సాంకేతి‘కథా’నాయికలు!

ఆవిష్కరణలు, పరిశోధనలు, సైన్స్‌... లాంటి విషయాలు అమ్మాయిలకు ఒంటపట్టవనేది పాతమాట. మరిప్పుడో? సైన్స్‌ అంటే సై అంటున్నారు. పరిశోధనల్లోనూ ముందుంటున్నారు.

Updated : 11 Feb 2024 03:58 IST

మహిళలు, బాలికల అంతర్జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా

ఆవిష్కరణలు, పరిశోధనలు, సైన్స్‌... లాంటి విషయాలు అమ్మాయిలకు ఒంటపట్టవనేది పాతమాట. మరిప్పుడో? సైన్స్‌ అంటే సై అంటున్నారు. పరిశోధనల్లోనూ ముందుంటున్నారు. అందుకు ఉదాహరణే వీళ్లు. వయసుకు కళ్లెం వేయడం ఎలానో చెప్పి ఒకమ్మాయి ప్రపంచ విజేతగా నిలిస్తే... మరొకరు అంతరిక్ష పరిశోధనలకు ఏఐ జోడించి ఉమన్‌ అచీవర్‌ అవార్డుని  గెలుచుకున్నారు. ఇంకొకమ్మాయి పేద రైతుల కోసం ఇంధన అవసరం లేని వాహనాన్ని తయారుచేసి శభాష్‌ అనిపించుకుంది.. 


ఏఐ పరిజ్ఞానాన్ని జోడించి...

అంతరిక్ష పరిశోధనల్లో... ఇస్రో దూకుడు మనకు తెలిసిందే! ఈ పరిశోధనలకు ఏఐ పరిజ్ఞానం కూడా తోడైతే?  హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన ‘అడ్వాన్స్‌డ్‌ డేటా ప్రాసెసింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’(అడ్రిన్‌)లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సాయి వెంకటలక్ష్మి అంతరిక్ష పరిశోధనల్లో తనదైన ముద్రవేస్తున్నారు. ఆమెతో వసుంధర మాట్లాడింది... 

నాకు చిన్నతనం నుంచీ సైన్స్‌ అంటే ఇష్టం. అమ్మానాన్నల ప్రోత్సాహం కూడా తోడై తేలిగ్గానే... ఇస్రోలో అడుగుపెట్టగలిగా. మా సొంతూరు విశాఖపట్నం. నాన్న రైల్వేలో డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పుట్టపర్తిలో బీఎస్సీ చేశాక.. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌లో ఎంఫిల్‌ చేశా. పార్ట్‌టైమ్‌లో ఎంటెక్‌ చేశా. ఓ రోజు అనుకోకుండా మా ఫ్రెండ్‌ చేతిలో ఉన్న జిరాక్స్‌ కాపీని చూసి ఏంటని అడిగాను. ‘ఇస్రోలో ఇంజినీర్‌ పోస్టులు పడ్డాయి. నువ్వూ దరఖాస్తు చేయ’మని సలహా ఇచ్చింది. అలా పరీక్షలు రాసి 1997లో... హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన అడ్రిన్‌లో చేరాను. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ గ్రూప్‌కి సారథిగా పనిచేస్తున్నా. అంతరిక్ష పరిశోధనలను సులభతరం చేసేందుకు... ఏఐ పరిజ్ఞానాన్ని జోడించి సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు తయారుచేయడం మా పని. అలాగే స్పేస్‌ అండ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ విభాగాలకు అవసరమైన సాంకేతికతనూ అందిస్తాం. భూఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు మొదలుపెట్టిన ఎన్‌ఆర్‌ సెన్సస్‌ వంటి ప్రాజెక్టుల్లో మా పరిశోధనలు కీలకంగా పనిచేశాయి. అలాగే రీశాట్‌-1 కోసం... ప్రణవ్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు శాటిలైట్‌ సేవలకు అంతరాయం ఏర్పడకుండా ఉండటానికి... ఇంటర్నేషనల్‌ చార్టర్‌ ఆఫ్‌ స్పేస్‌, మేజర్‌ డిజాస్టర్‌ సంస్థతో కలిసి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. శాటిలైట్లు పంపించిన చిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకూ... ఏఐ పరిజ్ఞానాన్ని వాడుతున్నాం. కృతిమ మేధ, మెషిన్‌ లర్నింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు యంగ్‌ ఇంజినీర్‌ అవార్డునీ, ఉమన్‌ అచీవర్‌ అవార్డునీ అందుకోవడం గర్వంగా ఉంది.

 దేవేంద్రరెడ్డి కల్లిపూడి, శ్రీహరికోట


బామ్మ, తాతల కోసం ఆలోచించి..

