కార్టూన్‌ పాత్రలు కోట్లు కురిపిస్తున్నాయి!

గంటల తరబడి టీవీ తెరలకి అతుక్కుపోయే చిన్నారులు... కాసేపు పుస్తకాలు తెరిచి చదవమంటే మాత్రం చిన్నబుచ్చుకుంటారు. ఇలాంటివారి దృష్టిని ఆకర్షించి, మనసుని పాఠ్యాంశాలపైకి మళ్లించేలా చేయాలనుకున్నారు ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా.

Updated : 03 Feb 2024 07:13 IST

గంటల తరబడి టీవీ తెరలకి అతుక్కుపోయే చిన్నారులు... కాసేపు పుస్తకాలు తెరిచి చదవమంటే మాత్రం చిన్నబుచ్చుకుంటారు. ఇలాంటివారి దృష్టిని ఆకర్షించి, మనసుని పాఠ్యాంశాలపైకి మళ్లించేలా చేయాలనుకున్నారు ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా. యంగ్‌ బాహుబలి, బిగ్‌బీస్‌ జూనియర్‌, తెనాలి రామ, ఘటోత్కచ్‌, చక్ర... వంటి ఎన్నో కార్టూన్‌ పాత్రలను సృష్టించి వారితో పాఠాలను వల్లె వేయిస్తున్నారు. ఫలితమే ‘క్రియేటివ్‌ గెలీలియో’. దీన్ని ప్రారంభించిన ఏడాదిలోనే వందల కోట్ల రూపాయల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు.

‘విజయం సాధించాలంటే... చేసే పనిని ప్రేమించాలి. మారుతోన్న కాలానికి అనుగుణంగా అడుగులు వేయాలి’ అంటారు ప్రేరణ. ఎడ్యుకేషన్‌ రంగంలోకి అడుగు పెట్టాలన్నది తన చిన్నప్పటి కల అని చెబుతారామె. స్వస్థలం కోల్‌కతా. తండ్రి అక్కడ ఓ జనపనార పరిశ్రమను నిర్వహించేవారు. బాల్యంలో తాను చదువుకున్న పాఠాలను అక్కడ పనిచేసే కార్మికుల పిల్లలకు బోధించేవారామె. ఆ సమయంలోనే భవిష్యత్తులో తానొక స్కూలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. న్యూయార్క్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు ప్రేరణ. 2012లో పెళ్లి చేసుకున్నాక సింగపూర్‌లో స్థిరపడ్డారా దంపతులు. ఎలాంటి వ్యాపార నేపథ్యం లేదు. బిజినెస్‌ డిగ్రీలు అంతకన్నా లేవు. అయినా సరే, చిన్ననాటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి భర్త సాయంతో ముందడుగు వేశారామె. అలా 2015లో సింగపూర్‌ కేంద్రంగా ‘లిటిల్‌ పాడింగ్టన్‌’ పేరుతో ఓ ప్రీస్కూల్‌ని ప్రారంభించారు ప్రేరణ. అది మొదలు ఐదేళ్లలో వాటిని ఏడుకి చేర్చారు. ఆపై 2022లో ఆ దేశానికే చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ ఆఫిర్మా క్యాపిటల్‌కు 180 కోట్ల రూపాయలకు విక్రయించారు. అంతకు రెండేళ్ల ముందే అంటే కొవిడ్‌ సమయంలో పాఠశాల విద్య తీరుతెన్నులు మారడం గమనించిన ప్రేరణ గేమిఫైడ్‌ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారించారు.

ఏడాదిలో రూ.330 కోట్లు...

‘క్రియేటివ్‌ గెలీలియో’ పేరుతో 2022లో గేమింగ్‌ స్టార్టప్‌ని ప్రారంభించారు. ఇది 3-8 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించడానికి ఉద్దేశించిన స్టార్టప్‌. కంపెనీ ఉత్పత్తులలో ఎడ్యుకేషన్‌ వీడియోలు, ఆడియోబుక్‌లు, ఇంటరాక్టివ్‌ గేమ్‌లు, ఫోనిక్స్‌ ప్రోగ్రామ్‌లు వంటివెన్నో ఉన్నాయి. దీనికింద లిటిల్‌ సింగమ్‌ యాప్‌నీ తీసుకొచ్చారు. ఈ అప్లికేషన్‌ను భారత ఉపఖండంలో కోటిమందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘నేను ఈ రంగంలోకి అడుగుపెట్టే నాటికే దేశంలో ఈ తరహా స్టార్టప్‌లెన్నో ఉన్నాయి. అయితే, వాటిల్లో కొన్ని మాత్రమే ప్రీ స్కూల్‌ పిల్లలను ఆకర్షించేవి. ప్రారంభంలో బైజూస్‌, డిస్నీలతో కలిసి పనిచేశా. పెద్దగా మార్కెటింగ్‌ చేయకపోయినా మొదటి ఆరునెలల్లోనే ‘లిటిల్‌ సింగమ్‌’ యాప్‌ లక్షల్లో డౌన్‌లోడ్‌ అవ్వడం చూసి మొదట ఆశ్చర్యపోయా. రోజురోజుకీ ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఏడులక్షల మందికిపైగా ఉన్నారు. పిల్లలకిష్టమైన చక్ర, యంగ్‌ బాహుబలి, శక్తిమాన్‌, బిగ్‌బీస్‌ జూనియర్‌, తెనాలి రామ, కాలియ ది క్రో, బాల్‌ గణేష్‌, ఘటోత్కచ్‌ పాత్రలతో పాఠాలు చెప్పిస్తాం. దీనిద్వారా పిల్లలు సులువుగానూ, ఆసక్తిగానూ పాఠ్యాంశాలను నేర్చుకోగలుగుతారు. నాణ్యమైన విద్యను ఒంటపట్టించుకోగలరు’ అంటారామె. తర్వాతి కాలంలో ‘టూన్‌డెమీ’ పేరుతో మరో అప్లికేషన్‌నూ మార్కెట్లోకి తెచ్చారు. ఫండింగ్‌ రౌండ్‌లో సుమారు రూ.60 కోట్లు సమీకరించుకోవడంతోపాటు గతేడాది ఈ స్టార్టప్‌ విలువను 40 మిలియన్‌ డాలర్ల (రూ.330 కోట్లు)కు చేర్చారు ప్రేరణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్