కష్టాలతో ‘ఫుట్‌బాల్‌’ ఆడుతోంది..

బిరాస్‌ ముని... ఝార్ఖండ్‌లోని గిరిజన తెగలకు చెందిన అమ్మాయి. ఓ ఇటుకల బట్టీలో బాలకార్మికురాలు. ఒకప్పుడు అధికారులు రక్షించిన ఆరేళ్ల పాప. నేడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా ఎదగటమే కాదు... మరి కొంతమందికి కోచ్‌గానూ మారింది.

Updated : 19 Feb 2024 16:26 IST

బిరాస్‌ ముని... ఝార్ఖండ్‌లోని గిరిజన తెగలకు చెందిన అమ్మాయి. ఓ ఇటుకల బట్టీలో బాలకార్మికురాలు. ఒకప్పుడు అధికారులు రక్షించిన ఆరేళ్ల పాప. నేడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా ఎదగటమే కాదు... మరి కొంతమందికి కోచ్‌గానూ మారింది. ఎలా అంటే..

అది బెంగాల్‌లోని హుగ్లీ నదీ పరిసర ప్రాంతం. అక్కడ ఓ ఇటుకల బట్టీలో చాలామంది చిన్నారులు చిట్టి చేతులతో ఇటుకలు మోస్తున్నారు. వాళ్లకు బడి, చదువు అంటే ఏంటో కూడా తెలియదు. కానీ అక్కడకు వెళ్లిన ఆషా (అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ హ్యూమన్‌ అవేర్‌నెస్‌) అధికారులకు తెలిసిందేంటంటే...వాళ్లంతా ఝార్ఖండ్‌లోని కుంతి, సిందెగా, గుమ్లా, లోహార్‌దగా వంటి గిరిజన ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా అయిన వాళ్లని. బాల కార్మికులని. తినడానికి తిండి, చదువు, పరిశుభ్రత.. కనీస సౌకర్యాలు లేని పరిస్థితిలో ఉన్నారంతా. వాళ్లని ఝార్ఖండ్‌ తీసుకువచ్చి, స్కూళ్లలో చేర్పించారు. మూడు ఆషా సెంటర్లలో వసతి ఏర్పాటుచేశారు. అలా ఆ రోజు రక్షించిన 200 మంది చిన్నారుల్లో ఒకరు బిరాస్‌ముని. అప్పటికి తన వయసు ఆరేళ్లు. ఆమెని రాంచీలోని ఓ పాఠశాలలో చేర్చారు. అలా చదువుతోన్న సమయంలోనే తనకు ఫుట్‌బాల్‌ క్రీడపై ఆసక్తి ఏర్పడింది. క్రమంగా అందులో ప్రావీణ్యమూ సంపాదించింది. అనేక జాతీయ స్థాయి టోర్నమెంట్లలోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆర్ట్స్‌లో డిగ్రీ చదువుతోన్న బిరాస్‌ముని తను చదివిన స్కూల్లోని 50మంది అమ్మాయిలకు శిక్షణనిస్తోంది. ‘‘సమాజం నాకు చాలా చేసింది. ఈ విద్యార్థినులకు శిక్షణ ఇవ్వటం ద్వారా నేనూ తిరిగి సమాజానికి సేవ చేస్తున్నట్లు భావిస్తున్నా.’’ అంటోన్న బిరాస్‌ముని ఫుట్‌బాల్‌లో మరింత ముందుకు వెళ్లటమే తన లక్ష్యమని చెబుతోంది. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పట్టుదలతో ఆటల్లో రాణిస్తోన్న ఈ అమ్మాయి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్