్షల రుణం తీసుకుని మియాపూర్‌లో ‘కీబీ’ పేరుతో తయారీ యూనిట్‌ను ప్రారంభించా. హైదరాబాద్‌ నిఫ్ట్‌లో నాతోపాటూ చదివిన స్మృతీరావును భాగస్వామిగా చేసుకున్నా. మొదట్లో ఎవరికీ ఈ సేంద్రియ దుస్తులంటే ఏంటో కూడా అవగాహన లేదు. దాంతో పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. సేంద్రియ దుస్తులపై అవగాహన పెంచాలని ఎగ్జిబిషన్‌ పెట్టి వివరించా. కొద్దికొద్దిగా అవగాహన పెరుగుతోంది అనుకొనే సమయానికి కొవిడ్‌ మొదలయ్యింది. చిన్నపాటి బ్రేక్‌ వచ్చినా... కొవిడ్‌ తర్వాత చాలామందిలో ఆరోగ్యస్పృహ పెరగడంతో మా కీబీకి గుర్తింపు వచ్చింది.

అందరికీ నచ్చేలా..

వినియోగదారులకు నచ్చినట్లు దుస్తులు డిజైన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం 200స్టైల్స్‌ను రూపొందించాం. మా యూనిట్‌లో పది మంది వరకూ ఉపాధి పొందుతున్నారు. మేం రూపొందించిన దుస్తులు నేరుగా మా వెబ్‌సైట్‌లోనే లభిస్తున్నాయి. అలానే బెంగళూరు, హైదరాబాద్‌లలో నేరుగా దుకాణాల్లో అమ్ముతున్నాం. ప్రస్తుతం రూ.అరవై లక్షల వరకు వ్యాపారం చేస్తున్నాం. కొందరు సెలెబ్రిటీలు సైతం మావద్ద కొనుగోలు చేసి, బాగున్నాయంటూ ప్రశంసించారు. మహిళలకు వాళ్లకంటూ లక్ష్యాలు ఉండాలి. ఆర్థికస్వేచ్ఛ ఉండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు అనేది నా అభిప్రాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్