స్నాక్స్‌తో... వంద కోట్ల వ్యాపారం

‘ఈరోజు స్నాక్స్‌ ఏం పెట్టాలి?’... స్కూలుకి వెళ్లే పిల్లలున్న ఏ తల్లినైనా అడగండి. ఇదెంత పెద్ద సమస్యో చెబుతుంది. ఎంత జాగ్రత్తగా చేసిపెట్టినా, బయటి ఆహారమే వారిని ఆకర్షిస్తుంది. వాటినే ఆరోగ్యంగా అందిస్తే? అన్న అహనా గౌతమ్‌ ఆలోచన ఎంతోమంది అమ్మలకు ఉపాధి కల్పించడమే కాదు... రూ.వంద కోట్ల వ్యాపారంగానూ మారింది.

Updated : 07 Feb 2024 06:59 IST

‘ఈరోజు స్నాక్స్‌ ఏం పెట్టాలి?’... స్కూలుకి వెళ్లే పిల్లలున్న ఏ తల్లినైనా అడగండి. ఇదెంత పెద్ద సమస్యో చెబుతుంది. ఎంత జాగ్రత్తగా చేసిపెట్టినా, బయటి ఆహారమే వారిని ఆకర్షిస్తుంది. వాటినే ఆరోగ్యంగా అందిస్తే? అన్న అహనా గౌతమ్‌ ఆలోచన ఎంతోమంది అమ్మలకు ఉపాధి కల్పించడమే కాదు... రూ.వంద కోట్ల వ్యాపారంగానూ మారింది.

‘రోజూ జిమ్‌లో గంటలు కష్టపడుతున్నా... బరువు తగ్గడం లేదేంటి?’ అని ఆలోచిస్తోన్న అహనాకి ‘ఈ చెత్త అంతా తింటూ... జిమ్‌లో చెమటోడిస్తే ఎలా తగ్గుతావ్‌’ అంటూ తన ముందున్న జంక్‌ఫుడ్‌ని చూపిందట ఆమె స్నేహితురాలు. స్నాక్స్‌కీ దీనికీ సంబంధమేముందని వాదించినా జిహ్వచాపల్యాన్ని కట్టడి చేసుకోలేకపోయింది. ఆరోగ్యమైనవేమైనా ఉన్నాయేమోనని ప్రయత్నిస్తే ఎన్నో రకాలు కనిపించాయి. ఆనందం పట్టలేక కొనుక్కుంది. ఆశ్చర్యంగా తన బరువులోనూ మార్పు రావడంతో తెగ సంబరపడిపోయింది. ఇంతలో ఆమె వదిన నుంచి ఫోన్‌! ‘పాపకి డయాబెటిస్‌ ఉంది. ఆరోగ్యకరంగా ఏం పెట్టాలో తెలియడం లేద’ని. అప్పటికే ఎంతోమంది నుంచి ఈ మాట విన్న అహనా అమెరికాలో తనకు దొరికినట్టే భారత్‌లోనూ అందిస్తే ఎలా ఉంటుంది అనుకుంది. దాని ఫలితమే 2019లో ముంబయిలో ప్రారంభించిన ‘ఓపెన్‌ సీక్రెట్‌’.

అమ్మల సైన్యంతో..

