పల్లె నుంచి ప్రపంచస్థాయికి!

ఆ అమ్మాయి స్కూల్‌ టాపర్‌... కానీ పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి... అయితే, అలానే ఉండిపోవాలనుకోలేదామె. తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది.

Updated : 06 Feb 2024 05:24 IST

ఆ అమ్మాయి స్కూల్‌ టాపర్‌... కానీ పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి... అయితే, అలానే ఉండిపోవాలనుకోలేదామె. తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. ‘వనోపాజ్‌’ అనే ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీని ప్రారంభించి తాను ఎదగటమే కాదు, ఎంతోమంది గ్రామీణ మహిళా రైతులకూ వ్యవసాయంలో మెలకువలు నేర్పుతోంది. ఆమే ఝార్ఖండ్‌కు చెందిన పుష్ప కుష్వాహ. వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేని అమ్మాయి అగ్రి- ఆంత్రప్రెన్యూర్‌గా ఎలా మారిందంటే...

దువుల్లో చురుగ్గా ఉండే పుష్ప... తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంటర్‌ అయిపోయిన వెంటనే, పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసుకుంది. పై చదువులు చదవాలనే కోరిక ఉన్నా, అత్తింటివాళ్ల ఆచారాలకు తలొగ్గింది. కానీ ఎలాగైనా చదువుకోవాలనే పట్టుదలతో స్థానిక కళాశాలలో దూరవిద్య ద్వారా డిగ్రీలో చేరింది. అప్పటికే తనకో పాప. ఇంటి పనులు చేసుకుంటూ, బిడ్డను చూసుకుంటూనే తనకున్న కొద్ది సమయంలోనే చదువుకుంటూ పొలిటికల్‌ సైన్స్‌లో పట్టా అందుకుంది.

మెరుగైన జీవితం కోసం...

ఒక మహిళకు ఆర్థిక స్వావలంబన ఎంత ముఖ్యమో అర్థం చేసుకుంది పుష్ప. అందులో భాగంగా ముందు స్వయం సహాయక సంఘంలో చేరి, క్రమంగా అందులో శిక్షకురాలిగా ఎదిగింది. అయితే తనే సొంతంగా ఎందుకు వ్యాపారం చేయకూడదని ఆలోచించి ‘వనోపాజ్‌’ అనే ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ(ఎఫ్‌పీసీ) స్థాపించింది. ఇందులో చేరిన సభ్యులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవటం, మార్కెటింగ్‌... వంటి సేవలెన్నింటినో పొందొచ్చు. ఆ తర్వాత ‘బెటర్‌ లైఫ్‌ ఫామింగ్‌’ అనే సంస్థతో కలిసి సన్నకారు మహిళా రైతులకు సేంద్రియ విధానం, పంట సంరక్షణా పద్ధతులు, ఎరువులను ఉపయోగించటం, నీటి నిర్వహణ వంటి వాటిల్లో శిక్షణ ఇప్పించేది. అవసరమైన వాళ్లకు రుణ సౌకర్యమూ కల్పించేది. తమ పంటకు మార్కెట్లో సరైన ధర లేకుంటే రైతులు వనోపాజ్‌ ద్వారా అమ్ముకోవచ్చు. అలాగే ఆ ఉత్పత్తులను శుద్ధి చేసి ఇతర బ్రాండ్‌లకూ అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించింది. అలా హజారీబాగ్‌లోని 3వేలమంది మహిళా ఆంత్రప్రెన్యూర్‌లకు శిక్షణనిచ్చి, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది పుష్ప. ‘‘మా గ్రామంలో 50 ఇళ్లుంటే అందులో 30 ఇళ్లలో మగవారు వేరే ప్రాంతాల్లో పనులు చేస్తుంటారు. ఇక వ్యవసాయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి మహిళలదే. అయితే మొదట నాకూ సాగుపై అవగాహన లేదు. కానీ వెనుదిరగాలనుకోలేదు. ఎవరైనా నువ్వు చేయలేవు అంటే కచ్చితంగా నేను ఆ పనిలో విజయం సాధించి చూపించేదాన్ని. అలా వ్యవసాయాన్నీ తీసుకున్నా’’ అంటోన్న పుష్ప తాజాగా జర్మనీలో జరగనున్న గ్లోబల్‌ ఫార్మర్‌ సర్వేకు మనదేశ ప్రతినిధిగా ఎంపికవటం హర్షించదగ్గ విషయమే కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్