జానీ జానీ... ఎస్‌ పాపా!

పదో తరగతిలో ఏడు సబ్జెక్టులు ఫెయిల్‌!  లండన్‌లో చక్కని కెరియర్‌ వదులుకుంది...  డిజైనర్‌ అవుతుందనుకుంటే స్టాండప్‌ కమెడియన్‌ అయ్యింది. ఇలా జేమీ వాళ్ల నాన్నకి చాలా షాక్‌లే ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటూ తన హాస్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆమే... హాస్యనటుడు జానీలీవర్‌ కూతురు జేమీలీవర్‌.

Updated : 21 Feb 2024 07:08 IST

పదో తరగతిలో ఏడు సబ్జెక్టులు ఫెయిల్‌!  లండన్‌లో చక్కని కెరియర్‌ వదులుకుంది...  డిజైనర్‌ అవుతుందనుకుంటే స్టాండప్‌ కమెడియన్‌ అయ్యింది. ఇలా జేమీ వాళ్ల నాన్నకి చాలా షాక్‌లే ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటూ తన హాస్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆమే... హాస్యనటుడు జానీలీవర్‌ కూతురు జేమీలీవర్‌. ఈ తెలుగమ్మాయి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. జేమీ మాత్రం స్టాండప్‌ కమెడియన్‌, నటి, డాన్సర్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుని తెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌ హాస్యనటుడు జానీలీవర్‌ గురించి తెలియని వాళ్లుండరు. అతని కూతురే జేమీ. స్టార్‌కిడ్‌ కాబట్టి అవకాశాలు వచ్చాయిలే అనుకుంటే పొరపాటు. స్టాండప్‌ కమెడియన్‌గా తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డా అంటోంది జేమీ. ‘నేను పుట్టి, పెరిగింది ముంబయిలోనే అయినా మేం తెలుగు వాళ్లమే. అమ్మ సుజాత. తమ్ముడు జెస్సీ. నాన్న జాన్‌ప్రకాశ్‌రావు జనుమాల. అలా అంటే గుర్తుపట్టకపోవచ్చు జానీలీవర్‌ అంటే గుర్తుపడతారు. తన హాస్యంతో ప్రపంచాన్నే నవ్వించారాయన. నాలోనూ ఆ కళాభిమానం ఉంది. అందుకే సంగీతం, నటన అంటే ప్రాణం పెట్టేదాన్ని. అయితే అప్పట్లో నాన్న సినిమా రంగంలో స్థిరపడ్డానికి చాలా కష్టపడ్డారు. వెయ్యి షోలు చేశాకనే నాన్న ఎవరా అని ఆరా తీశారట బాలీవుడ్‌లో. ఓపక్క ఆర్టిస్ట్‌గా నిరూపించుకుంటూనే... బతుకుతెరువు కోసం హిందుస్తాన్‌ యూనీలీవర్‌ సంస్థలో పనిచేశారు. అలా ఆయన పేరులోకి లీవర్‌ వచ్చింది. నేను కూడా అలా కష్టపడకూడదని బాగా చదివించాలనుకున్నారు. జమ్నాబాయ్‌నార్సీ స్కూల్లో చదువుకున్నా. పదో తరగతిలో ఏడు సబ్జెక్టులు ఫెయిల్‌. కానీ అన్ని టాలెంట్‌ టెస్టుల్లో టాప్‌. అమ్మని అడ్డం పెట్టుకుని నాన్నకి ఎంత చెప్పినా వినలేదు. చదవాల్సిందే అన్నారు. దాంతో తప్పదని జైహింద్‌ కాలేజీలో మాస్‌ మీడియాలో డిగ్రీ చేశా. ఆ తర్వాత లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ కాలేజీ నుంచి మార్కెటింగ్‌ కమ్యునికేషన్స్‌లో డిగ్రీ చేసి... విజన్‌గెయిన్‌ సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కెరియర్‌ మొదలుపెట్టా. కానీ మనసు మాత్రం సంగీతం, పాటలు... థియేటర్‌ ఆర్ట్‌ అంటూ పరుగులు పెట్టేది. నాన్న ఓసారి తన షో కోసం లండన్‌ వచ్చారు. నాలోని తపన పసికట్టి... నన్ను పరీక్షిద్దామని ఓ పదినిమిషాల సమయమిచ్చి తనని అనుకరించకుండా ప్రేక్షకుల్ని నవ్వించమన్నారు. మొదట్లో భయపడ్డా... లండన్‌లో స్థిరపడ్డ భారతీయులని అనుకరించి పదినిమిషాల పాటు వాళ్లని కడుపుబ్బా నవ్వించా. అది నా తొలివిజయం’ అంటూ జేమీ తన కెరియర్‌ తొలిరోజులని గుర్తుచేసుకుంది.