బామ్మ, తాతలంటే ప్రాణం సియా గోదికకు. వాళ్లు క్యాన్సర్‌, పార్కిన్సన్‌ వ్యాధులతో పోరాడుతోంటే చూసి తట్టుకోలేకపోయింది. తన వంతుగా ఏదైనా చేయాలనుకున్న ప్రయత్నంలో రూ.3.3 కోట్లు గెలుచుకుంది.

సియాది బెంగళూరు. ఇంటర్‌ చదువుతోంది. పార్కిన్సన్స్‌, క్యాన్సర్‌ల మీద జరుగుతున్న పరిశోధనలను తెలుసుకునే క్రమంలో సియాకి ‘బ్రేక్‌త్రూ జూనియర్‌ ఛాలెంజ్‌’ గురించి తెలిసింది. దీన్ని ‘ఆస్కార్స్‌ ఆఫ్‌ సైన్స్‌’ అంటారు. పిల్లలకు సైన్స్‌ అంశాలపై ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో గూగుల్‌ కోఫౌండర్‌ సెర్గరీ బ్రిన్‌, ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌, అతని భార్య, ఇతర టెక్‌ సంస్థల అధిపతులు దీన్ని ప్రారంభించారు. 190 దేశాలకు చెందిన టీనేజర్లు దీనిలో పాల్గొంటారు. కష్టమైన సైన్స్‌, ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌ సిద్ధాంతాలను సులువుగా 2 నిమిషాల్లో వివరించడమే పోటీ. ‘2000లో జపాన్‌ శాస్త్రవేత్తలు యమనక ఫ్యాక్టర్స్‌ అనే ప్రత్యేక ప్రొటీన్లను కనుక్కొన్నారు. వీటితో మానవ శరీరంలో సాధారణ కణాలను మూల కణాలుగా మారుస్తున్నారు. ఈ పరిశోధనకు నోబెల్‌ బహుమతీ లభించింది. ఈ ప్రక్రియతో వృద్ధాప్య లక్షణాలు రాకుండా అడ్డుకోవడమే కాదు.. జీవన ప్రమాణాలను పెంచొచ్చు. దీన్ని ఈ పోటీలో భాగంగా వివరించడమే కాదు.. పార్కిన్సన్స్‌ వ్యాధిని తొలినాళ్లలోనే కనిపెట్టడానికి సాయపడే యాప్‌నీ కనిపెట్టా’ననే 17 ఏళ్ల సియా తన వీడియోతో ప్రతిదశలోనూ గట్టి పోటీనివ్వడమే కాదు, విజేతగానూ నిలిచింది. దాదాపు రూ.3.3 కోట్లను బహుమతిగా గెలుచుకుంది. అంతేకాదు ‘ఈ యాంటీ ఏజింగ్‌ పరిశోధన నిజజీవితంలో అమల్లోకి వచ్చేలా తోడ్పడతా’ననే సియా ‘సోల్‌ వారియర్స్‌’ పేరుతో ఎన్‌జీఓనీ నిర్వహిస్తోంది. డయానా అవార్డు సహా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో అందుకుంది.


పేద రైతుల కోసం... 

వ్యవసాయ పనుల కోసం పెద్దరైతుల దగ్గర ట్రాక్టర్లు ఉంటాయి. మరి చిన్న రైతుల సంగతేంటి? ట్రాక్టర్లని అద్దెకు తెచ్చినా వాటికయ్యే ఇంధనం ఖర్చు భరించాలి. వీటికి పరిష్కారంగా జీరో బడ్జెట్‌తో నడిచే సౌరశక్తి వాహనాన్ని కనిపెట్టింది సుహానీ చౌహాన్‌...

దిల్లీకి చెందిన 17 ఏళ్ల సుహానీ చౌహాన్‌ ఎనిమిదో తరగతిలో ఉండగా ఓసారి పల్లె ప్రాంతాలకు వెళ్లింది. అక్కడి రైతుల సాగు ఇబ్బందులు చూసి పెద్దయ్యాక వాళ్లకు ఉపయోగపడే ఆవిష్కరణ ఏదైనా చేయాలనుకుంది. ఇంటర్‌కొచ్చాక సౌరశక్తితో నడిచే ‘సో-ఆప్ట్‌’ అనే వాహనాన్ని రూపొందించింది. ఈ  వాహనాన్ని సౌర ఫలకాలతో రూపొందించడం వల్ల కాలుష్యాన్ని వెలువరించదు. ఏటా రూ.1,800 కోట్ల ఇంధనం ఆదా అవుతుందట. ‘ఈ వాహనంతో పొలానికి నీరు పెట్టడం, విత్తనాలు చల్లడం, గుంతలు తవ్వడం వంటి పనులూ చేసుకోవచ్చు’ అంటున్న సుహానీ ఈ ఆవిష్కరణకుగానూ జాతీయస్థాయిలో ఇచ్చే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌’ను అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్