ఈశాన్య వంటకాలతో మాస్టర్‌ షెఫ్‌కి

ఈశాన్య సంస్కృతులనూ, స్థానిక వంటలనూ తన యూట్యూబ్‌ ఛానెల్‌తో అందరికీ తెలియజేస్తుంది. ఆ ప్రయాణంలోనే గత సంవత్సరం మాస్టర్‌ షెఫ్‌ ఇండియాలో రన్నరప్‌గా నిలిచింది... మేఘాలయకు చెందిన నంబీ జెస్సికా మరాక్‌. ఆమె కథ ఏంటో చూద్దాం.

Published : 08 Feb 2024 05:34 IST

ఈశాన్య సంస్కృతులనూ, స్థానిక వంటలనూ తన యూట్యూబ్‌ ఛానెల్‌తో అందరికీ తెలియజేస్తుంది. ఆ ప్రయాణంలోనే గత సంవత్సరం మాస్టర్‌ షెఫ్‌ ఇండియాలో రన్నరప్‌గా నిలిచింది... మేఘాలయకు చెందిన నంబీ జెస్సికా మరాక్‌. ఆమె కథ ఏంటో చూద్దాం.

న్‌లైన్‌ సౌకర్యం వచ్చాక ఇంటివంటపై ఆసక్తి చాలామందికి తగ్గిపోతోంది. కానీ నంబీ అలా కాదు వంటలు చేస్తూ అందరికి వాటిని చూపించాలనుకుంది. ఈమెది మేఘాలయలోని ఓ మారుమూల గ్రామం. అమ్మ దుస్తులపై డిజైన్లు వేసే వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. చిన్నతనంలో అమ్మపడే కష్టం చూడలేక తన వంతు సాయంగా ఇంట్లో అందరికీ వంట చేసేది నంబీ. అప్పటి నుంచి పాకశాస్త్రంపై మక్కువ పెంచుకుంది. పాఠశాల విద్య పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం చెన్నైకి వెళ్లింది. నంబీకి అక్కడ తమ వంటలు కనిపించలేదు. స్నేహితులను అడిగినా ఎవరు తెలీదనే చెప్పేవారు. ఈశాన్య రాష్ట్రాల వంటకాలు ఎవరికి తెలీదని గ్రహించిన నంబీ తమ ప్రాంత రుచులను అందరికీ పరిచయం చేయాలని ‘ఈట్‌ యువర్‌ కప్పా’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌తో అందరికి అర్థమయ్యేలా ఇంగ్లిష్‌ భాషను ఎంచుకుని ప్రారంభించింది. కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే సమయం దొరికినప్పుడల్లా తాజా కూరగాయలు, పండ్లు, మసాలాలు ఎలా ఎంచుకోవాలో, వాటిని ఎలా వండుకోవాలో చూపించేది. అంతేకాదు, స్థానిక తెగలు తినే వంటకాలూ పరిచయం చేసేది. ‘మొదట్లో చాలామంది అవమానించినట్లు కామెంట్లు పెట్టినా నెమ్మదిగా అందరూ ఆసక్తి కనబరిచారు. అలా ఫాలోయర్ల సంఖ్య అరవైవేలకు పెరిగింది. అప్పుడప్పుడూ సెలవులకు ఇంటికి వెళ్లి వీడియోలు తీసేదాన్ని. అక్కడ అంతర్జాల సదుపాయం లేకపోవడంతో చెన్నైకి వచ్చి ఎడిట్‌ చేసి అప్‌లోడ్‌ చేసేదాన్ని. తర్వాత సన్నీ ఆరోకియాదాస్‌ను పెళ్లి చేసుకున్నా. ఆయన ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌. ఆయన తమిళియన్‌ కావడంతో వారి వంటలనూ నేర్చుకున్నా’ అంటోంది నంబీ. ఈశాన్య భారతదేశ వంటకాలతో మాస్టర్‌షెఫ్‌ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది.

పాఠశాలను దత్తత తీసుకుంటూ..

అమ్మ ఆరోగ్యం బాలేక సొంతూరికి వచ్చేశాం. 150 మంది జనాభా ఉన్న మా గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఊరి మొత్తానికి ఎక్కువ చదువుకుంది నేనూ మావారే. కొవిడ్‌ కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలల్ని నడిపించలేకపోయారు. దాంతో గ్రామపెద్దలతో మాట్లాడి నేనూ, మావారూ మరికొంతమంది టీచర్లతో కలిసి అక్కడి పిల్లలకు పాఠాలు చెప్పాం. నర్సరీ నుంచి ఎనిమిది వరకూ ఇక్కడ తరగతులను నిర్వహిస్తూ.. సుమారు 85 మంది పిల్లలకు విద్యను అందిస్తున్నాం. వారి నుంచి నామమాత్రంగా రూ.300 ఫీజు మాత్రమే తీసుకుంటున్నాం, అది కూడా టీచర్లకు ఇవ్వడం కోసమే. ఖాళీ సమయంలో పొలం సాగు చేస్తూ నిమ్మగడ్డి నూనె, ఊరగాయలను విక్రయిస్తుంటాం. ఇలా వంటలను ప్రేమిస్తూ, పిల్లలకు చదువు చెప్పడం ఆనందంగా’ ఉందంటోంది నంబీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్