‘ఉజాలా’తో ఆపేయొద్దనుకున్నా...

సంస్థ పగ్గాలు తీసుకున్న తొలిరోజు... ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి. ఆరునెలల తర్వాత ఆఫీసులో అడుగుపెట్టినా పట్టుమని పదిమంది ఉద్యోగులు కూడా లేరక్కడ.

Updated : 20 Jan 2024 07:03 IST

సంస్థ పగ్గాలు తీసుకున్న తొలిరోజు... ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి. ఆరునెలల తర్వాత  ఆఫీసులో అడుగుపెట్టినా పట్టుమని పదిమంది ఉద్యోగులు కూడా లేరక్కడ. అదంతా కొవిడ్‌ ప్రభావం! అలాంటి గడ్డు పరిస్థితుల నుంచి సంస్థని ముందువరుసలో నిలిపింది జ్యోతి లేబొరేటరీస్‌ అధినేత్రి ఎంఆర్‌ జ్యోతి. ఫోర్బ్స్‌ ఇండియా కవర్‌పేజీ మీదకెక్కిన ఈ అమ్మాయి స్ఫూర్తి కథనాన్ని మనమూ తెలుసుకుందామా...

జ్యోతి... అంటే ఠక్కున గుర్తుపట్టకపోవచ్చు. కానీ, దుస్తులు తెల్లగా మార్చే ‘ఉజాలా’, పాత్రలని మెరిపించే ‘ప్రిల్‌’ లిక్విడ్‌ డిష్‌వాషర్‌, మార్గో సోప్‌, హెన్కో, ఎక్సో, మిస్టర్‌ వైట్‌ డిటర్జెంట్‌... వీటిల్లో వేటిని చూసినా ఆమె శ్రమ, నాయకత్వ లక్షణాలని తేలిగ్గానే అంచనా వేయొచ్చు. నిజం చెప్పాలంటే... ఉజాలా నీలిమందు కంటే ఓ ఐదేళ్ల ముందు పుట్టింది జ్యోతి. ఆమె తండ్రి రామచంద్రన్‌ కేరళలోని త్రిసూర్‌ నుంచి వచ్చి, బతుకుతెరువు కోసం ముంబయిలో స్థిరపడ్డారు. చిన్న సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేవారాయన. ఆయనకో అలవాటు ఉండేది. తెల్లని దుస్తుల్లో తన ఆత్మగౌరవాన్ని చాటాలనుకొనేవారు. వాటిని ఎవరు ఉతికినా ఆయనకి నచ్చేది కాదు. స్వయంగా ఉతుక్కోవాల్సిందే. ఈ క్రమంలో తను పనిచేస్తున్న సంస్థలోని పాత ల్యాబ్‌ని వాడుకుని బట్టల్ని మెరిపించే ప్రయోగాలు చేసేవారు. ఆ ప్రయోగాల ఫలితమే ‘ఉజాలా’. నలభై ఏళ్ల క్రితం అన్నగారిచ్చిన ఐదువేల రూపాయలతో.. తన పెద్దకూతురు జ్యోతి పేరుతో ఈ ల్యాబ్‌ని స్థాపించారాయన. రామచంద్రన్‌ దుస్తులు ఉతకడానికి సిగ్గుపడలేదు. అలాగే తన కూతురికి ధైర్యం నూరిపోసి మగపిల్లాడిలా పెంచడంలోనూ వెనక్కి తగ్గలేదు. ‘కుట్టీ.. గర్ల్‌ పవర్‌ గురించి తెలుసా నీకు? తెలుసుకోవాలంటే ఇందిరాగాంధీ గురించి చదువు! అనేవారు నాన్న. ఆ మాటలే నాపై మంత్రంలా పనిచేశాయి. ఉజాలాని కొనిపించడానికి నాన్న, ఓ పదిమంది మార్కెటింగ్‌ అమ్మాయిలు ముంబయిలో ఇంటింటికీ తిరగడం నాకు గుర్తే. ‘నాలుగు చుక్కల ఉజాలా’ అంటూ నాన్నే పాట(జింగిల్‌) రాసి ప్రచారం చేశారు. మా వ్యాపారం దేశమంతటా విస్తరించింది. కానీ ఒక్క దానితోనే ఆగిపోతే... వ్యాపార ప్రపంచంలో నిలదొక్కుకోలేం అనిపించింది. సంస్థ సంపదనే కాదు... సవాళ్లనూ వారసత్వంగా తీసుకోవాలనుకున్నా’ అనే జ్యోతి 2005లోనే మార్కెటింగ్‌ విభాగంలో అడుగుపెట్టింది. ముంబయిలోని వేలింకర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ నుంచి ఎంబీఏ... హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ప్రెసిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌, ఫ్యామిలీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులనీ పూర్తిచేసింది.

రెండున్నరవేల కోట్లతో...

తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి.. ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగంలో గట్టి పోటీనిస్తున్న బహుళజాతి సంస్థలు హిందుస్థాన్‌లీవర్‌, పీఅండ్‌జీ, ఐటీసీ... వంటి సంస్థలతో సమానంగా ముందుకు వెళ్లాలన్న లక్ష్యంలో ఎన్నో సవాళ్లనీ ఎదుర్కొంది జ్యోతి. ‘ఒక మహిళ అవసరాన్ని తోటి మహిళే అర్థం చేసుకోగలదు. అందుకే సామాన్య మహిళలతో మాట్లాడేదాన్ని. ఇళ్లకి వెళ్లి వాళ్ల అవసరాలను తెలుసుకునేదాన్ని. మార్కెటింగ్‌ సహా అన్ని విభాగాల్లో పనిచేయడంతో సంస్థ బలాలు, బలహీనతలు అర్థమయ్యాయి. పరిశోధనా విభాగాన్ని బలోపేతం చేసి మాక్సో మస్కిటో రెపల్లెంట్‌, నీమ్‌ టూత్‌పేస్ట్‌, చెక్‌, మిస్టర్‌ వైట్‌ డిటర్జెంట్‌ వంటి కొత్త ఉత్పత్తులు తయారు చేయడంతోపాటు... వంద సంవత్సరాల చరిత్ర ఉన్న మార్గో, హెన్కో వంటి సంస్థల్ని టేకోవర్‌ చేయగలిగాం. టీంవర్క్‌పై పట్టుండటంతో కొవిడ్‌లాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఏ ఆటంకాలూ లేకుండా మా ఉత్పత్తులు ప్రజలకు చేరువయ్యాయి. ఏ మధ్యతరగతి ఇంట్లో అడుగుపెట్టినా మా ప్రొడక్ట్స్‌ కనిపించాలన్నదే నా కల’ అనే జ్యోతి సంస్థ ఆదాయాన్ని రూ.1,700కోట్ల నుంచి రూ.2,500 కోట్లకు చేర్చింది. ‘జ్యోతి ల్యాబ్స్‌ షేర్‌మార్కెట్‌లో అడుగుపెట్టి లాభాల బాట పట్టడానికి కారణం... ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకమే. కుటుంబం, కెరియర్‌ ఈ రెండింటి మధ్య సమన్వయం చేయడం నేర్చుకుంటే మనం విజయం సాధించడం తేలిక’ అంటోంది జ్యోతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్