ఇంటి నుంచే న్యాయ సేవలు!

ఆస్తి గొడవలు, వ్యాపారంలో వివాదాలు... ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో న్యాయసలహా అవసరమవుతుంది. కానీ ఇలాంటప్పుడు కాళ్లరిగేలా తిరగాలన్న సలహా వినిపిస్తుంది. ఆ శ్రమ తగ్గిస్తూ, ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చా అని ఆలోచించింది శ్రేయా శర్మ. ఆ చిన్ని ఆలోచన రెండేళ్లలో రూ.కోటిన్నర వ్యాపారంగా మారింది.

Updated : 23 Feb 2024 05:20 IST

ఆస్తి గొడవలు, వ్యాపారంలో వివాదాలు... ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో న్యాయసలహా అవసరమవుతుంది. కానీ ఇలాంటప్పుడు కాళ్లరిగేలా తిరగాలన్న సలహా వినిపిస్తుంది. ఆ శ్రమ తగ్గిస్తూ, ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చా అని ఆలోచించింది శ్రేయా శర్మ. ఆ చిన్ని ఆలోచన రెండేళ్లలో రూ.కోటిన్నర వ్యాపారంగా మారింది. ఇంతకీ తనకిదెలా సాధ్యమైందంటే... పాతికేళ్ల శ్రేయా ప్రయాణాన్ని చదివేయాల్సిందే!

వ్యాపార కుటుంబం... సహజంగానే న్యాయ సలహాలు అవసరమవుతాయి. కాస్త కలిగిన కుటుంబమే కాబట్టి, వాళ్లు పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఇతరుల సంగతి అలా కాదన్న విషయాన్ని గ్రహించింది పుణెకి చెందిన శ్రేయ. అన్ని కేసులూ ఒక్కరే వాదించలేరు. ఈ విషయం తెలియక కొందరు కాళ్లు అరిగేలా తిరగడం గమనించిందీమె. దానికేదైనా పరిష్కారం ఉందేమో చాలానే వెదికింది కానీ లాభం లేదు. న్యాయవాది అవ్వాలి, సొంత సంస్థను ప్రారంభించాలన్నది శ్రేయ కల. ఉన్నతవిద్య కోసం యూకేకి వెళ్లింది. అక్కడ న్యాయ సమాచారమంతా సామాన్యులకు అందుబాటులో ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అలాంటి వ్యవస్థను మనదగ్గరా సామాన్యులకు అందుబాటులోకి తేవాలనుకుంది. చదువు పూర్తయ్యి భారత్‌కి తిరిగొచ్చాక 2021లో ‘రెస్ట్‌ ద కేస్‌’ (ఆర్‌టీసీ) అనే ఆన్‌లైన్‌ సేవల సంస్థని ప్రారంభించింది.

ఇంటినే ఆఫీసుగా మలుచుకుంది. భిన్న కేసులను వాదించే లాయర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చింది. ఈమె సంస్థ న్యాయవాదులకు, క్లయింట్లకు మధ్య వారధిగా పనిచేస్తుంది. క్లయింట్లతో మాట్లాడి వాళ్ల అవసరాలు, స్థోమతను బట్టి లాయర్‌ని సూచిస్తుంది. ఇందుకు కొంత మొత్తం తీసుకుంటుంది. రెండేళ్లలో సంస్థని రూ.ఒకటిన్నర కోట్లకు చేర్చింది. ‘ముందుగా ఒక బ్రోచర్‌నీ తయారు చేసుకున్నా. మా సంస్థలో చేరడం వల్ల లాభాలేంటో తెలియజేస్తూ ఒక్కో లాయర్‌ చుట్టూ తిరిగా. ‘నీకిదేం హాబీ? చక్కగా ఉద్యోగం చేసుకోక’ అన్న సలహాలొచ్చేవి. నేనిది సీరియస్‌ వ్యాపారంగానే చేస్తున్నా అని ఒప్పించడానికి చాలా కష్టపడ్డా. తొలి లాయర్‌ని చేర్చుకోవడానికి నెలరోజులు పట్టింది. కానీ నేను బాధపడలేదు. ఓపికగా ప్రయత్నించా’ననే శ్రేయ సంస్థలో 1500 మంది లాయర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 150కిపైగా నగరాల్లో ఆమె సేవలు అందుబాటులో ఉన్నాయి. కేసునిబట్టి క్లయింట్లతో మాట్లాడతారు. మొత్తం అవగాహన వచ్చాక ఏవిధంగా సాగాలన్న దాన్నిబట్టి, లాయర్‌ని సూచిస్తుందీ సంస్థ. లాయర్‌ నియామకం అయ్యేవరకూ ఉచిత సేవలే అందిస్తారు. లాయర్లకు సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది.

ప్రజలకు కనీస చట్టాలు తెలిసుండాలి అంటుందీమె. అందుకే వాటి వివరాలతోపాటు న్యాయ విద్యార్థులకు పాఠాలు, లా సంబంధిత వార్తలు, ఇంటర్న్‌షిప్‌ వివరాలనీ ఉంచుతుంది. ‘న్యాయ సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంటి నుంచే న్యాయసలహా పొందాలన్నది నా లక్ష్యం. ఇప్పటివరకూ 2500 మందికి సాయమందించా’మని గర్వంగా చెబుతోంది. ఒక్కరితో ప్రారంభమైన తన సంస్థలో ఇప్పుడు పదుల సంఖ్యలో ఉద్యోగులున్నారు. సొంత ఆఫీసునీ ఏర్పాటు చేసుకుంది. ఏ పని చేయాలనుకున్నా వైఫల్యాలు సాధారణమే. వాటిని పట్టుదలగా దాటితేనే విజయం అంటోన్న శ్రేయ పిల్లల ఉత్పత్తులకు సంబంధించిన సంస్థనీ నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్