అహనాది రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌. ఐఐటీ ముంబయి నుంచి ఇంజినీరింగ్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక పీఅండ్‌జీ, జనరల్‌ మిల్స్‌ వంటి సంస్థల్లో ఉద్యోగం కూడా చేసింది. వ్యాపార ఆలోచన రాగానే రాజీనామా చేసి దేశానికి తిరిగొచ్చింది. ‘ఏం చేయాలన్న స్పష్టత ఉంది. ఎలా చేయాలన్న దానిపై దృష్టిపెట్టా. మెట్రో నగరాలన్నీ తిరిగి వేలమంది అమ్మలతో మాట్లాడా. ఏం ఇష్టం, ఎందుకిష్టం, నచ్చనివేంటి... అనడిగి సమాధానాలు తెలుసుకున్నా. మైదా, రసాయనాలు, కృత్రిమ రంగులు లేనివి తయారు చేయాలి, అమ్మలు, ఆడవారికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నా. మొదట కొంతమందిని నియమించుకుని కుకీల తయారీ ప్రారంభించా. మరో వందమంది అమ్మలేమో టేస్ట్‌ టెస్టర్స్‌. ఒకటీ రెండూ కాదు ఏకంగా వెయ్యి రకాల కుకీలు తయారు చేశాక చివరిది అందరికీ నచ్చింది. అదే మా తొలి ఉత్పత్తి. అలా ఒక్కోటీ చొప్పున 30 రకాల స్నాక్స్‌ తీసుకొచ్చా. ఉద్యోగానుభవం మెషినరీ, ఫైనాన్స్‌ అంశాల్లో అవగాహన తెచ్చింది. అమ్మకాలకే ప్రయోగాలు చేశా. మొదట షాపులన్నీ తిరిగి ఒక ర్యాక్‌ పెట్టుకుంటామని అడిగా. అందుకు కొంత చెల్లించా. అక్కడికొచ్చిన వినియోగదారులకు శాంపిల్‌ ప్యాక్‌లు ఉచితంగా ఇచ్చేవాళ్లం. తర్వాత వాళ్లే నచ్చి కొనడం మొదలుపెట్టారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ వేదికల్లో అమ్ముతున్నాం’ అంటుంది అహనా.

అమ్మ చనిపోయిన తర్వాతి రోజే..

‘తొలి ఏడాది రూ.3 కోట్ల వ్యాపారమైంది. తీరా చూస్తే లాక్‌డౌన్‌. సరకంతా పాడవుతుందనుకున్నా. పెరిగిన ఆరోగ్యస్పృహ మాకు కలిసొచ్చింది. దీంతో పెట్టుబడులొచ్చాయి. అంతా బాగుంది అనుకుంటే 2021లో అమ్మ చనిపోయింది. దహన కార్యక్రమాలైన రెండోరోజే ఇన్వెస్టర్‌తో మీటింగ్‌. బాధని అణచుకుని హాజరయ్యా. అక్కడ రెండేళ్లలో ఓపెన్‌ సీక్రెట్‌ని రూ.100 కోట్లకు చేరుస్తానన్నప్పుడు ఒకాయన ‘అతి విశ్వాసం పనికిరాద’న్నారు. నేనెదుర్కొన్న సవాళ్లు నాలో ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని ఆయనకి సమాధానమిచ్చా. అన్నట్టుగానే చేర్చా. ఆ విశ్వాసానికి కారణం అమ్మే. ఒంటరి తల్లి. అన్నయ్యతో సమానంగా నన్ను పెంచింది. ఐఐటీలో చేరతానన్నప్పుడు ‘అమ్మాయికి అంత పెద్ద కలలెందుకు’ అన్నా, ‘పెళ్లి చేయొచ్చుగా? ఉద్యోగం మాని వ్యాపారం చేస్తానంటే ఎలా ఊరుకుంటున్నావ్‌’ అన్నా అమ్మ ఒకటే చెప్పేది. ‘అమ్మాయిలు ఎందులో తక్కువ? వాళ్ల అంతిమ లక్ష్యం పెళ్లే ఎందుకవ్వాలి? తనేం చేస్తానన్నా అండగా నేనుంటా’ననేది. ఇన్వెస్టర్‌ మీటింగ్‌కి హాజరవడం నేను ఆమెకిచ్చిన నివాళే’ననే 35 ఏళ్ల అహనా లక్ష్యం ఓపెన్‌ సీక్రెట్‌ని యూనికార్న్‌ సంస్థగా తీర్చిదిద్దడమట. తన సంస్థలో ఎక్కువశాతం ఉద్యోగులు అమ్మలే. స్వశక్తితో ఎదిగే వారిని చూసి మరింత మంది అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడతారన్న కోరికతోనే వారికి ప్రాధాన్యమిస్తోన్నా అంటోన్న అహనా ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్