అడ్డంకుల్ని దాటి... ఆడేస్తున్నారు!

‘ఇక కెరియర్‌ ముగిసినట్లే!’ ముప్పైకి దగ్గరపడ్డారో లేదో క్రీడాకారిణుల గురించి వినపడే మాటే ఇది! అది తప్పని నిరూపిస్తున్నారు వీళ్లు. తొలి మ్యాచ్‌లోనే తనేంటో సజన దేశమంతటికీ నిరూపిస్తే... అమ్మయ్యాకా రాణించొచ్చని రుజువు చేస్తోంది స్నేహదీప్తి.

Updated : 27 Feb 2024 07:02 IST

సెకండ్‌ ఇన్నింగ్స్‌..

‘ఇక కెరియర్‌ ముగిసినట్లే!’ ముప్పైకి దగ్గరపడ్డారో లేదో క్రీడాకారిణుల గురించి వినపడే మాటే ఇది! అది తప్పని నిరూపిస్తున్నారు వీళ్లు. తొలి మ్యాచ్‌లోనే తనేంటో సజన దేశమంతటికీ నిరూపిస్తే... అమ్మయ్యాకా రాణించొచ్చని రుజువు చేస్తోంది స్నేహదీప్తి. తాజాగా డబ్ల్యూపీఎల్‌లో రాణిస్తోన్న వీరి స్ఫూర్తి గాథలివీ...

ముందుకు సాగనా, తిరిగి ఇంటికెళ్లనా, గత ఏడాది డబ్ల్యూపీఎల్‌కి ముందు ఇలాగే ఆలోచించింది స్నేహ దీప్తి. రెండేళ్లయినా నిండని పసిది తనకోసం ఏడుస్తోంటే ఆ అమ్మ మనసు ఊరుకోలేదు మరి. ‘పర్లేదు... పాపని చూసుకునే పూచీ నాద’న్న భర్త భరోసాతో మైదానంలోకి అడుగుపెట్టింది. రెండోసారి డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ జట్టుకు ఎంపికైంది. ఈసారీ నిరూపించుకొని దేశం తరఫున ఆడాలన్నది ఈ అమ్మ ఆశ. ఈమెది వైజాగ్‌. తమ్ముడు క్రికెట్‌ ఆడుతోంటే సరదాగా చూడటానికి వెళ్లిన స్నేహ తనూ ప్రేమలో పడింది. ఆంధ్రా జట్టుతో ప్రారంభించి, 16 ఏళ్లకే జాతీయ జూనియర్‌ జట్టులోకి అడుగుపెట్టింది. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి రైల్వేలో కొలువు సాధించింది. ఇంతలో ఇంట్లోవాళ్లు పెళ్లి చేశారు. రెండేళ్లకే పాప. పెరిగిన బరువు, ప్రసవ సమయంలో, ఆ తరవాతా ఎన్నో సమస్యలు. తను ఆడిన వీడియోలను తనే చూసుకొని ‘తిరిగి ఆడగలనా’ అనుకున్న సందర్భాలెన్నో. కానీ భర్త ఫిలిప్‌ సహకారంతో పాప పుట్టిన ఆరు నెలలకే తిరిగి సాధన మొదలుపెట్టింది. ‘మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. మునుపటిలా మారడానికి ఏడాదిన్నరకు పైగా సమయం పట్టింది. మరోవైపు ‘పాప పుట్టాక ఆటలెందుకు? ఇన్నేళ్లు ఆడింది సరిపోలేదా... కొత్తవారికి అవకాశం ఇవ్వొచ్చుగా’ అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కుటుంబ ప్రోత్సాహమే నడిపిస్తోంది. అమ్మయ్యాక కెరియర్‌ ముగుస్తుందని అనుకుంటారంతా. జాతీయ జట్టులో స్థానం సాధించి, ఆ అభిప్రాయం మార్చాలనుకుంటున్నా. పాపకి దూరంగా ఉండటమూ కష్టమే. కానీ ‘సూపర్‌ మామ్‌’లా నిలిచి, తను గర్వపడేలా చేయాలని కోరిక. అందుకే ‘అమ్మా గెలిచి రా’ అని తనంటోంటే మరింత ఉత్సాహంగా ఆడుతున్నా. తను కోరుకున్నట్టుగా ఈ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో రాణించి, మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికవ్వాలన్నది కల’ అంటోంది 27ఏళ్ల స్నేహదీప్తి.

 కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం


కొబ్బరి మట్ట... ప్లాస్టిక్‌ బాల్‌!

బ్ల్యూపీఎల్‌ వేలం జరుగుతోంది. ఇంట్లోవాళ్లంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంటే... సజన మాత్రం ఆ దరిదాపుల్లో లేదు. గతంలోలా ఎక్కడ నిరాశ పడాల్సి వస్తుందోనన్న భయం. తీరా ఎంపికయ్యాక తొలి మ్యాచ్‌తోనే దేశమంతా తన పేరు మారుమోగేలా చేసుకుందీ గిరిజన అమ్మాయి. కేరళలోని వాయనాడ్‌ సజనాది. నాన్న ఆటోడ్రైవర్‌, అమ్మ మున్సిపాలిటీ కౌన్సిలర్‌. ఎన్ని ఆటలున్నా అబ్బాయిలతో క్రికెట్‌ ఆడటానికే మొగ్గు చూపేది సజన. అమ్మ, బామ్మ వారించినా తీరు మార్చుకోలేదామె. పొలాలే స్టేడియాలు. కొబ్బరి మట్టే బ్యాట్‌, ప్లాస్టిక్‌ బాల్‌తోనే ఆట. ఖోఖో, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, రన్నింగ్‌... ఇలా ఎన్నింట్లో కప్పులు గెలిచినా ఆమె మనసు క్రికెట్‌వైపే పరుగుతీసేది. హైస్కూలుకి వచ్చాక అక్కడి పీఈటీ ప్రోత్సాహంతో అసలైన శిక్షణ పొందింది. జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో రాణించింది. కానీ 18 ఏళ్ల వరకూ తనకు సొంత బ్యాటూ లేదు. పక్క జిల్లాకు పంపాలన్నా ఇంట్లోవాళ్లు చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక బ్యాటు కొనిమ్మని ఎలా అడగగలదు? జిల్లా టీమ్‌కి ఆడేప్పుడు రూ.150 చొప్పున చెల్లించేవారు. రాణిస్తున్న కొద్దీ ఆ మొత్తం పెరుగుతూ వచ్చింది. తన అవసరాలకు ఉంచుకోవడమే కాదు, ఇంటి ఖర్చులకూ ఇచ్చేది. 2018లో క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కేరళ వచ్చినపుడు వీళ్ల టీమ్‌తో సరదాగా మ్యాచ్‌ ఆడారు. ప్రతి బంతినీ బౌండరీ దాటకుండా అడ్డుపడుతున్న సజన ఆయన్ని ఆకర్షించింది. దాంతో ఆటోగ్రాఫ్‌ చేసి మరీ ఆ బ్యాటును ఆమెకి బహుమతిగా ఇచ్చారు. సజన కెరియర్‌లో తొలి బ్యాట్‌ అది. దాంతోనే సెంచరీ సహా ఎన్నో అద్భుతాలు సృష్టించిందామె. అండర్‌-19, 23 రాష్ట్ర జట్టులకు కెప్టెన్‌గా చేసి, విజయాల బాట పట్టించింది. ‘విమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గానూ నిలిచింది. అయితే జాతీయ జట్టులో స్థానం మాత్రం కలగానే నిలిచింది. ఇప్పుడు సజనకి 29 ఏళ్లు. అయినా ఒక్క అవకాశం వస్తుందన్న ఆశే ఆమెను ఇంకా ఆడేలా చేస్తోంది! తాజాగా డబ్ల్యూపీల్‌లో ఎంపికవ్వడంతో తానేంటో నిరూపించుకోవాలనుకుంది. తొలి మ్యాచ్‌లో గెలుపు నీదా నాదా అన్నట్టు సాగుతున్న పోరులో చివరి బంతికి సిక్సర్‌ బాది తన ముంబయి జట్టును విజయతీరాలకు నడిపిందీమె. తన పేరును క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసింది. కురిచినా తెగ నుంచి వచ్చిన రెండో క్రికెటర్‌ సజన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్