చలి బాధ...కోట్లు కురిపిస్తోంది!

ఒక ఆలోచన జీవితాన్నే మారుస్తుందంటారు. అలాంటి ఆలోచన ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అలా ఓ రోజు చలితో ఇబ్బంది పడ్డ భావనకు ఓ సృజనాత్మక ఆలోచన తట్టింది.

Updated : 20 Feb 2024 04:37 IST

ఒక ఆలోచన జీవితాన్నే మారుస్తుందంటారు. అలాంటి ఆలోచన ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అలా ఓ రోజు చలితో ఇబ్బంది పడ్డ భావనకు ఓ సృజనాత్మక ఆలోచన తట్టింది. దాన్నే తన వ్యాపార సూత్రంగా మలచుకుని ‘వార్మీ’ పేరుతో బాడీ వార్మర్లను తయారు చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాన్నీ ఆర్జిస్తోంది. ఆ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!.

భావనది ముంబయి. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. తండ్రిది ఫోర్‌ వీలర్‌ యాక్సెసరీస్‌ బిజినెస్‌. వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబమైనా... తన కాళ్ల మీద తను నిలబడాలన్న తపనతో సొంతంగా ముంబయిలోనే టూ వీలర్‌ డీలర్‌షిప్‌ స్టోర్‌ను ప్రారంభించింది. భర్త కెమికల్‌ ఇంజినీర్‌. అయితే 2005లో తన బాబు ఆలనాపాలనా చూసుకోవటం కోసం వ్యాపారాన్ని పక్కనపెట్టేసింది. ఆ సమయానికి తన వార్షికాదాయం రూ.2కోట్లకు పైమాటే. అయితే తను వ్యాపార రంగంలో లేకున్నా పెట్టుబడులు పెట్టడం మాత్రం ఆపలేదు.

ఆ చలివల్లే..

‘నేను చలిని అసలు తట్టుకోలేను. అటువంటిది ఓసారి కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్‌ విహారయాత్రకు వెళ్లా. నా భర్త, కొడుకు బయట సరదాగా ఆడుకుంటుంటే నేను మాత్రం చలికి బయటకు రాలేక లోపలే కూర్చుండిపోయా. అక్కడ కెఫేలో కూర్చున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఇటువంటి శీతల ప్రదేశాల్లో మనకు వేడినందించే ఏదైనా పరికరం ఉంటే బావుండనిపించి, అది మనమే ఎందుకు తయారుచేయకూడదనుకున్నా. వెంటనే ఆ ఆలోచనను నా భర్తతో పంచుకున్నా. తన సాయంతో 2013లో ‘వార్మీ’ని లాంచ్‌ చేశా.’ అంటోన్న భావన బాడీ, హ్యాండ్‌, ఫుట్‌ వార్మర్లు తయారుచేశారు. జనాలకు ఈ ఉత్పత్తుల గురించి తెలియజేయడానికి చాలా సమయం పట్టింది. వీటి ప్రయోజనాలు తెలిశాక వినియోగదారులు పెరిగారు. మొదటి ఏడాది రూ.2కోట్ల టర్నోవర్‌ వచ్చింది. 2022లో ‘నైష్‌ డాట్‌ ఇన్‌’ పేరుతో ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్‌ చేసి, వార్మీ ఉత్పత్తులతో పాటు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన బ్లూహీట్‌ పెయిన్‌ రివీలర్లనూ ప్రవేశపెట్టారు. అందులో థెరపీ ప్యాచెస్‌, మెడ, భుజం¨, మోకీలు, నెలసరి నొప్పిని తగ్గించే ప్యాచ్‌లు విక్రయిస్తారు. ఇవి ఆటోమేటిక్‌గా వేడిని ఉత్పత్తి చేసుకుని, ఎనిమిది గంటలపాటు పనిచేస్తాయి. ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ, అహ్మదాబాద్‌ వంటి ప్రాంతాల్లో వీటికి ఆదరణ బాగా ఉంది. ప్రస్తుతం ఏడాదికి రూ.15కోట్ల టర్నోవర్‌ అందుకుంటుందీ సంస్థ. ‘సెలవులు, పనిమీద లేదా చదువులకోసం విదేశాలకు వెళ్లే వారికి మా ఉత్పత్తులు అందాలనేది నా లక్ష్యం’ అంటోన్న భావన ఫిట్‌నెస్‌కీ అధిక ప్రాధాన్యమిస్తారు. 45ఏళ్ల భావన గత 18సంవత్సరాల నుంచీ వ్యాయామాన్ని ఎప్పుడూ వదల్లేదట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్