కష్టమైన జాబ్‌ ఇదే...

తండ్రిలాగా స్టాండప్‌ కమెడియన్‌గా రాణించాలని తన కెరియర్‌ని వదులుకుని ముంబయికి తిరిగొచ్చింది జేమీ. కామెడీ స్టోర్‌, కామెడీ సర్కస్‌కే మహాబలి వంటి షోల ద్వారా తనని తాను నిరూపించుకుంది. ఆ తర్వాత... హౌస్‌ఫుల్‌-4, భూత్‌పోలీస్‌, యాత్రీస్‌ వంటి చిత్రాల ద్వారా నటిగానూ ఎదిగింది. పాప్‌కౌన్‌ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. ఇన్‌స్టాలో 14 లక్షలమంది అభిమానుల్నీ సంపాదించుకుంది. తండ్రితో కలిసి 300పైగా షోలు చేసింది. ‘స్టాండప్‌ కమెడియన్‌గా రాణించడం అంత కష్టమైన పని మరొకటి లేదు. నాకు తెలిసి అత్యంత సాహసోపేతమైన జాబ్‌ ఇదే. మీ జోకులకి ఆడియన్స్‌ నవ్వకపోతే... మీ పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల నాడి పట్టుకోవాలి. ముఖ్యంగా మనపై మనకి నమ్మకం ఉండాలి. ప్రతి షో వన్‌డే మ్యాచ్‌లా ఉత్కంఠగా ఉంటుంది. చివరి వరకూ టెన్షన్‌ పడాలి. నాన్న నాకిచ్చిన సలహా... ‘ఎవ్వరినీ అనుకరించకు. నేర్చుకోవడం ఆపకు’. ఈ సూచనలు పదేళ్ల కెరియర్‌లో నన్ను నేను నిరూపించుకొనే అవకాశం ఇచ్చాయి. మొదట్లో చిన్న క్లబ్స్‌లో కామెడీ చేసేదాన్ని. ఆ తర్వాత టీవీ షోల్లో అవకాశం వచ్చింది. సోషల్‌మీడియా మరింత మందిని చేరువ చేసింది. స్టాండప్‌ కామెడీ అబ్బాయిలకే పరిమితం అన్న అభిప్రాయం పోయి... అమ్మాయిలూ రాణిస్తారు అనే పేరొచ్చింది. ఇందులో అదితి మిట్టల్‌, భారతీ సింగ్‌, కుషా కపిల, డాలీసింగ్‌, అనీషాదీక్షిత్‌ వంటివారి పాత్రా ఎక్కువే. ఎంత చేసినా నాకో వెలితి ఉంది. అది నా మాతృభాష తెలుగులో నటించాలని. ఎందుకంటే మా నాయనమ్మకి తెలుగు మాత్రమే వచ్చు. హిందీ రాదు. తనకోసమే తెలుగులో నటించా. త్వరలో రానున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో మీకు పరిచయం అవుతున్నా’ అంటోంది జేమీ జనుమాల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్