వంటింట్లోనే పుట్టగొడుగులు పెంచేయొచ్చు..

పుట్టగొడుగుల పెంపకం అంటే అమ్మో.. అదో పెద్ద పని.. అనుకుంటామంతా. అయితే పృథ్వీ తయారుచేసిన కిట్స్‌ను వంటింటి కిటికీలో ఉంచి నీటిని చల్లితే చాలు.

Updated : 27 Feb 2024 01:34 IST

పుట్టగొడుగుల పెంపకం అంటే అమ్మో.. అదో పెద్ద పని.. అనుకుంటామంతా. అయితే పృథ్వీ తయారుచేసిన కిట్స్‌ను వంటింటి కిటికీలో ఉంచి నీటిని చల్లితే చాలు. పదిరోజుల్లో తాజా మష్రూమ్స్‌ వంటకు సిద్ధమవుతాయి. దేశవిదేశీరకాల పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుకునే సౌలభ్యాన్నిస్తున్న ఆమె స్టార్టప్‌ గురించి తెలుసుకుందామా..

దిల్లీలో ఫిలాసఫీ కోర్సు చేసిన పృథ్వీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. దీంతో బెంగళూరులోని ఓ స్టార్టప్‌లో ఉద్యోగానికి చేరింది. కొవిడ్‌ సమయంలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంతోపాటు హృద్రోగాలను దరి చేరనివ్వని ఎగ్జోటిక్‌ పుట్టగొడుగులు కొనడానికి ప్రయత్నించింది. కనీసం వీటి సప్లిమెంట్స్‌ దొరుకుతాయేమోనని మార్కెట్‌లో గాలించింది. అదే ఆమెకు ఓ కొత్త ఆలోచనిచ్చింది. పుట్టగొడుగుల్ని ఎవరికివాళ్లు ఇంట్లోనే పెంచుకునేలా చేయాలనుకుంది పృథ్వీ. ‘స్నేహితుడు జషీద్‌తో కలిసి ‘బెంగళూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ రిసెర్చ్‌(ఐఐహెచ్‌ఆర్‌)’లో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకున్నాం. ఏడాదిపాటు అధ్యయనం, పరిశోధనలు చేపట్టాం. చెత్త, వ్యవసాయ వ్యర్థాల్లో పుట్టగొడుగులు పెరుగుతాయని, వాటిని తినడం వల్ల అనారోగ్యాలొస్తాయని మరికొందరు చెప్పేవారు. దీనిపై అవగాహన కల్పించాలనిపించింది. వీటిని తేలికగా పెంచేలా ‘డై మష్రూమ్‌ కిట్‌’ డిజైన్‌ చేశాం. జషీద్‌, నేనూ..పొదుపు చేసిన రూ.30 లక్షలతో 2021లో బెంగళూరులో ‘నువెడో’ ప్రారంభించాం’ అంటుంది పృథ్వీ.

కిట్‌లో... పుట్టగొడుగులను కిట్‌ ద్వారా సొంతంగా పండించుకోవడంపై వర్క్‌షాపులు నిర్వహిస్తోంది పృథ్వీ. ‘దీని కోసం మేం డిజైన్‌ చేసిన కిట్‌ చిన్నగా ఉంటుంది. అందులోనే చిన్న స్ప్రే సీసా, కార్డ్‌బోర్డు బ్యాగు ఉంటాయి. సీసాలో నీటిని నింపి కార్డ్‌బోర్డు బ్యాగుపై రోజుకి మూడుసార్లు స్ప్రే చేస్తుండాలి. ఇందులో దారపు పోగుల్లాంటి శిలీంధ్రం పెరిగి, పుట్టగొడుగుల ఎదుగుదలకు మాధ్యమంగా పని చేస్తుంది. పది రోజులయ్యేసరికి సేంద్రియంగా మష్రూమ్‌ పెరుగుతుంది. వంటింటి కిటికీలో ఈ కిట్‌ నుంచి తాజా పుట్టగొడుగులు పెంచొచ్చు. ప్రస్తుతం వీటికి ఆన్‌లైన్‌ వేదికగా దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నా’యంటోంది పృథ్వీ.    

దేశవిదేశీ రకాలన్నీ..

నువెడో కిట్స్‌ ద్వారా వైట్‌, పింక్‌, కింగ్‌ ట్యూబర్‌, గోల్డెన్‌ ఆయిస్టర్‌, హై ప్రొటీన్‌ ఆయిస్టర్‌, లయన్స్‌వంటి దేశవిదేశీ రకాల పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుకొనేలా చేస్తోందీమె. ఎరువులతోపాటు మష్రూమ్‌ పొడులూ, డ్రైయిడ్‌ మష్రూమ్స్‌ తయారు చేస్తున్నారు. గతేడాది రూ.50 లక్షల ఆదాయాన్ని అందుకుందీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్