తల్లిప్రేమ... వ్యవసాయం చేయించింది!

బిడ్డకు చిన్న దెబ్బతగిలితే తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది. దెబ్బ పిల్లలకి తగిలినా నొప్పి మాత్రం అమ్మకే వస్తుంది... అలాంటిది తన కన్నబిడ్డకు గుండెలో రంధ్రాలు ఉన్నాయని తెలిస్తే...? తల్లడిల్లిపోయిందా అమ్మ. గుండె నిబ్బరం చేసుకుని బాబుని బతికించుకుంది.

Updated : 12 Feb 2024 03:35 IST

బిడ్డకు చిన్న దెబ్బతగిలితే తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది. దెబ్బ పిల్లలకి తగిలినా నొప్పి మాత్రం అమ్మకే వస్తుంది... అలాంటిది తన కన్నబిడ్డకు గుండెలో రంధ్రాలు ఉన్నాయని తెలిస్తే...? తల్లడిల్లిపోయిందా అమ్మ. గుండె నిబ్బరం చేసుకుని బాబుని బతికించుకుంది. పిల్లాడి ఆరోగ్యం కోసం ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసింది. రైతుగా మారి ‘మడ్‌ టు మదర్‌’ పేరుతో సేంద్రియ ఆహార ఉత్పత్తులను పండిస్తోంది. వాటిని తన కొడుకు లాంటి ఎంతోమంది పిల్లలకు అందిస్తూ వారికి అమ్మగా మారిన శుభశ్రీ సంత్యా కథ తెలుసుకోవాలంటే..

శుభశ్రీది ముంబయి. బీటెక్‌ చదివింది. 2019లో రెండో కాన్పు జరిగింది. బాబు పుట్టాడు. పసివాడిని చూసుకుని మురిసిపోతున్న ఆ తల్లికి పిడుగులాంటి వార్త చెప్పారు డాక్టరు. పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రాలు ఉన్నాయని, వెంటనే శస్త్రచికిత్స చేయాలనీ తేల్చేశారు. అప్పటికి బాబు వయసు 5 నెలలు మాత్రమే. ఏడు గంటలు సుదీర్ఘ ఆపరేషన్‌ తర్వాత పిల్లాడు బతికి బయటపడ్డాడు. కానీ రసాయనాలు లేని ఆహారమే పెట్టాలని వైద్యులు సూచించారు. ‘సేంద్రియ కూరగాయలు మార్కెట్‌లో దొరకడం కష్టం. అందుకే నేనే కాయగూరలను పండించాలనుకున్నా. ఎలా పెంచాలో ఆన్‌లైన్‌లో వెతకడం మొదలుపెట్టా. మొక్కల పెరుగుదలకీ, పంట దిగుబడికీ ఏ వాతావరణం బాగుంటుంది? ఏ మట్టిని ఉపయోగించాలి? వంటగది వ్యర్థాల నుంచి కంపోస్ట్‌ ఎలా తయారుచేయాలి? వంటివాటి గురించి ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఆరునెలల కోర్సు చేశా. అందులో భాగంగా శాస్త్రవేత్త జి.నమ్మాళ్వార్‌ వ్యవసాయంలో కొత్త మెలకువలు నేర్పించారు. అలా బియ్యం, చిరుధాన్యాలను సేంద్రియ పద్ధతిలో పండించడం నేర్చుకున్నా. అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో మొదట ఆకుకూరలు, కాయగూరలను పెంచడం మొదలుపెట్టా’. అంటారీమె.

పోషకాల ఉత్పత్తులు...

మొదట నర్సరీ నుంచి వానపాములను, వంటగది వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసుకుని వాడేదాన్ని. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టేదాన్ని. అవి చూసి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు నన్ను అనుసరించడం మొదలుపెట్టారు. చాలామంది సేంద్రియ కాయగూరలు కావాలని మెసేజ్‌లు పెట్టేవారు. నేను పండించేవి మాకు మాత్రమే సరిపోయేవి. దాంతో ఖలాపూర్‌లో ఎకరం భూమి కొనుగోలు చేసి సేంద్రియ పద్ధతిలో మిల్లెట్స్‌, కాయగూరలను పండించేదాన్ని తరవాత వాటిని ఉపయోగించి ఆహార ఉత్పత్తులను తయారుచేయడం ప్రారంభించా. అన్ని రుతువుల్లోనూ సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉండే పోషకాహారాన్ని గంజి రూపంలో తయారుచేయడం మొదలుపెట్టా. పోషకాల విలువ పెంచడానికి గుడ్డు, పప్పులు మొదలైన వాటిని జోడిస్తాం. ప్రతీ ప్యాక్‌లోనూ కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ప్రొటీన్‌... ఇలా అన్ని పోషకాలూ ఉండేలా చూసేదాన్ని. అందుకు దాదాపు ఆరు నెలలు సమయం పట్టింది. ఉద్యోగాలు చేస్తూ వండటానికి టైం సరిపోని తల్లిదండ్రులనూ, పిల్లలనూ దృష్టిలో ఉంచుకుని వీటిని తయారు చేస్తున్నాం. ఈ గంజి తయారికి ఎర్రబియ్యం, నల్లబియ్యం, మిల్లెట్లను ఎంచుకున్నా. జీరో ప్రిజర్వేటివ్స్‌తో తయారుచేస్తున్నా. ప్యాకింగ్‌ కూడా పర్యావరణహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. మా ఉత్పత్తులు క్యాన్సర్‌, దీర్ఘకాలిక సమస్యలున్న పిల్లలకూ, పెద్దలకూ మంచి పోషకాహారం’. అంటారు శుభశ్రీ. తను తయారుచేసే ఆహార పదార్థాలు అందరికీ అందాలని లాభాలు సైతం పక్కన పెట్టి, అందుబాటు ధరలో విక్రయిస్తున్నారు. ఆమె అమ్మ మనసు నిజంగా గొప్పదే కదూ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్